విజయ్ మాస్టర్ స్ట్రోక్..! సొంత గూట్లో శత్రువులకు ప్రత్యర్దితో చెక్..!
తమిళనాడు రాజకీయాల్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చి, అరంగేట్రంలోనే సీఎం అయిన టీవీకే అధినేత విజయ్ (Vijay).. అప్పుడే రాజకీయాన్ని బాగా వంట బట్టించుకున్నారు. సీఎం అయ్యే క్రమంలో తాను ఎదుర్కొన్న పరిస్ధితుల వల్లో, మరే ఇతర కారణంతోనో తమిళ రాజకీయాన్ని ఆకళింపు చేసుకున్న విజయ్.. ఇప్పుడు సొంత గూట్లో ఉన్న మిత్రపక్షాలకే షాకులిస్తున్నారు. పేరుకు మిత్రులుగా ఉంటూ ఆయన్ను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్న వారికి తాజాగా చెక్ పెట్టేశారు.
కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్, కమ్యూనిస్టుల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో విజయ్ .. అన్నాడీఎంకేకు చెందిన రెబెల్స్ ను కూడా వారి ఆఫీసుకు వెళ్లి కలిశారు. అనంతరం బలపరీక్షలో వారి మద్దతు పొందడంలో సక్సెస్ అయ్యారు. దీంతో విజయ్ రాజకీయాల్లో అప్పుడే ఆరితేరారని అందరికీ అర్దమైంది. దీనికి కొనసాగింపుగా మంత్రివర్గ విస్తరణలోనూ అన్నాడీఎంకే రెబెల్స్ కు స్ధానం కల్పించడం ద్వారా ప్రభుత్వాన్ని సుస్దిరం చేసుకోవాలనుకున్నారు. దీంతో సీపీఎం, వీసీకే హెచ్చరికలకు దిగాయి. అన్నాడీఎంకే రెబెల్స్ కు ప్రభుత్వంలో చోటిస్తే తాము మద్దతు ఉపసంహరిస్తామని తేల్చేశాయి.

దీంతో ప్రస్తుతం ఉన్న మిత్రులకే కేబినెట్ విస్తరణలో చోటిస్తామని విజయ్ తేల్చిచెప్పేశారు. అయితే తెరవెనుక మాత్రం మిత్రపక్షమై వీసీకే అధినేత బెదిరింపుల్ని విజయ్ సీరియస్ గా తీసుకున్నారు. కానీ విజయ్ ఎక్కడా కోపాన్ని ప్రదర్శించకుండా, ప్రత్యామ్నాయ ప్రణాళికను ఆలోచించారు. మొదట్లోనే ఇలా బెదిరిస్తే, ఐదేళ్లు సుస్థిర పాలన ఎలా ఇవ్వగలం? ఈ రోజు తిరుమావళవన్, రేపు కాంగ్రెస్, ఆ తర్వాత కమ్యూనిస్టులు. బెదిరింపుల మధ్య మంచి పాలన అందించడమెలా? అని తన సన్నిహితులు జాన్, ఆధవ్, విష్ణు, బుస్సీ ఆనంద్‌ల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

ఈ చర్చల నుంచే ఒక వ్యూహం రూపుదిద్దుకుంది. అది తమకు మద్దతిచ్చే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఉపఎన్నికలు ఎదుర్కోవడం. దీని ద్వారా మెజారిటీని బలోపేతం చేసుకోవాలనే ప్రణాళిక అమలు చేస్తున్నారు. సీఎం విజయ్ ప్రణాళికను ఊహించని తిరుమావళవన్.. కోయంబత్తూరులో మీడియాతో మాట్లాడుతూ "అన్నాడీఎంకే సభ్యులు రాజీనామా చేసి టీవీకేలో చేరడాన్ని వీసీకే ఆరోగ్యకరమైన పరిణామంగా చూడటం లేదన్నారు. అలాగే విజయ్ తో పాటు టీవీకే నేతల్ని ఉద్దేశించి.. తాము ఎట్టి పరిస్థితులలోనూ మీ ప్రభుత్వం కూలిపోడానికి అవకాశం ఇవ్వబోమన్నారు. ఐదేళ్లు నమ్మకంతో పాలించాలన్నారు. రాజీనామా చేసి వచ్చే ఎమ్మెల్యేల్ని టీవీకేలో చేర్చుకోవడం మీ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది, కాబట్టి, టీవీకే నాయకత్వం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. కానీ టీవీకే వర్గాల ప్రకారం ఉపఎన్నికల్లో టీవీకే తరఫున నిలబెట్టే ఈ అభ్యర్ధులు గెలిస్తే.. వీసీకే మద్దతు అవసరం లేదని విజయ్ తేల్చేసే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications