వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొందరు వందేళ్లకు పైగా జీవించడానికి కారణమేంటి... ఏమిటీ మిస్టరీ?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
వృద్దాప్యం

35 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి వచ్చే పదేళ్లలో చనిపోయే అవకాశం 1.5 శాతం మాత్రమే ఉంటుంది. కానీ అదే వ్యక్తికి 75 ఏళ్లు ఉన్నప్పుడు, ఆయనకు 85ఏళ్లు వచ్చేలోపు మరణించే అవకాశం 45శాతం ఉంటుంది.

దీన్ని బట్టి చూస్తే వృద్ధాప్యం అనేది మన ఆరోగ్యంపై ఎంత చెడు ప్రభావం చూపిస్తుందో స్పష్టంగా తెలుస్తోంది.

కానీ, వృద్ధాప్యాన్ని నియంత్రించే ప్రక్రియను, ఆ వయసులో వచ్చే వ్యాధులను అర్థం చేసుకోవడంలో సైన్స్ చాలా పురోగతి సాధించింది.

పరస్పరం దగ్గరి సంబంధం ఉన్న కొన్ని జీవ ప్రక్రియలు జీవితం తొలి దశలో మనం ఆరోగ్యంగా ఉండటానికి సాయం చేస్తూ ఉంటాయి.

స్టెమ్ సెల్స్ సరఫరా, కణాల మధ్య కమ్యూనికేషన్ వీటిలో కొన్ని. వీటిని కొన్నిసార్లు 'హాల్‌మార్క్ ఆఫ్ ఏజింగ్' అని కూడా పిలుస్తుంటారు.

ఈ జీవ ప్రక్రియలు విఫలం అవుతున్నప్పుడు మనకు సమస్యలు మొదలవుతాయి.

ముసలితనానికి కారణమేంటి..

వీటిలో ఏదో ఒక జీవ ప్రక్రియను లక్ష్యంగా చేసుకున్నప్పుడు, వయసు మీద పడటం వల్ల వచ్చే సమస్యలు అంటే డయాబెటిస్, కిడ్నీ సమస్యల వంటివి తగ్గుతాయా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయి.

ఇప్పటి వరకు అధ్యయనాలు సాఫీగానే సాగుతున్నాయి. కానీ వృద్ధాప్యానికి సంబంధించిన కీలక ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకలేదు.

వృద్ధాప్యానికి కారణమేంటి.. దాన్ని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై అమెరికన్ ఫెడరేషన్ ఫర్ ఏజింగ్ రిసెర్చ్ - ఏఎఫ్ఏఆర్ సంస్థ ఇటీవలే ఈ రంగంలోని ప్రముఖ శాస్త్రవేత్తలు, డాక్టర్లతో కలిసి వరుస సమావేశాలు నిర్వహించింది.

వందేళ్లకు పైగా జీవించే వ్యక్తుల శరీర జీవ క్రియలో ప్రత్యేకత ఏంటో, అదెలా ఉంటుందో ముందుగా అర్థం చేసుకోవాలని వాళ్లందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు.

కుక్కలు శునకాలు

వందేళ్లకు పైగా బతికే వారి శరీరంలో ఉన్న ప్రత్యేకత ఏంటి?

చాలా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టే కొందరు వందేళ్లకు పైగా జీవించగలుగుతున్నారని మనకు తెలుసు.

సాధారణ ప్రజల కంటే వాళ్లు అదనంగా మరో 30 సంవత్సరాలు మరింత ఆరోగ్యంగా ఉంటున్నారు. చివరికి అనారోగ్యానికి గురైనప్పుడు కూడా అది చాలా తక్కువ కాలం మాత్రమే వారిని బాధపెడుతుంది.

ఈ అనారోగ్యం తక్కువ కాలం ఉండటం వాళ్లకు మంచి చేస్తుంది. అదే విధంగా సమాజానికి కూడా ఇది మంచే చేస్తుంది.

అమెరికాలో వందేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం జీవించే వ్యక్తుల చివరి రెండు సంవత్సరాల్లో, వారికి అయ్యే వైద్య ఖర్చులు.. 70 ఏళ్ల వయసులో చనిపోయే వ్యక్తుల వైద్య ఖర్చుల్లో మూడింట ఒక వంతు మాత్రమే ఉంటాయి.

సాధారణంగా వందేళ్లు బతికే వారికి 70ఏళ్ల వయసులో అసలు డాక్టర్ దగ్గరకు వెళ్లే అవసరమే రాదు.

అలాగే అలాంటి వాళ్ల పిల్లలు కూడా మిగతా వారితో పోలిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు. అంటే తల్లిదండ్రుల నుంచి ఏవో ప్రయోజనకరమైనవి వారికి వారసత్వంగా వస్తున్నాయి.

కానీ అవి జన్యు సంబంధమైనవా.. లేక వాళ్లు పెరిగే పరిస్థితులా?

వృద్దాప్యం, ముసలితనం

వందేళ్లకు పైగా బతికిన వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

ఆరోగ్యంపై నిరంతరం శ్రద్ధపెడుతూ, పౌష్టికాహారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తే పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉంటారని చాలామంది అనుకుంటారు.

బరువు పెరగకుండా చూసుకుంటూ, పొగతాగకుండా, మద్యం పరిమితంగా తీసుకుంటూ, రోజుకు కనీసం ఐదు రకాల పండ్లు, కూరగాయలు తింటూ, క్రమం తప్పకుండా వ్యాయాయం చేసే వారి ఆయుర్దాయం, ఈ పనులు చేయని వారితో పోలిస్తే 14 సంవత్సరాలు పెరుగుతుంది.

బ్రిటన్‌లోని సంపన్న, వెనకబడిన ప్రాంతాల్లో పరిశీలించినప్పుడు ఈ విషయంలో చాలా వ్యత్యాసం కనిపించింది. అంటే వందేళ్లకంటే ఎక్కువ కాలం జీవించడంలో ఇదొక కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు.

కానీ ఆశ్చర్యంగా ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు లేని వాళ్లు కూడా వయసులో సెంచరీ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి.

వందేళ్లకు పైగా బతికిన సుమారు 60శాతం మంది ఆష్కెనాజీ యూదులు పొగరాయుళ్లని ఒక అధ్యయనం చెబుతోంది.

పశ్చిమ జర్మనీ, ఉత్తర ఫ్రాన్స్‌ సరిహద్దుల వెంట రైన్‌ నదీ తీరంలో రైన్‌లాండ్ వాలీలో జీవించిన వారిని ఆష్కెనాజీలని పిలుస్తారు. క్రూసేడుల తర్వాత వీళ్లు పోలండ్, లిథువేనియా, రష్యాలకు వలస వెళ్లారు.

వందేళ్లు బతికిన ఆష్కెనాజీ యూదుల్లో సగం మంది ఊబకాయంతో బాధపడ్డారని, సగం కంటే తక్కువ మంది తరచూ వ్యాయామం చేసేవారని, వారిలో మూడుకంటే తక్కువ శాతం మందే శాకాహారులని ఈ అధ్యయనంలో తేలింది.

వందేళ్లు బతికిన వారి పిల్లలు కూడా మిగతా సాధారణ పిల్లలతో పోలిస్తే వారి ఆరోగ్యం పట్ల ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయినప్పటికీ.. ఒకే రకమైన ఆహారం తిని, అదే స్థాయిలో సంపద, అదే శరీర బరువు ఉన్న ఇతర వ్యక్తులతో పోల్చి చూసినప్పుడు.. సెంచరీ కొట్టిన వారిలో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కూడా తక్కువే.

అంటే ఆ వ్యక్తుల్లో అసాధారణమైన విషయం ఏదో దాగుంది.

వృద్దాప్యం, ముసలితనం

అతిపెద్ద రహస్యం

వారిలో ఉండే ప్రత్యేక జన్యువులే ఎక్కువ కాలం బతకడానికి కారణమా?

అదే నిజమైతే దీనికి రెండు మార్గాలు ఉండొచ్చు.

వందేళ్లకు పైగా బతికే వారిలో జీవితకాలాన్ని పొడిగించే అసాధారణ జన్యువులు ఉండొచ్చు. లేదా ముసలితనంలో వ్యాధులు, ఇతర సమస్యలను కలిగించే జన్యువులు వారి శరీరంలో లేకపోయి ఉండొచ్చు.

అయితే, సాధారణ ప్రజల్లో ఉండే అన్ని చెడు జన్యు వేరియంట్లు.. ఎక్కువ కాలం బతికే వారిలో కూడా ఉన్నట్లు మా సొంత అధ్యయనంతో పాటు అనేక ఇతర పరిశోధనల్లో కూడా తేలింది.

ముసలితనంలో ఎక్కువగా వచ్చే అల్జీమర్స్ వ్యాధి (ఏపీఓఈ4)కి కారణమయ్యే జన్యువుకు సంబంధించిన రెండు కాపీలు కొందరిలో కనిపించాయి. కానీ వారికి మాత్రం అల్జీమర్స్ వ్యాధి రాలేదు.

అంటే.. ఎక్కువ కాలం జీవించే వారిలో వ్యాధులను కలిగించే జన్యువులు ఉండవని చెప్పడం కంటే.. శరీరానికి మేలు చేసే, అరుదైన, అసాధారణ జన్యువులు వారిలో ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు.

అందుబాటులో ఉన్న సమాచారం ఈ వాదనకు మద్దతు ఇస్తోంది.

వందేళ్లకుపైగా బతికిన 60శాతం మందిలో జన్యుపరమైన మార్పులు ఉన్నాయి. మార్పు చెందిన జన్యువులు ప్రారంభ జీవితంలో అభివృద్ధిని నియంత్రిస్తాయి.

గ్రోత్ హార్మోన్

పెద్ద శునకాల కంటే చిన్నగా ఉండే కుక్కలు ఎక్కువ కాలం బతుకుతాయని చాలామందికి తెలుసు. కానీ జంతువుల్లో అన్నింటికీ ఈ సూత్రం వర్తిస్తుందని కొందరు నమ్ముతారు.

గుర్రాల కంటే పొట్టి గుర్రాలు (పోనీస్) ఎక్కువ కాలం బతుకుతాయి. ల్యాబ్‌లో చిన్న చిన్న జన్యు మార్పులు చేసిన చిట్టెలుకలు మిగతా పెద్ద ఎలుకలతో పోలిస్తే ఎక్కువ కాలం జీవిస్తాయి.

ఐజీఎఫ్‌ -1 అని పిలిచే గ్రోత్ హార్మోన్ వాటిలో తక్కువగా ఉండడం దానికి ఒక కారణం కావొచ్చు. కానీ వందేళ్లు బతికే వాళ్లు సగటు మనుషుల కంటే చిన్నగా ఏమీ ఉండరు.

చిన్నప్పుడు అందరికీ గ్రోత్ హార్మోన్ అవసరమవుతుంది. కానీ పెద్దయిన తర్వాత, ముసలితనంలో గ్రోత్ హార్మోన్ అధికంగా ఉంటే వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందనడానికి ఆధారాలు పెరుగుతున్నాయి.

అయితే, ఈ విషయంపై భిన్నవాదనలు ఉన్నాయి.

ఇలా వందేళ్లు బతికే వారిలో కూడా తక్కువ గ్రోత్ హార్మోన్ ఉన్న మహిళలు.. అధిక గ్రోత్ హార్మోన్ ఉన్న వారికంటే ఎక్కువ కాలం జీవిస్తారు. పైగా వారి కండరాలు బాగా పని చేస్తాయి.

కానీ మన సందేహాలను అది పూర్తిగా తీర్చదు.

సగటు ప్రజలతో పోలిస్తే ఎక్కువ కాలం జీవించే వారు చాలా రకాలుగా భిన్నంగా ఉంటారు.

ఉదాహరణకు.. వారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు బాగుంటాయి. వాళ్లు ఎక్కువ కాలం జీవించడానికి ఇది కూడా ఒక కారణం కావొచ్చు.

మొత్తానికి మన తల్లిదండ్రుల నుంచి మనకు మంచి జన్యువులు రాకపోయినా.. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు సరిగా పాటించకపోయినా.. దీర్ఘకాలం ఎలా జీవించొచ్చు అనే దానికి వందేళ్లకు పైగా బతికిన వాళ్లు మనకు 'సహజ ప్రయోగశాల' లాంటివాళ్లు.

అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మన శరీరంలో అరుదైన జన్యు మ్యుటేషన్లు (ఉత్పరివర్తనాలు) కలిగి ఉండటం.

అయితే, వీటి గురించి ప్రస్తుతానికి మనకు తెలిసింది తక్కువే.

ఇవి ఎలా పనిచేస్తాయో కచ్చితంగా తెలిస్తే.. శాస్త్రవేత్తలు కొత్త కొత్త మందులు కనిపెడతారు. లేదా సరైన సమయంలో సరైన కణాల జీవ ప్రక్రియల్లో జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది.

ఒకవేళ ఇది కార్యరూపం దాలిస్తే.. మనలో చాలా మంది వందేళ్లకు పైగా బతకొచ్చు. కానీ అప్పటి వరకు మీ ఆరోగ్యాన్ని మాత్రం అశ్రద్ధ చేయకండి. ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌ను పాటించండి.

(రిచర్డ్ పారంఘిర్ బ్రైటన్ యూనివర్శిటీలో బయోజరోంటాలజీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఇక నిర్ బర్జిలై.. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌లో మెడిసిన్, జెనెటిక్స్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What is the reason for some people to live for more than a hundred years ... What is the mystery?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X