విజయ్ సర్కార్ లో కొత్త అధికార కేంద్రం..! దళపతికే తూట్లు పొడిచేలా..!
తమిళనాడులో గత ఎన్నికల తర్వాత అనూహ్య పరిస్ధితుల మధ్య తొలిసారి అధికారంలోకి వచ్చిన విజయ్ (Vijay) నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం (TVK Government) ప్రజల్లో రోజురోజుకూ సానుకూల ముద్ర వేసుకుంటోంది. ముఖ్యంగా కొత్త మంత్రుల వేగవంతమైన నిర్ణయాలు, పరిపాలనా దక్షత పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి విజయ్, "పాలనలో ఏ స్థాయిలోనైనా అవినీతిని సహించే ప్రసక్తే లేదు" అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాత్మక వైఖరి అధికార యంత్రాంగంలో నూతన ఉత్తేజాన్ని నింపింది.
టీవీకే సర్కార్ లో సమాంతర అధికార వ్యవస్ధ (TVK Government)
సచివాలయం నుంచి జిల్లా స్థాయి యంత్రాంగం వరకు, పాలనలో పారదర్శకత కనిపిస్తోందని ఉన్నతాధికారులు అంగీకరిస్తున్నారు. ఈ పరిణామాలు ప్రజల్లో టీవీకే ప్రభుత్వంపై భారీ ఆశలను రేకెత్తించాయి. అయితే, ప్రభుత్వం సాధిస్తున్న ఈ కీర్తికి ఆటంకం కలిగించేలా కొన్ని సంఘటనలు విశ్లేషకులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు ఒక సమాంతర అధికార వ్యవస్థను సృష్టిస్తున్నారనే వాదనలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

అధికారులపై పార్టీ నేతల పెత్తనం
పార్టీలోని కొందరు నేతలు స్థానిక ప్రభుత్వ అధికారుల విధుల్లో జోక్యం చేసుకోవడం,అతిగా ప్రవర్తించడం వివాదాస్పదమవుతోంది. ఉదాహరణకు, తెన్‌కాసి, శంకరన్‌కోవిల్ ప్రాంతాల్లో టీవీకే నేతలు ప్రభుత్వ ఆసుపత్రులు, అమ్మ క్యాంటీన్లలో 'తనిఖీలు' చేపట్టడం చర్చకు దారితీసింది. అలాగే వేలూరులో ఇటుక బట్టీ యజమానుల నుంచి మామూళ్లు వసూలు చేసినందుకు ఒక యూనియన్ సెక్రటరీని తొలగించారు. సేలంలో విద్యార్థులను పార్టీ కార్యక్రమాలకి తరలించిన వ్యవహారంపై విద్యాశాఖ విచారణ జరుపుతోంది. ఇలాంటి సంఘటనలు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజల్లో అసహనాన్ని కలిగిస్తున్నాయి.

క్రమశిక్షణ లేని నేతలు, కార్యకర్తలు
పార్టీలో సరైన క్రమశిక్షణ లేకపోవడమే ఈ అరాచకత్వానికి మూలమన్నది స్పష్టమవుతోంది. క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వాన్ని నియమించి, కార్యకర్తలపై పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీ వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారాన్ని జిల్లా నేతలకు అప్పగించాలి. లేనిపక్షంలో ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉంది. స్వయంగా సీఎం విజయ్ ఈ పర్యవేక్షణ వ్యవహారాలను తీవ్రంగా పరిగణించాల్సి ఉంది. ప్రభుత్వం చేపడుతున్న మంచి పనులు, పార్టీ శ్రేణుల అసమర్థ చర్యల వల్ల వృథా కాకూడదు. ప్రస్తుతం టీవీకే ప్రభుత్వం అనుభవిస్తున్న ఆదరణ, పార్టీలోని క్రమశిక్షణారాహిత్యం వల్ల దెబ్బతినే ఆస్కారం ఉంది. పరిపాలనా సంస్కరణలతో పాటు, పార్టీలో అంతర్గత క్రమశిక్షణను కూడా కఠినంగా అమలు చేస్తేనే టీవీకే ప్రభుత్వం దీర్ఘకాలిక విజయం, సుస్థిరత సాధిస్తుంది.














Click it and Unblock the Notifications