కరూర్ తొక్కిసలాట.. విజయ్ బిగ్ డెసిషన్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరూర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సెప్టెంబర్ 27 తమిళనాడులోని కరూర్ లో నిర్వహించిన పొలిటికల్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తమిళగ వెట్రి కజగం(TVK) అధినేత విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత అంటే అక్టోబర్ 27 సోమవారం రోజున బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. మామల్లాపురంలోని ఓ రిసార్టులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన బాధిత కుటుంబాలను కలిసి వారిని ఓదార్చనున్నారు.
కరూర్ తొక్కిసలాట బాధితులను టీవీకే అధ్యక్షుడు విజయ్ కలవనున్నట్లు టీవీకే పార్టీకి చెందిన టాప్ లెవెల్ నేత మీడియాకు తెలిపారు. అక్టోబర్ 27 సోమవారం రోజున మామల్లాపురంలోని ఓ హోటల్ లో నిర్వహించిన కార్యక్రమంలో కరూర్ బాధిత కుటుంబాలను విజయ్ పరామర్శించనున్నట్లు స్పష్టం చేశారు. అయితే తొలుత ఈ కార్యక్రమాన్ని కరూర్ లోని ఓ బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేయాలని భావించారు. కానీ భద్రత కారణాల దృష్ట్యా ఇలా ఓ రిసార్టులో నిర్వహించాలని టీవీకే పార్టీ నిర్ణయానికి వచ్చింది.
కరూర్ లో సమావేశం నిర్వహించేందుకు పర్మిషన్ కోరుతూ అక్టోబర్ 8 న డీజీపీకి లేఖ అందించింది టీవీకే పార్టీ. టీవీకే అధినేత విజయ్ కు వై- సెక్యూరిటీ భద్రత ఉంది కాబట్టి తగు ఏర్పాట్లు చేయాలని లేఖలో పేర్కొంది. అయితే కరూర్ ఎస్పీ కు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేలా ఓ ప్రతినిధిని ఏర్పాటుచేసుకోవాలని డీజీపీ స్పష్టం చేశారు. మరోవైపు కార్యక్రమం నిర్వహించేందుకు కరూర్ లో అనువైన ప్రదేశం లేదని టీవీకే పార్టీ భావించింది. అందువల్ల తమ సమావేశాన్ని మామల్లాపురానికి ఓ రిసార్ట్ కు మార్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు టీవీకే పార్టీ రిసార్టులో 50 గదులు బుక్ చేసినట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్ 27 న కరూర్ లో టీవీకే పార్టీ నిర్వహించిన కార్నర్ మీటింగ్ కు లక్షలాది మంది కార్యకర్తలు, ఫ్యాన్స్ రావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. విజయ్ రావాల్సి న సమయం కంటే 7 గంటలు ఆలస్యంగా రావడం కారణంగా తొక్కిసలాట జరిగినట్లు డీఎంకే ప్రభుత్వం ఆరోపిస్తోంది. తొక్కిసలాట ఘటన తర్వాత టీవీకే పార్టీకి చెందిన కొందరు స్థానిక నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications