పండగలొస్తున్నాయ్ జాగ్రత్త: రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు, ఈ జాగ్రత్తలు తీసుకోండి
న్యూఢిల్లీ: వచ్చే పండగల సీజన్లో అక్టోబర్ నుంచి నవంబర్ వరకు పాటించాల్సిన కరోనా వైరస్ మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. భారతదేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ ఇంకా పోలేదని, ఇంకా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రటరీ రాజేష్ భూషణ్ వెల్లడించారు.
కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్రాలకు కేంద్రం పండగల సీజన్ హెచ్చరికలు
దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్స్(ఎస్ఓపీ)లను కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసినట్లు రాజేష్ భూషణ్ తెలిపారు. కంటైన్మెంట్ జోన్లు, 5 శాతం కన్నా ఎక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో ఎక్కువ జనం గుంపులుగా ఉండకూడదని సూచించారు. పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా ఉన్న జిల్లాల్లోనే పరిమిత సంఖ్యలోనే జనం ఉండే కార్యక్రమాలకు అనుమతివ్వాలన్నారు.

వారంలో పాజిటివిటీ రేటను బట్టి ఆంక్షలను విధించడం లేదా సడలించడం లాంటి చర్యలను తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో సెకండ్ వేవ్ కారణంగా అత్యధిక కేసులు, మరణాలను నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రజలు ఆస్పత్రుల్లో బెడ్ల కోసం, ఆక్సిజన్ కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పూర్తిగా ఆంక్షలను సడలించిన కారణంగానే ఆ పరిస్థితి వచ్చిందని కేంద్రం గుర్తు చేసింది.
ప్రస్తుతం కేసులు, మరణాలు తగ్గడంతో మరోసారి ఆంక్షలను ఎత్తివేయడం జరుగుతోందని చెప్పారు. ఇప్పటికీ కేరళ, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కరోనావైరస్ కేసుల వ్యాప్తి తగ్డడం లేదు. ప్రస్తుతం దేశంలో నమోదైన కేసుల్లో 62.73 శాతం కేసులు ఒక్క కేరళ నుంచే ఉన్నాయని రాజేష్ భూషణ్ తెలిపారు. అంతేగాక, 33 జిల్లాల్లో ఇప్పటికీ 10 శాతం కంటే ఎక్కువ పాజిటివిటీ రేటు కొనసాగుతోందని వెల్లడించారు.
మరోవైపు థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారని రాజేష్ భూషణ్ తెలిపారు. ఈ వేవ్‌లో పిల్లలపై కరోనా ఎక్కువగా ప్రభావం ఉండనుందని హెచ్చరిస్తున్నారని చెప్పారు. వైద్య నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రాలు అందుకు తగినవిధంగా ఆస్పత్రుల్లో తగిన విధంగా సదుపాయాలను ఏర్పరచుకోవాలని, కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
Recommended Video
దేశంలో గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కానీ, తాజాగా, 31వేలకు పైనే కొత్త కేసులు వెలుగుచూశాయి. మరణాలు మాత్రం 300కు దిగువనే నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 15,27,443 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 31,923 మందికి కరోనావైరస్ సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.35 కోట్లకుపైగా పెరిగింది. బుధవారం 282 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో మరణించినవారి సంఖ్య 4.46లక్షలకు పెరిగింది. మంగళవారం 31వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.28కోట్లకు పెరిగింది. ప్రస్తుతం రికవరీ రేటు 97.77 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 3,01,640 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 0.90 శాతంగా ఉంది. బుధవారం 71,38 లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు టీకా తీసుకున్నవారి సంఖ్య 83.39 కోట్లకు చేరింది.












Click it and Unblock the Notifications