UPA Name Change : యూపీఏ పేరు మారబోతోందా ? బెంగళూరు భేటీలో విపక్షాల కీలక నిర్ణయం..!
వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎలాగైనా అధికారంలోకి రానివ్వకుండా చూడాలనే పట్టుదలతో ఉన్న విపక్షాలు..ఇవాళ బెంగళూరులో మరోసారి సమావేశమవుతున్నాయి. గతంలో ఇదే అజెండాతో బీహార్ రాజధాని పాట్నాలో సమావేశమైన విపక్షాలు.. ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు బెంగళూరులో పూర్తిస్దాయిలో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాయి. అయితే ఇందులో మరో కీలక అంశం కూడా చర్చించి ఆమోదించే అవకాశాలున్నాయి.
ప్రస్తుతం కాంగ్రెస్ నేతృత్వంలో ఐక్య ప్రగతిశీల కూటమి(యూపీఏ) పేరుతో కూటమి ఉంది. ఇదే పేరుతో పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కలిసి పనిచేస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ తరహాలో వివిధ పేర్లతో ఉన్న కూటముల్లోనూ భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో ఇలా వివిధ పేర్లతో భిన్న కూటములు ఉండటం సరికాదని భావిస్తున్న విపక్షాలు యూపీఏ పేరునే కాస్త మార్చి మరో కొత్త పేరుతో ముందుకు రావాలని భావిస్తున్నాయి.

ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్డీయే పేరుతో కూటమి నడిపిస్తోంది. దానికి పోటీగా యూపీఏ పేరుతో ఉన్న కూటమిలో ఉండేందుకు తృణమూల్ కాంగ్రెస్, ఆప్ వంటి పలు పార్టీలు నిరాకరిస్తున్నాయి. దీంతో వీటి అభ్యంతరాల్ని పరిగణనలోకి తీసుకుని మరో కొత్త పేరును ప్రతిపాదించి, చర్చించి, ఆమోదించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. బెంగళూరులో రెండు రోజుల పాటు జరిగే ఈ భేటీలో రేపు ఈ కొత్త పేరు ఖరారు చేసే అవకాశాలున్నాయి.
కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో సహా బీజేపీ వ్యతిరేక పార్టీల కొత్త కూటమి ఇకపై యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యుపిఎ) అనే పేరుతో కొనసాగే అవకాశం లేదని విపక్ష పార్టీల నాయకులు చెప్తున్నారు. . మంగళవారం బెంగళూరులో 20కి పైగా పార్టీలు పాల్గొనే మెగా ప్రతిపక్ష సమావేశంలో కొత్త పేరును నిర్ణయించే అవకాశం ఉందని ఆయా నేతలు వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 2004 నుండి 2014 వరకు రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారంలో ఉంది. యూపీఏ ఛైర్ పర్సన్ గా అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పనిచేశారు.












Click it and Unblock the Notifications