NEET ను పూర్తిగా రద్దు చేయాలి: ప్రధాని మోదీకి విజయ్ లేఖ
నీట్- యూజీ 2026 పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా పరీక్ష రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తమిళనాడులో జాతీయ వైద్య ప్రవేశ పరీక్షకు వ్యతిరేకత మరోసారి రాజుకుంది. 12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్య ప్రవేశాలను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి విజయ్ డిమాండ్ చేశారు. తాజా పరిణామం వ్యవస్థలోని లోపాలను బయటపెట్టిందని ఆయన స్పష్టం చేశారు.
నూతనంగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఈ అంశం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మే 3న నిర్వహించిన పరీక్షను రద్దు చేయగా, నీట్ పై ప్రభుత్వ వైఖరిని ఒక సభ్యుడు ప్రశ్నించారు. ఈ చర్చలో పాల్గొన్న ఎంఎంకె అధ్యక్షుడు ఎంహెచ్. జవహిరుల్లా నీట్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం దృఢమైన వైఖరి తీసుకోవాలని కోరారు.
"నీట్ తమిళనాడు వంటి ప్రగతిశీల రాష్ట్రానికి ఒక మచ్చగా చూడాలి. కొత్త ప్రభుత్వం నీట్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయం తీసుకోవాలి. వైద్య కోర్సుల ప్రవేశాలు కేవలం 12వ తరగతి మార్కుల ఆధారంగానే జరిగేలా చూడాలి" అని ఆయన సభలో అన్నారు. కొద్ది గంటల తర్వాత విజయ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. నీట్ ప్రవేశపెట్టినప్పటి నుండి తమిళనాడు వ్యతిరేకతను ప్రస్తుత వివాదం సమర్థించిందని తెలిపారు.
"ఈ రద్దు దేశవ్యాప్తంగా లక్షలాది వైద్య ఆశావహుల ఆశలను, ఆకాంక్షలను ఛిద్రం చేసింది" అని ఎన్‌టీఏ పరీక్ష రద్దు చేశాక ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ కేసు విచారణకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి బదిలీ అయింది. నీట్-యూజీ 2026 పరీక్ష దేశవ్యాప్తంగా 5,432 కేంద్రాల్లో, తమిళనాడులోని 31 నగరాల్లో సహా నిర్వహించారు. దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరుకాగా, ఇందులో రాష్ట్రం నుండి దాదాపు 1.4 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు.

2024 నీట్ వివాదంతో పోలుస్తూ, గతంలో లీకేజీలు, అవకతవకలపై ఎఫ్‌ఐఆర్‌ల తర్వాత కేంద్రం మాజీ ఇస్రో ఛైర్మన్ కె. రాధాకృష్ణన్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని విజయ్ గుర్తుచేశారు. ఆ కమిటీ 95 సిఫార్సులు చేసినప్పటికీ, రెండేళ్లలోనే మరో లోపం బయటపడిందని ఆయన ఎత్తి చూపారు. తమిళనాడు దీర్ఘకాల వైఖరిని పునరుద్ఘాటిస్తూ, నీట్ గ్రామీణ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులపై, తమిళ మాధ్యమ విద్యార్థులపై మరియు ఆర్థికంగా బలహీన వర్గాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని విజయ్ అన్నారు. నీట్‌ను రద్దు చేసి, 12వ తరగతి మార్కుల ఆధారంగా రాష్ట్రాల కోటాలోని ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ సీట్లను భర్తీ చేయడానికి రాష్ట్రాలను అనుమతించాలని ఆయన కేంద్రాన్ని కోరారు.












Click it and Unblock the Notifications