Opinion: పార్టీల బలహీనతే 'పీకే' బలం?
ఎన్నికలొస్తే ఓటమిపాలవుతామేమోననే భయం రాజకీయ పార్టీలకు బలహీనతగా మారుతోంది. ఆ బలహీనతనే ప్రశాంత్ కిషోర్ లాంటి రాజకీయ వ్యూహకర్తలు తమ బలంగా మార్చుకుంటున్నారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలుచేసి, ప్రజారంజకమైన పరిపాలనను అందించే పార్టీలకుకానీ, ప్రభుత్వాలకుకానీ ప్రశాంత్ కిషోర్‌లాంటివారి అవసరం ఉండదు.

అధికారం కోసం అడ్డదారులు
ఎప్పుడైతే అలవికాని హామీలనిచ్చి అధికారం చేజిక్కించుకుంటారో అప్పటినుంచే పాలకులకు భయం పట్టుకుంటుంది. ఆ భయం మళ్లీ అధికారంలోకి రావాలనే పట్టుదలను కలగజేస్తుంది. దాంతో ఎన్ని అడ్డదారులు తొక్కైనా అధికారం చేజక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ ప్రయత్నంలోనే ప్రశాంత్ కిషోర్‌లాంటివారిని ఆశ్రయిస్తున్నారు.

కుటిలనీతితో సమాజంలో విద్వేషాలు
మూడురకాల నీతుల్లో ఒకటైన కుటిలనీతిని ఆసరాగా చేసుకొని సోషల్ మీడియాద్వారా సమాజంలో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయపార్టీల మధ్య మైండ్ గేమ్ ఆడుతూ తమకు భారీ ప్యాకేజీ ఇచ్చిన పార్టీలను గెలిపించడమే ఈతరహా వ్యూహకర్తల విధి. పీకేలాంటివారు చేపట్టిన ప్రాజెక్టులు పలు రాష్ట్రాల్లో విజయవంతం కావడంతో అందరూ ఆయన్నే ఆశ్రయిస్తున్నారు.

సీనియర్ నేతలు కూడా అంతేనా?
సీనియర్ రాజకీయవేత్తలు కూడా తమ సహజమైన ఎత్తుగడలను, దశాబ్దాల తరబడి ఉన్న రాజకీయ అనుభవాన్ని కూడా వదిలేసి పీకేలాంటివారివెంట పరుగులు తీస్తుండటమే వైచిత్రి. ఏదో ఒక రాష్ట్రంలో పీకే పనిచేసిన పార్టీ ఓటమిపాలైతే షరామాములే. అప్పటివరకు ఆయన వెంట పరుగులు తీసినవారే తొంగిచూడరు. మనకు విలువైన ఓటు వేసి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలకు ఏది అవసరమో తెలుసుకొని అది అందజేయాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై ఉంటుంది. ఆ బాధ్యతను విస్మరించిన ప్రభుత్వాలే ఈ తరహా రాజకీయ వ్యూహకర్తల కోసం అర్రులు చాస్తున్నాయి.

కీలెరిగి వాత పెట్టాలి
తమ విధిని తాము సక్రమంగా నిర్వర్తించే ప్రభుత్వాలకు పీకేలాంటివారి అవసరం ఉండదు. ఏ పార్టీలైనా, ప్రభుత్వాలైనా ఇలాంటి వ్యూహకర్తల కోసం పరుగులు తీస్తున్నాయంటే తాము ప్రజారంజకంగా పరిపాలన చేయలేదని పరోక్షంగా చెబుతున్నట్లవుతోంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సందర్భాను సారంగా పార్టీలకు ఓటెరిగి వాత పెడితే చాలు..!!












Click it and Unblock the Notifications