హైకోర్టు హద్దు దాటింది..! సుప్రీం మెట్లెక్కిన విజయ్..!
తమిళనాడులో సంపూర్ణంగా గోవధ నిషేధించాలంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను విజయ్ సర్కార్ (Vijay Govt) సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తమిళనాడు పశు సంరక్షణ చట్టం 1958లోని సెక్షన్ 4 కింద అనుమతించబడిన సందర్భాలు మినహా రాష్ట్రంలో గోవధపై పూర్తి నిషేధాన్ని విధిస్తూ మద్రాస్ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సెక్షన్ ప్రకారం, 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండి, పనికి లేదా సంతానోత్పత్తికి పనికిరానిదిగా ఉండి, అధికారులు ధృవీకరించబడిన ఆవును మాత్రమే వధించడానికి అనుమతి ఉంది.
గోవధపై పూర్తి నిషేధాన్ని విధించడం ద్వారా హైకోర్టు చట్ట పరిధిని దాటిందని, ఈ ఉత్తర్వు చట్టంలోని నిబంధనల పరిధిని మించిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్‌లో ఆరోపించింది. జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్, జస్టిస్ వి. లక్ష్మీనారాయణ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ మే 27న ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఉత్తర్వులో జంతు వధ కేవలం నిర్దేశిత కబేళాల్లో మాత్రమే జరగాలని పేర్కొంటూనే, బక్రీద్ రోజున లేదా మరే ఇతర రోజున కూడా ఆవును గానీ, దూడను గానీ వధించకుండా చూడాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, సీనియర్ పోలీసు అధికారుల్ని ఆదేశించింది.

ఈ ఉత్తర్వును అమలు చేసేలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అధికారులకు తగిన సూచనలు జారీ చేయాలని కోర్టు అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలు అంతర్గతంగా పరస్పర విరుద్ధమైన తీర్పుకు దారితీశాయని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. బహిరంగ ప్రదేశాలలో ఆవులను అక్రమంగా వధించడాన్ని నివారించాలని ఆదేశాలు కోరుతూ ఇందూ మక్కల్ కచ్చి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్య దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ ఉత్తర్వును జారీ చేసింది. అధికారులకు దీనిపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని పిటిషనర్ ఆరోపించారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. పలు ప్రభుత్వ చట్టాల్ని, సుప్రీంకోర్టు తీర్పుల్ని ఆధారంగా తీసుకుని ఈ నిషేధం విధించింది.














Click it and Unblock the Notifications