వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టీమ్ కోవిడ్ జాగ్రత్తలపై విడుదల చేసిన వీడియో సందేశం - ప్రెస్ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా మళ్లీ విలయతాండవం చేస్తోంది. ఈ గడ్డు పరిస్థితుల్లో కోవిడ్‌పై పోరాటంలో భాగంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు పలువురు సినీ ప్రముఖులు తమవంతుగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఈ కోవలో 'ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రబృందం చేరింది.

ఈ చిత్రంలోని నటీనటులు రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, అజయ్‌ దేవగణ్‌, అలియాభట్‌తో కలసి దర్శకుడు రాజమౌళి చిన్న వీడియో రూపంలో వినూత్నంగా కోవిడ్‌ సందేశాన్ని ఇచ్చారని ఆంధ్రజ్యోతి ఒక కథనంలో తెలిపింది.

https://twitter.com/RRRMovie/status/1390222486529200133

ఏకకాలంలో దేశ ప్రజలందరికీ చేరేలా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కోవిడ్‌ సందేశాన్ని అందించారు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితులను వివరిస్తూ, ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించి, కలసి కట్టుగా ధైర్యంగా నిలబడి కరోనాను ఎదుర్కోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవటం ద్వారా మన కుటుంబ సభ్యులు, స్నేహితులు, దేశాన్ని కాపాడుకోవాలని సందేశంలో పేర్కొన్నారు.

''కోవిడ్‌ పై పోరాటంలో మాస్క్‌, శానిటైజర్‌లే మన ఆయుధాలు. బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా సామాజిక దూరం పాటించండి’’ అని జూనియర్‌ ఎన్టీఆర్‌ కోరారు. ''గతేడాది పరిస్థితులు మళ్లీ పునరావృతమవుతున్నాయి. మళ్లీ మనందరం కలసికట్టుగా కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన సమయం వచ్చింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కరోనాను ఎదుర్కోండి’’ అని రామ్‌చరణ్‌ స్పందించారు.

''వ్యాక్సిన్‌పై అపోహలను తొలగించుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులను వ్యాక్సిన్‌ తీసుకునేలా ప్రోత్సహించండి. వ్యాక్సిన్‌ తీసుకుంటామని ప్రతి ఒక్కరూ ప్రతిన పూనండి’’ అని అజయ్‌ దేవగణ్‌ సందేశం ఇచ్చారు.

రాజమౌళి తన సందేశంలో ''ఇంటిపట్టునే ఉండటం అన్నింటికంటే ముఖ్యం. అత్యవసరమైతేనే గడపదాటాలి’’ అని చెప్పారు. ''కరోనా రెండో దశలో కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. మాస్క్‌ ధరించటంతో పాటు విధిగా వ్యాక్సిన్‌ తీసుకోవాలి’’ అని అలియా కోరారని ఈ కథనంలో తెలిపారు.

తెలంగాణలో లాక్‌డౌన్ ఉండబోదని స్పష్టం చేసిన కేసీఆర్

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించబోమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారని, లాక్‌డౌన్‌ విధించడం వల్ల ప్రజాజీవనం స్తంభించడంతోపాటు రాష్ట్ర ఆర్థికవ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని తెలిపినట్లు నమస్తే తెలంగాణ కథనం పేర్కొంది.

గత అనుభవాలతోపాటు, ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ విధించినా పాజిటివ్‌ కేసులు తగ్గడం లేదనే విషయాన్ని పరిశీలించిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న సీఎం కేసీఆర్‌ గురువారం ప్రగతిభవన్‌కు వచ్చారు. వచ్చిన వెంటనే రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నతస్థాయి సమావేశాన్నినిర్వహించి, కూలంకషంగా సమీక్షించారు.

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఎందుకు విధించకూడదనే విషయంలో సీఎం కేసీఆర్‌ లోతైన విశ్లేషణచేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ "లాక్‌డౌన్‌ వల్ల ఉపయోగంలేదు. తెలంగాణ.. ఇండియాలో మోస్ట్‌ హ్యాపెనింగ్‌ స్టేట్‌. కనుక ఇక్కడ 25 నుంచి 30 లక్షల మంది ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు వచ్చి పనిచేస్తున్నారు. కరోనా మెదటి వేవ్‌ సమయంలో లాక్‌డౌన్‌ విధిస్తే వీరందరి జీవితాలు చెల్లాచెదురైన పరిస్థితిని చూశాం. వీరంతా వెళ్లిపోతే తిరిగి రావడం కష్టం.

వివిధ రాష్ట్రాలనుంచి వచ్చి రైస్‌మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికులు ఏమౌతారు? లాక్‌డౌన్‌ విధిస్తే ఇంతమంది ఎకడపోతారు? కార్మికులు చెల్లాచెదురైపోతే తిరిగి వారిని రప్పించడం ఎట్లా? కొనుగోలు చేయకపోతే పండించిన వరి ధాన్యాన్ని రైతు ఎకడ పెట్టుకుంటాడు? మెత్తం ధాన్యం కొనుగోలు వ్యవస్థ ఎకడికకడ స్తంభించిపోయే ప్రమాదమున్నది. తద్వారా సంభవించే సంక్షోభం ఘోరంగా ఉండే ప్రమాదం ఉన్నది. అదే సమయంలో నిత్యావసర సరుకులు, పాలు, కూరగాయలు, పండ్లు, ఎమర్జెన్సీ మెడికల్‌ సర్వీసులు, ప్రసవాలు, పారిశుద్ధ్యం వంటి అత్యవసర కార్యక్రమాలను ఆపివేయలేం. ఇతర రాష్ట్రాల నుంచి వ్యాక్సిన్లు, మెడిసిన్లు, ఆక్సిజన్‌తోపాటు ఇతర నిత్యావసరాలను సరఫరా చేసుకుంటున్నం. ఒకవేళ లాక్‌డౌన్‌ విధిస్తే వీటన్నిటికీ ఆటంకం ఏర్పడుతది. ఇన్ని కారణాల వల్ల ప్రభుత్వమే ఒక భయానక పరిస్థితిని సృష్టించినట్లవుతుంది. అందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు, కాబట్టి లాక్‌డౌన్‌ విధించలేం.

పరిశ్రమలు ఉన్నపళంగా మూతపడితే అంతా ఆగమాగం కాదా? క్యాబ్‌, ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏమిటి? కొన్ని లక్షల కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి తలెత్తి మొత్తం వ్యవస్థ కుప్పకూలే ప్రమాదమున్నది. కరోనా ఏమోగానీ ఆకలి సంక్షోభం తలెత్తే ప్రమాదమున్నది. గొంతు పిసికినట్టు చేస్తే మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నది. కాబట్టి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, లాక్‌డౌన్‌ విధించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది" అని సీఎం తెలిపారని ఈ పత్రికలో రాశారు.

జగన్

ఆరోగ్యశ్రీకి సగం పడకలను ఇవ్వాలి - ఏపీ సీఎం జగన్

"కోవిడ్‌ పరీక్షల్లో మన రికార్డులు మనమే బద్దలు కొడుతున్నాం. ఇప్పుడు చికిత్సకు అవసరమైనట్లుగా పడకల సంఖ్య మరింత పెంచాలి. చికిత్స అందించేందుకు తీసుకున్న అన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలి. ఎక్కడా తేడా రాకూడదు. ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ పరిధిలోని ఆసుపత్రులతో సహా అన్నిచోట్లా కోవిడ్‌ చికిత్స ఒకేలా ఉండాలి. ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే(ఎంప్యానెల్‌) ఆసుపత్రులతోపాటు, కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్‌ఎంప్యానెల్‌ ఆసుపత్రుల్లోనూ సగం పడకలను ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేసేందుకు ఇవ్వాలి’’ అని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులకు నిర్దేశించారని ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది.

''అన్ని కోవిడ్ ఆసుపత్రుల్లోనూ నాణ్యమైన ఆహారం, పారిశుద్ధ్యం, వైద్యులు, వైద్య సదుపాయాలు, ఆక్సిజన్‌.. ఈ అయిదూ ఉండేలా చూసుకోవాలి. వైద్యులు లేకుంటే వెంటనే నియమించాలి’’ అని ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌ పరిస్థితులపై అధికారులతో గురువారం సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే...

* ఆరోగ్యశ్రీ పరిధిలోని ఆసుపత్రులు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్ని పడకలు కొవిడ్‌ రోగులకు కేటాయించారన్న దానిపై పూర్తి స్పష్టతకు రావాలి. దీనివల్ల మొత్తం కోవిడ్‌ చికిత్సకు ఎన్ని పడకలు అందుబాటులో ఉన్నాయి? ఎక్కడెక్కడ అవి ఉన్నాయో తెలుస్తుంది.

* కోవిడ్ రోగులకు వైద్యమంతా ఉచితంగా అందాలి. ఆసుపత్రులు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయకుండా చూడాలి. 104 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ వస్తే బాధితులు ఉన్న ప్రాంతాన్ని బట్టి జిల్లా యంత్రాంగం స్పందించి ఆయా ఆసుపత్రుల్లో వారిని చేర్పించాలి. ఫోన్‌ వచ్చిన 3 గంటల్లో పడక కేటాయించాలి. అలా చేయలేకపోతే కారణాలు గుర్తించాలి.

* అన్ని కోవిడ్‌ ఆసుపత్రుల సమీపంలోనే కోవిడ్ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తే ఇక్కడి వైద్యులే అక్కడ కూడా సేవలందించేందుకు వీలుంటుంది. కేర్‌ సెంటర్లలో అన్ని వసతులూ ఉండాలి.

* ఆక్సిజన్‌ సరఫరా, నిల్వలో ఎక్కడా లోపం తలెత్తవద్దు. కేంద్రం నుంచి ఇంకా ఎక్కువ ఆక్సిజన్‌ ట్యాంకర్లు వచ్చేలా కృషి చేయాలి. ప్రతి బోధనాసుపత్రి వద్ద 10కేఎల్‌ సామర్థ్యం, ఇతర ఆసుపత్రుల వద్ద ఒక కేఎల్‌ సామర్థ్యంతో ఆక్సిజన్‌ నిల్వ చేసుకోవాలి. రోజుకు 500 టన్నుల ఆక్సిజన్‌ కావాలంటే ఏం చేయాలో ఆలోచించండి. సరఫరా, నిల్వ ఎలా అన్నది చూడండి.

వైద్యం

ఏపీలో ఆస్పత్రులపై విజిలెన్స్‌ దాడులు

ఏపీలో వరుసగా పలు ఆస్పత్రులపై విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారని, ఈ క్రమంలో గత రెండు రోజులలో పలు ఆసుపత్రులపై కేసులను నమోదు చేసినట్టు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పేర్కొన్నారని సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది.

కాగా, ఏపీ వ్యాప్తంగా ఇ‍ప్పటి వరకు 30 ఆసుపత్రులపై దాడులు నిర్వహించిన విజిలెన్స్‌ అధికారులు 6 ఆస్పత్రులపై కేసులను నమోదు చేశారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని ఒక ఆస్పత్రిపై అధిక ఫీజులు వసూలు చేసినందుకు కేసు నమోదు చేశారు.

అదే విధంగా చిత్తూరు జిల్లా పుత్తూరు సుభాషిణి ఆస్పత్రిపై ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించడానికి నిరాకరించినందుకు కేసును నమోదు చేశారు. విజయవాడలోని వేదాంత ఆస్పత్రి, శ్రీకాకుళంలోని సూర్యముఖి ఆస్పత్రులు పేషెంట్లు స్వంతంగా రెమిడిసివర్‌ తెచ్చుకోవాలని పట్టుబట్టడంతో వాటిపై కూడా కేసులను బుక్‌ చేశారు.

కడప జిల్లా సిటీ కేర్‌ ఆస్పత్రి కరోనా బాధితుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేసింది. పైగా వాటికి బిల్లులు ఇ‍వ్వలేదని ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో ఫిర్యాదులు అందిన ప్రతి ఆస్పత్రులపై కేసులను నమోదు చేసినట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెండ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారని ఈ వార్తలో రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Video message released by RRR movie team Covid on precautions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X