పదోసారి బిహార్ సీఎంగా నితీశ్ కుమార్.. ముహూర్తం ఖరారు..
బిహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కీలక ముందడుగు పడింది. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఎన్డీయే కూటమిలోని ఎమ్మెల్యేలు అందరూ నితీశ్ ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన సీఎం పదవికి లైన్ క్లియర్ అయింది. పదోసారి బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నవంబర్ 20 గురువారం రోజున పాట్నాలోని గాంధీ మైదాన్ లో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఈ కార్యక్రమం జరగనుంది.
ఎన్డీయే కూటమిలోని 202 ఎమ్మెల్యేలతోపాటు కీలక నేతలైన దిలీప్ జైశ్వాల్, సామ్రాట్ చౌదరీ, చిరాగ్ పాస్వాన్, కేశవ్ ప్రసాద్ మౌర్యా, విజయ్ కుమార్ సిన్హా, రాజు తివారీ ఈ సమావేశానికి హాజరై.. ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా నితీశ్ కుమార్ ను ఎన్నుకున్నారు. నితీశ్ కుమార్ పేరును సామ్రాట్ చౌదరీ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా ఆయనకే ఓటేశారు.
మరోవైపు నితీశ్ కుమార్ బిహార్ సీఎంగా రాజీనామా చేశారు. బిహార్ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అంతేకాక ఎన్డీయే కూటమిలోని అన్ని పార్టీల సపోర్ట్ తనకు ఉన్నట్లు లేఖను గవర్నర్ కు అందించారు. దీంతో ఏకంగా పదోసారి బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నవంబర్ 20న పాట్నాలోని గాంధీ మైదానంలో ఆయన ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ మేరకు బిహార్ అసెంబ్లీని బుధవారమే రద్దు చేశారు.

ఇక కొత్త ప్రభుత్వంలో బిహార్ డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరీ, విజయ్ సిన్హా బాధ్యతలు తీసుకోనున్నారు. బిహార్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 202 సీట్లతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 243 సీట్లు ఉన్న బిహార్ అసెంబ్లీలో 202 సీట్లు ఎన్డీయే కూటమి కైవసం చేసుకుంది. దీంతో బీజేపీ 89 సీట్లతో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. జేడీయూకు 85 సీట్లు వచ్చాయి. ది లోక్ జన్ శక్తి పార్టీ 19 సీట్లు అలాగే హ్యామ్ పార్టీ 5, ఆర్ఎల్ఎమ్ పార్టీ 4 సీట్లను కైవసం చేసుకుంది.












Click it and Unblock the Notifications