కరోనా బారిన పడ్డ యోగి ఆదిత్యనాథ్: ఆరోగ్యం ఎలా ఉందంటే?: అఖిలేష్ యాదవ్ కూడా
లక్నో: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్.. దేశవ్యాప్తంగా పంజా విసురుతోంది. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే స్థాయిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఒకవంక కరోనా నిర్మూలన కోసం ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. కరోనా వైరస్ ఇదివరకెప్పుడూ లేనంతగా విజృంభిస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదివరకు లక్షలోపే నమోదవుతూ వచ్చిన రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు.. సెకెండ్ వేవ్‌లో అసాధారణంగా నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు రెండు లక్షలకు చేరువ అయ్యేలా కనిపిస్తున్నాయి.
Recommended Video

తాజాగా- ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కరోనా వైరస్ బారిన పడ్డారు. సెల్ఫ్ ఐసొలేషన్‌లోకి వెళ్లారు. ఈ ఉదయం ఆయనకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను స్వీయ ఐసొలేషన్‌లో ఉన్నానని తెలిపారు. ఈ మధ్యకాలంలో తనను కలిసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా కరోనా నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాలని సూచించారు.

తన ఆరోగ్యం బాగుందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందనక్కర్లేదని చెప్పారు. ప్రభుత్వ కార్యకలాపాలన్నీ యథాతథంగా కొనసాగుతున్నాయని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ఇటీవలే ఆయన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రోడ్ షోలు నిర్వహించారు. బహిరంగ సభలకు హాజరయ్యారు. ఉత్తర ప్రదేశ్‌లో క్షేత్రస్థాయి పర్యటనలను నిర్వహిస్తున్నారు. పార్టీ నేతలు, అధికారులను కలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వైరస్ సోకి ఉండొచ్చని భావిస్తున్నారు.
మరోవంక- ఉత్తర ప్రదేశ్ ప్రతిపక్ష నేత, సమాజ్ వాది పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సైతం కరోనా వైరస్ బారిన పడ్డారు. హోమ్ ఐసొలేషన్‌లోకి వెళ్లారు. లక్నోలోని సమాజ్ వాది పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం సాయంత్రం కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఈ ఉదయం వాటి రిపోర్టులు వచ్చాయి. ఆయన కరోనా సోకినట్లుగా తేలింది. దీనితో అఖిలేష్ యాదవ్ హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నారు. మంగళవారం నాటి బులెటిన్ ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌లో ఒక్క రోజు వ్యవధిలో 18,021 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 85 మంది మరణించారు.












Click it and Unblock the Notifications