Viral Video: పాకిస్తాన్‌లో భగత్ సింగ్‌ను ఉరితీసిన చోటు ఇప్పుడెలా ఉందో తెలుసా?
Viral Video: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అమరవీరులైన షహీద్ భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురుల ప్రాణత్యాగం చెరగని ముద్ర వేసింది. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఈ ముగ్గురు వీరులను 1931 మార్చి 23న అవిభక్త భారతదేశంలోని లాహోర్ సెంట్రల్ జైలులో బ్రిటీష్ ప్రభుత్వం ఉరితీసింది. అయితే దశాబ్దాల కాలంలో ఆనాటి లాహోర్ జైలు ఉన్న ప్రాంతం నేడు ఎలా మారిందనే విషయాన్ని పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన ఓ యాత్రికుడు తన కెమెరాలో బంధించడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జైలు ప్రాంగణం నుంచి షాద్మాన్ చౌక్ వరకు..
పాకిస్తాన్‌లోని లాహోర్‌లో పర్యటించిన ఓ భారతీయ పర్యాటకుడు స్థానికులను విచారించి భగత్ సింగ్‌ను ఉరితీసిన ప్రదేశానికి చేరుకున్నాడు. ఒకప్పుడు సెంట్రల్ జైలులో భాగంగా ఉన్న ఉరితీత ప్రాంగణం కాలక్రమేణా జైలు కూల్చివేత తర్వాత ప్రస్తుతం షాద్మాన్ చౌక్ అనే ప్రధాన కూడలిగా మారినట్లు ఆయన తెలిపారుయ ఈ చౌరస్తా వద్ద నిలబడి తీసిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అనేక మంది భారతీయులు ఆ చారిత్రక ప్రదేశాన్ని చూసి గర్వంతో భావోద్వేగానికి గురయ్యారు.

పాకిస్థాన్ లోని కేవలం ఉరితీసిన కూడలినే కాకుండా.. ఫైసలాబాద్‌లోని భగత్ సింగ్ పూర్వీకుల ఇంటిని కూడా కొందరు స్థానిక మేధావులు, చరిత్రకారులు సంరక్షిస్తుండటం విశేషం. అంతే కాకుండా స్వాతంత్య్రానికి పూర్వం నాటి భవనాలు, బ్రిటీష్ అధికారి సాండర్స్ పై దాడి జరిగిన పరిసరాలను కూడా ఆ భారతీయ యాత్రికుడు తన వీడియో ద్వారా ప్రపంచానికి చూపించారు.
షాద్మాన్ చౌక్ కు భగత్ సింగ్ పేరు పెట్టాలని డిమాండ్
ఆ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలర్పించిన ముగ్గురు యోధులకు గౌరవసూచకంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఆ షాద్మాన్ కూడలికి "షహీద్ భగత్ సింగ్ చౌక్" అని పేరు పెట్టాలని.. అక్కడ వారి స్మారక చిత్రాలను లేదా విగ్రహాలను ఏర్పాట్లు చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. విభజన జరిగినప్పటికీ.. దేశం కోసం పోరాడిన అమరవీరుల పట్ల సరిహద్దులకతీతంగా ఉన్న గౌరవభావానికి ఈ ఘటన ప్రతీకగా నిలిచింది.




Click it and Unblock the Notifications