మహిళా కమీషన్లలో లైంగిక వేధింపుల బాధితులు.. ఖుష్బూ, స్వాతి మాలివాల్.. ఇలా ఇంకెంత మంది?
తన తండ్రి తనను లైంగికంగా వేధించాడని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ ఇటీవల చేసిన వ్యాఖ్యలను మరచిపోకముందే ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ స్వాతి మాలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జాతీయ మహిళా కమిషన్.. మహిళల సమస్యల పట్ల పోరాటం చేయాల్సిన బృహతరమైన బాధ్యతను భుజాలకి ఎత్తుకున్న శాసనబద్ధమైన సంస్థ. జాతీయ మహిళా కమిషన్ లో ఒక చైర్మన్, ఐదుగురు సభ్యులు, ఒక సభ్య కార్యదర్శి ఉంటారు. మూడేళ్ల పదవీ కాలానికి వీరిని నియమిస్తారు. వీరిని నియమించే హక్కు, తొలగించే హక్కు ఒక్క రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. అసలు ఇంతకాలం జాతీయ మహిళా కమిషన్ అనేక సందర్భాల్లో వార్తల్లోకి వచ్చినప్పటికీ ఇటీవల కాలంలో ఖుష్బూ చేసిన వ్యాఖ్యలతో అందరి దృష్టి మహిళా కమీషన్ పై ఫోకస్ అయ్యింది . ఇక తాజాగా ఢిల్లీ మహిళా కమీషన్ చైర్మన్ స్వాతి మాలివాల్ చేసిన వ్యాఖ్యలతో మరోమారు దేశం ఆలోచనలో పడింది. ఇలా ఇంకెంత మంది అన్నది హాట్ టాపిక్ అవుతుంది.

తండ్రితో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా : ఖుష్బూ
మొన్నటికి మొన్న బిజెపి నాయకురాలు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమితురాలైన ఖుష్బూ తన ఎనిమిదవ ఎట నుంచి తన తండ్రి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, తను తల్లికి చెప్పినా పట్టించుకోలేదని చెబుతూ, 15 ఏట నుండి తన తండ్రిపై తిరుగుబాటు చేయడం మొదలుపెట్టానంటూ పేర్కొని సంచలనం సృష్టించారు. తను బాల్యంలోనే లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని, అది కూడా తన తండ్రి నుండి ఎదుర్కొన్నానని చెప్పిన ఖుష్బూ ఈ విషయం చెప్పడానికి తన సిగ్గుపడడం లేదని, తప్పు చేసినందుకు సిగ్గుపడాల్సింది తన తండ్రి అంటూ పేర్కొన్నారు. ఇక తన తండ్రి తనకు 16 ఏటన మరణించాడని పేర్కొన్న ఖుష్బూ ఇటువంటి సమస్యల విషయంలో మహిళలు, బాలికలు ధైర్యంగా బయటకు రావాలంటూ పేర్కొన్నారు.

తండ్రితో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానన్న ఢిల్లీ మహిళా కమీషన్ చైర్మన్
ఖుష్బూ చేసిన వ్యాఖ్యలను మర్చిపోకముందే ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ స్వాతి మాలివాల్ తాను తన తండ్రి నుండి లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి తనను వేధించాడని ఆవేదన వ్యక్తం చేశారు .తను నాలుగో తరగతి వరకు తన తండ్రి దగ్గర ఉన్నానని, ఆ సమయంలో ఆయన తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని స్వాతి మాలివాల్ పేర్కొన్నారు. తనను ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడని, కొన్నిసార్లు తనను బలంగా కొడితే తన తల పగిలి రక్తం కూడా వచ్చేదని స్వాతి మాలివాల్ తెలిపారు.

ఎప్పుడూ ఏం చెయ్యాలి అనే ఆలోచనతోనే ఉండేదాన్ని: స్వాతి మాలివాల్
ఆయన ఇంటికి వస్తున్నాడు అంటేనే భయమేసి, స్వాతి మాలివాల్ ఆ తర్వాత తను పెరిగి పెద్దయిన క్రమంలో పిల్లల్ని వేధించే వారిని ఏ విధంగా ఎదుర్కోవాలి? వారికి ఎలా బుద్ధి చెప్పాలి? బాధిత మహిళలకు ఏ విధంగా అండదండలు అందించాలి అనే విషయాలను తాను ప్రతిరోజు ఆలోచించే దానిని చెప్పారు. వేధింపులు ఎదుర్కొన్న వారే, వేధింపులకు గురయ్యే బాధితుల సమస్యను అర్థం చేసుకోగలుగుతారని తను నమ్ముతున్నట్టు స్వాతి మాలివాల్ తెలిపారు. పిల్లలను లైంగికంగా వేధించే వారికి తగిన గుణపాఠం చెప్పాలని స్వాతి మాలివాల్ పేర్కొన్నారు.

సమాజంలో అడుగడుగునా లైంగిక వేధింపులేనా?
ఇక వరుసగా మహిళా కమిషన్ సభ్యులు, చైర్మన్ లు ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో మన సమాజంలో మహిళల పైన, చిన్న పిల్లల పైన లైంగిక వేధింపులు ఎంతగా జరుగుతున్నాయి అన్నది చర్చనీయాంశంగా మారింది. మహిళా కమిషన్ చైర్మన్, మహిళా కమిషన్ సభ్యులు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు అంటే సమాజం ఎటువంటి స్థితిలో ఉంది అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక వారిపై లైంగిక వేధింపులు జరిగిన ఇంతకాలం తర్వాత వారు ఈ విషయాలు చెప్పటం ఆలోచించేలా చేస్తుంది. ఇలా బయటకు చెప్పకుండా ఎంత మంది చిన్నారులు, మహిళలు లైంగిక వేధింపులను భరిస్తున్నారో అన్నది హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications