• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

269 మంది ప్రయాణీకులతో వెళ్తోన్న కొరియన్ విమానాన్ని సోవియట్ యూనియన్ పొరపాటున కూల్చినప్పుడు..

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కొరియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 007 విమానం

అది 1983 ఆగస్టు 31 రాత్రి. న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్. కెన్నడీ విమానాశ్రయంలో 23 ఏళ్ల ఎలిస్ ఎఫ్రిమ్సన్ ఎబ్ట్, విమానం ఎక్కబోయే ముందు తన తండ్రి హాన్స్ ఎఫ్రిమ్సన్ ఎబ్ట్‌ను గట్టిగా హత్తుకున్నారు. ఆమె సియోల్‌కు ప్రయాణించే కొరియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 007 విమానాన్ని ఎక్కారు.

ఇంధనం కోసం అలస్కాలోని ఎన్‌కోరేజ్‌లో ఆ విమానం ఆగింది. అప్పుడు కూడా ఎలిస్ తన తండ్రితో ఫోన్‌లో మాట్లాడారు. ఆ విమానంలోని 61 మంది అమెరికన్లలో యూఎస్ సెనెటర్ లారీ మెక్‌డొనాల్డ్ కూడా ఉన్నారు.

ఎన్‌కోరేజ్ నుంచి ఉదయం 4 గంటలకు విమానం టేకాఫ్ అయింది. విమాన సిబ్బంది విమానాన్ని ఆటో పైలట్ మోడ్‌లో ఉంచారు. కానీ, ఆటో పైలట్ మోడ్ పనిచేయడం లేదనే సంగతి అప్పటికి వారికి తెలియదు.

కాసేపటి తర్వాత ఆ విమానం దాని నిర్దేశిత మార్గం నుంచి తప్పుకొని సోవియట్ భూభాగం వైపు వెళ్లడం ప్రారంభమైంది. సియోల్‌కు వెళ్లడానికి బదులుగా విమానం సోవియట్ యూనియన్ తూర్పు తీరం వైపు వేగంగా దూసుకెళ్లింది.

ఎయిర్‌లైన్స్ అడ్రస్ సిస్టమ్ నుంచి '' లేడీస్ అండ్ జెంటిల్‌మన్... మనం 3 గంటల్లోగా సియోల్‌లోని గింపో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటాం. సియోల్ కాలమానం ప్రకారం ఇప్పుడు ఉదయం 3 గంటలు అవుతుంది. విమానం ల్యాండ్ అయ్యే కంటే ముందే మీకు బ్రేక్‌ఫాస్ట్‌ను అందజేస్తాం'' అని విమాన సిబ్బంది ప్రయాణీకులను ఉద్దేశించి మాట్లాడారు. కానీ, ఆ విమానం ఎప్పటికీ సియోల్‌లో ల్యాండ్ కాలేదు.

అమెరికా సెనెటర్ మెక్‌డోనాల్డ్ మరణానికి వ్యతిరేకంగా నిరసనలు

నిర్దేశిత మార్గం నుంచి తప్పిపోయిన విమానం

26 నిమిషాల తర్వాత విమాన కెప్టెన్ చున్ బయాంగ్ ఇన్, అత్యవసర పరిస్థితి తలెత్తినట్లు ప్రకటించారు. అందరూ ఆక్సిజన్ మాస్కులను పెట్టుకోవాల్సిందిగా ఆదేశించారు.

సోవియట్ సరిహద్దులకు చేరుకుంటోన్న ఆ విమాన గమనాన్ని సోవియట్ మిలిటరీ స్థావరాల నుంచి సిబ్బంది గమనిస్తున్నారు.

అప్పటికే అమెరికా నిఘా విమానం బోయింగ్ ఆర్‌సీ 135, తప్పిపోయిన ఈ విమాన జాడ వెతకడాన్ని మొదలుపెట్టింది. ఈ నిఘా విమానాలు పైకి చూడటానికి సాధారణ పౌర విమానాల్లాగే కనిపిస్తాయి.

కొరియన్ ఎయిర్‌లైన్స్ 007 విమానం, సోవియట్ సరిహద్దులకు చేరుకునే సమయానికి అది దాని నిర్దేశిత మార్గం నుంచి తప్పుకొని 200 కి.మీ దూరం ప్రయాణించింది.

ఈ విమానాన్ని అడ్డుకోవడం కోసం రష్యా డోలింక్స్ సుకోల్ ఎయిర్‌బేస్‌కు చెందిన కమాండర్లు రెండు సుఖోయ్ ఎస్‌యూ-15 విమానాలను పంపించారు.

1988లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సోవియట్ యూనియన్ పైలట్, కల్నల్ గెనాడీ ఓసీపోవిచ్ దీని గురించి చెప్పారు.

''డబుల్ డెక్కర్ కిటికీలు ఉన్న ఒక బోయింగ్ 747 విమానాన్ని నేను చూడగలిగాను. మిలిటరీ కార్గో విమానాలకు ఇలాంటి కిటికీలు ఉండవు. అది ఏ రకమైన విమానమో నాకు అర్థం కాలేదు. కానీ, నాకు అప్పుడు తీరిగ్గా ఆలోచించేంత సమయం లేదు. నా విధులు నిర్వర్తించాల్సిన సమయం అది. ఆ విమానం, మా గగనతలం నిబంధనలను ఉల్లంఘించిందని చెప్పడానికి పైలట్‌కు అంతర్జాతీయ కోడ్‌ను చూపించాను. కానీ, అతని నుంచి ఎలాంటి స్పందన రాలేదు'' అని ఆయన తెలిపారు.

కొరియా విమానంపైకి క్షిపణిని ప్రయోగించిన కల్నల్ గెనాడీ ఓసీపోవిచ్

అమెరికా నిఘా విమానం ఆర్‌సీ 135

ప్రకాశవంతమైన ట్రేజర్లను కాల్చడం ద్వారా కొరియన్ పైలట్‌ను హెచ్చరించేందుకు సోవియట్ ఎయిర్‌ఫోర్స్ ప్రయత్నించినట్లు మరొక సోవియట్ లెఫ్టినెంట్ జనరల్ వాలెంటిన్ వెరెనికోవ్ చెప్పారు.

ఈ ఘటన గురించి విమానయాన నిపుణుడు పీటర్ గ్రీర్, 2013 జనవరి 1న ఎయిర్‌ఫోర్స్ మ్యాగజీన్‌లో 'ద డెత్ ఆఫ్ కొరియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 007' పేరుతో ఒక ఆర్టికల్‌ను రాశారు.

''అదే సమయంలో యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఆర్‌సీ-135 విమానం కూడా ఆ ప్రాంతంలోనే తిరుగుతోంది. కాంచాకటా ప్రాంతంలో సోవియట్ డిఫెన్స్ సిస్టమ్‌పై నిఘా ఉంచడమే ఈ విమానం పని.

సోవియట్ సరిహద్దుల వరకు ఈ అమెరికా విమానం వెళ్లింది. కానీ, సరిహద్దు దాటకుండా జాగ్రత్తపడింది. ఒకానొక క్షణంలో ఈ కొరియన్ ప్యాసింజర్ విమానాన్ని కూడా అమెరికా నిఘా విమానం అని సోవియట్ ఏటీసీ తప్పుగా అర్థం చేసుకుంది. వెంటనే ఈ విమానాన్ని అడ్డుకోవడానికి నాలుగు మిగ్-23 విమానాలను పంపింది. కానీ, మిగ్ విమానాల్లో తగినంత ఇంధనం లేకపోవడంతో అవి వెనక్కి తిరిగి వచ్చేశాయి'' అని ఆర్టికల్‌లో పేర్కొన్నారు.

మరణించిన ప్రయాణీకుల సంతాప సభ

విరుద్ధ ప్రకటనలు

మరోవైపు, 007 విమానం కాక్‌పిట్‌లో ఉన్న పైలట్లకు సోవియట్ యూనియన్ విమానం కూడా తమతో పాటు తిరుగుతుందన్న సంగతి తెలియదు. మొదట కాంచాకటా ప్రాంతాన్ని దాటిన ఆ విమానం అంతర్జాతీయ సముద్ర భూభాగంలోకి ప్రవేశించింది. కానీ, అది సోవియట్ నియంత్రణలోని సఖాలిన్ ప్రాంతంలోకి ప్రవేశించగానే, ఈ విమానం ఏదో మిలిటరీ మిషన్‌లో ఉన్నట్లుగా సోవియట్ ఎయిర్‌పోర్స్ విభాగం భావించింది.

అప్పటికే ఆ ప్రాంతంలో అమెరికా నావికాదళ నౌకల మిలిటరీ విన్యాసాల కారణంగా సోవియట్ వైమానిక విభాగం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అంతేకాకుండా అదే రోజు అక్కడ కొన్ని క్షిపణులను కూడా పరీక్షించాల్సి ఉంది. దీంతో 'మొదట కాల్చి, తర్వాత ప్రశ్నిద్దాం' అనే నిర్ణయాన్ని తీసుకున్నారు సోవియట్ సైనికులు.

ఆ తర్వాత ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐఏసీఓ) ఈ ఘటన గురించి ఒక నివేదికను రూపొందించింది. ''కొరియన్ విమానంతో రేడియోలో సంప్రదించడానికి సోవియట్ విమానం ప్రయత్నించలేదు. పౌర విమానాన్ని అడ్డగించే సమయంలో సోవియట్ పైలట్లు, ఐసీఏఓ మార్గదర్శకాలను పాటించలేదు'' అని నివేదికలో పేర్కొంది.

కానీ, సోవియట్ పైలట్ దీనికి భిన్నమైన వాదన వినిపించారు. ఎమర్జెన్సీ కోసం రిజర్వ్ రేడియో ఫ్రీక్వెన్సీలో కొరియన్ విమాన సిబ్బందితో మాట్లాడేందుకు ప్రయత్నించానని, కానీ కొరియన్ విమాన కాక్‌పిట్‌లోని ఎవరూ కూడా దాన్ని వినలేకపోయారని చెప్పారు.

269 మంది ప్రయాణీకులతో వెళ్తోన్న కొరియన్ విమానాన్ని పొరపాటున సోవియట్ యూనియన్ కూల్చినప్పుడు..

టోక్యో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ), కొరియన్ విమానాన్ని 35,000 అడుగుల ఎత్తులో ప్రయాణించాల్సిందిగా కోరింది. దీంతో కొరియన్ విమానం పైకి ఎగిరింది. అయితే, తమ విమానాల నుంచి తప్పించుకోవడం కోసమే కొరియన్ విమానం పైకి ప్రయాణిస్తోందని సోవియట్ అధికారులు అనుకున్నారు. అప్పుడే ఆ విమానాన్ని సోవియట్ సరిహద్దులు దాటనివ్వకూడదని వారు నిర్ణయించుకున్నారు.

''ఆ విమానాన్ని కూల్చేయాల్సిందిగా నాకు ఆదేశాలు వచ్చాయి. నాకు నిర్దేశించిన లక్ష్యాన్ని నేను పూర్తి చేశాను'' అని కల్నల్ గెనాడీ ఓసీపోవిచ్ గుర్తు చేసుకున్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విమానాన్ని కూల్చేయాలని, ఒకవేళ అది సోవియట్ సరిహద్దులు దాటి ఇతర అంతర్జాతీయ సరిహద్దుల్లోకి ప్రవేశించినా కూడా దాన్ని వదలకూడదనే ఆదేశాలు వచ్చినట్లు ఒక సోవియట్ కమాండర్ అంగీకరించారు.

269 మంది ప్రయాణీకులతో వెళ్తోన్న కొరియన్ విమానాన్ని పొరపాటున సోవియట్ యూనియన్ కూల్చినప్పుడు..

క్షిపణి ఢీకొట్టిన తర్వాత కూడా 12 నిమిషాలు ప్రయాణించిన కొరియన్ విమానం

సెప్టెంబర్ 9న మార్షల్ నికోలాయ్ ఓగార్కోవ్ మాస్కోలో జరిగిన విలేఖరుల సమావేశంలో విమానాన్ని కూల్చినట్లుగా ఒప్పుకున్నారు.

''ఒక విమానాన్ని సోవియట్ భూభాగంలో కూల్చేశాం. కానీ, దాన్ని కూల్చేయడానికి తగిన కారణాలు ఉన్నాయి. అది కచ్చితంగా ఒక మిలిటరీ మిషన్‌లో ఉంది'' అని ఆయన చెప్పారు.

దీని తర్వాత కూలిపోయిన విమానం తాలూకూ డేటా రికార్డర్, మృతుల శరీరాల గురించి బయటి ప్రపంచానికి సోవియట్ యూనియన్ ఎప్పుడూ చెప్పలేదు.

విమానంలో ప్రయాణించిన వారి కుటుంబాలు, మృతదేహాలకు అంత్యక్రియలు చేసే అవకాశం కూడా దక్కలేదు. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసి సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత 007 విమానానికి సంబంధించిన కొన్ని వివరాలు బయటకు వచ్చాయి.

1992లో ఒక ఉన్నత స్థాయి సమావేశం అనంతరం రష్యా, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ సంభాషణ వివరాలను విడుదల చేసింది. దీని తర్వాతే కొరియన్ విమానాన్ని గాలిలో ఉన్నప్పుడు కూల్చేయలేదనే సంగతి తొలిసారిగా బయటి ప్రపంచానికి తెలిసింది.

269 మంది ప్రయాణీకులతో వెళ్తోన్న కొరియన్ విమానాన్ని పొరపాటున సోవియట్ యూనియన్ కూల్చినప్పుడు..

టోక్యో కాలమానం ప్రకారం, ఉదయం 3:26 గంటల సమయంలో కొరియన్ విమానమే లక్ష్యంగా రెండు ఏఏ-3 క్షిపణులను ఓసీపోవిచ్ ప్రయోగించారు.

సోవియట్ క్షిపణికి చెందిన కొన్ని ముక్కలు కొరియన్ విమానం వెనుకవైపు ఇరుక్కుపోవడంతో విమానంలోని నాలుగు హైడ్రాలిక్ వ్యవస్థల్లో మూడు నాశనం అయ్యాయి.

అయినప్పటికీ విమాన క్యాబిన్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. విమానంలోని నాలుగు ఇంజిన్లు పనిచేస్తూనే ఉన్నాయి.

ఓసీపోవిచ్, కంట్రోల్ రూమ్‌కు సందేశాన్ని పంపారు. ''లక్ష్యాన్ని నాశనం చేశాం. కానీ, ఆ విమానం ఇంకా పూర్తిగా కూలిపోలేదు' అని చెప్పారు.

దెబ్బతిన్న ఆ విమానం మరో 12 నిమిషాల పాటు గాలిలోనే ప్రయాణించింది. విమానాన్ని నియంత్రించడానికి పైలట్లు శక్తిమేర ప్రయత్నించారు. కానీ, సఖాలిన్‌కు పశ్చిమాన మోనెరాన్ ద్వీపానికి సమీపంలోని సముద్రంలో ఆ విమానం పడిపోయింది. అందులోని ప్రయాణీకులు, సముద్రంలో మునిగి చనిపోయారు.

కొరియన్ విమాన శకలాలు

తిరగబడిన విమానం..

12 నిమిషాల పాటు ప్రమాదంతో పోరాడినప్పటికీ, కొరియన్ విమానం ఎలాంటి సంకేతాలను పంపలేదు. సెమర్ హర్ష్ తన పుస్తకం ''ద టార్గెట్ ఈజ్ డిస్ట్రాయిడ్''లో ఈ ఘటన గురించి వివరించారు.

''క్షిపణి తగిలిన 40 సెకన్ల తర్వాత కొరియన్ 007 విమానం టోక్యో ఏటీసీకి ఒక సందేశాన్ని పంపింది. అందులో కొన్ని పదాలు మాత్రమే స్పష్టంగా వినిపించాయి. 'ర్యాపిడ్ కంప్రెషన్, ఎండ్ డిసెండింగ్, మేం విమానాన్ని 10వేల అడుగుల ఎత్తుకు తీసుకొస్తున్నాం. అలా అయితేనే ప్రయాణీకులు గాలిని పీల్చుకోగలరు' అనే మాటలు వినిపించాయి'' అని పుస్తకంలో రాశారు.

ఆ క్షణంలో కూడా తమ విమానంపై క్షిపణి దాడి జరిగినట్లుగా పైలట్ గుర్తించిన దాఖలాలు కనిపించలేదు. తర్వాతి నాలుగు నిమిషాల్లో 007 విమానం 16,000 అడుగులకు దిగివచ్చినట్లుగా జపాన్ రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ సూచించింది.

ఆ ఎత్తులో కిందికి దిగేటప్పుడు పైలట్ బహుశా విమానం వేగాన్ని నియంత్రించడానికి ప్రయత్నించారు. కానీ, అప్పటికే విమానం ఆయన నియంత్రణను దాటిపోయింది. చివరి దశలో విమానం తిరగబడింది. ఇంజిన్ పవర్‌ను ఉపయోగించి ప్రమాదాన్ని నివారించడానికి పైలట్ ప్రయత్నించారు. కానీ, అప్పటికే ఆలస్యం జరిగింది.

269 మంది ప్రయాణీకులతో వెళ్తోన్న కొరియన్ విమానాన్ని పొరపాటున సోవియట్ యూనియన్ కూల్చినప్పుడు..

తీవ్రంగా ఖండించిన అమెరికా

విమానం కూల్చివేత వార్త అమెరికాకు చేరగానే అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ తీవ్రంగా స్పందించారు. దీన్నొక 'సామూహిక హత్యాకాండ'గా పిలిచారు. మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరంగా అభివర్ణించారు. విలేఖరుల సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి, సోవియట్ యూనియన్ చర్యను ఖండించారు.

ఇంటెలిజెన్స్ ప్రయోజనాల రీత్యా అమెరికా, కొరియన్ విమానాన్ని ఉపయోగించుకుందని సోవియట్ యూనియన్ నేత యూరీ ఆంద్రోపోవ్ అమెరికాపై ఆరోపణలు చేశారు.

ప్రచ్ఛన్న యుద్ధం చివరి దశలో జరిగిన అత్యంత ప్రమాదకర ఘటనగా దీన్ని పిలిచారు. సోవియట్ యూనియన్ క్షిపణులు, కొరియా ప్యాసింజర్ విమానాన్ని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాయంటూ అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.

అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్

''సోవియట్ యూనియన్ నిజానికి దాన్ని నిఘా విమానం ఆర్‌సీ-135గా భావించింది. ఈ ఆర్‌సీ విమానం సఖాలిన్‌ తీరంలో నిరంతరం చక్కర్లు కొడుతుండేది'' అని 'ద డెత్ ఆఫ్ కొరియన్ ఎయిర్‌లైన్ ఫ్లైట్ 007' అనే ఆర్టికల్‌లో పీటర్ గ్రీర్ రాశారు.

సోవియట్ యూనియన్ వైమానిక దళం పనితీరు ఆ సమయంలో ఏమీ బాగాలేదని చరిత్రకారుడు మ్యాథ్యూ ఎం.ఎడ్ అభిప్రాయపడ్డారు.

''కొరియన్ ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోయిన తర్వాత సోవియట్ వైమానిక రక్షణ వ్యవస్థ పనితీరు ఎంత పేలవంగా ఉందో అందరికీ తెలిసిపోయింది'' అని 'ద సీక్రెట్ సెంటరీ' అనే పుస్తకంలో మ్యాథ్యూ పేర్కొన్నారు.

సోవియట్ యూనియన్ నేత యూరీ ఆంద్రోపోవ్

ఎన్నో కుట్ర సిద్ధాంతాలు

ఈ దుర్ఘటన జరిగిన ముప్పై సంవత్సరాల తర్వాత దీనికి సంబంధించిన దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికింది. కేవలం ఒక ప్రశ్నకు మాత్రం సమాధానం లభించలేదు. ఆ ప్రశ్న ఏంటంటే, ఈ ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు ఏమయ్యాయి?

ఈ ప్రమాదంలో మరణించిన ఒక్కరి మృతదేహం కూడా తమకు లభ్యం కాలేదని రష్యా పేర్కొంది. అయితే, సోవియట్ యూనియన్, ఈ విమానంలోని ప్రజలను రక్షించి వారిని ఏళ్లుగా బందీలుగా ఉంచిందనే కుట్ర సిద్ధాంతాలు బయటకు వచ్చాయి.

బర్ట్ షాలాస్‌బర్గ్ అనే రచయిత రాసిన 'రెస్క్యూ 007' పుస్తకం 2001లో ప్రచురితమైంది. ''సైబీరియాలోని జైళ్లలో ఈ విమాన ప్రయాణీకులు బంధీలుగా ఉండటాన్ని తాము ప్రత్యక్షంగా చూసినట్లు కొంతమంది చెప్పారని'' ఆ పుస్తకంలో రాశారు.

ఈ ఘటన తాలూకు గుర్తుల్ని చెరిపేయడం కోసం సోవియట్ యూనియన్ ఉద్దేశపూర్వకంగా ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాల్ని మాయం చేసిందని కూడా చెబుతుంటారు. అయితే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమేనని 007 విమాన ప్రయాణీకుల తరఫున వాదించిన లాయర్ హునీతా మడోల్ చెప్పారు.

పైలట్ తప్పు

ఈ ఘటనకు పైలట్ తప్పిదమే కారణమని సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ నివేదిక పేర్కొంది. కానీ, ఆ విమానాన్ని నడిపిన కెప్టెన్ చున్ బయాంగ్ ఇన్ అత్యంత అనుభవజ్ఞుడు. ఆయన 1972 నుంచి కొరియన్ ఎయిర్‌లైన్స్ విమానాలను నడుపుతున్నారు.

''కెప్టెన్ చున్ బయాంగ్, సేఫ్టీ రికార్డు చాలా బాగుంది. దక్షిణ కొరియా అధ్యక్షుడు చున్ డు హాన్ అధికారిక పర్యటనకు బ్యాకప్ పైలట్‌గా ఆయన మూడుసార్లు ఎంపికయ్యారు. ఎన్‌కోరేజ్ నుంచి సియోల్‌కు ఆయన 83 సార్లు విమానాన్ని నడిపారు. ఆయన తోటి పైలట్ సున్ డాన్ హిన్ వయస్సు 47 ఏళ్లు. నాలుగేళ్లుగా కొరియన్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్నారు. బోయింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో 3,500 గంటలు గడిపారు'' అని 'ద టార్గెట్ ఈజ్ డిస్ట్రాయిడ్' అనే పుస్తకంలో ప్రముఖ జర్నలిస్ట్ సెమర్ హర్ష్ రాశారు.

జర్నలిస్ట్ సెమర్

ఆటోపైలట్ పని చేయకపోవడం

కాక్‌పిట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌పై పట్టు ఉన్న నాసా మాజీ నిపుణుడు అసఫ్ దెగానీ తన పుస్తకం 'టేమింగ్ హెచ్‌ఏఎల్: డిజైనింగ్ ఇంటర్‌ఫేసెస్ బియాండ్ 2001'లో ఆటోపైలట్ ఎలా పనిచేస్తుందో వివరించారు.

''ఆటోపైలట్ బహుశా 'హెడ్డింగ్' మోడ్‌లో ఉండొచ్చు. ఈ సెట్టింగ్, విమానంలోని మ్యాగ్నటిక్ కంపాస్ ఆధారంగా విమానాన్ని ప్రయాణించేలా చేస్తుంది. అధిక ఎత్తులో దీని కచ్చితత్వం 15 డిగ్రీల వరకు మారవచ్చు. ఈ ఆటోపైలట్ మోడ్ వల్లే విమానం సోవియట్ యూనియన్ గగనతలంలో ప్రవేశించి ఉండొచ్చు.

ఒకవేళ ఆటోపైలట్, ఐఎన్‌ఎస్ పరిధి లోపల ఎగిరి ఉంటే విమానం మరో మార్గంలో ప్రయాణించి ఉండేది. అది సోవియట్ యూనియన్ గగనతలం సమీపంలోకి వెళ్లి ఉండేది కానీ వారి గగనతలంలోకి ప్రవేశించకపోయేది. బహుశా కొరియన్ ఎయిర్‌లైన్స్ పైలట్లు విమానం, ఐఎన్‌ఎస్ మోడ్‌లో ఎగురుతుందని భావించి ఉండొచ్చు'' అని పుస్తకంలో వివరించారు.

బోయింగ్ 747 విమానాలు ఆటోపైలట్ మోడ్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలు రావడం కొత్తేమీ కాదు. కనీసం డజన్ల సంఖ్యలో ఇలాంటి ఘటనలు జరిగాయి.

269 మంది ప్రయాణీకులతో వెళ్తోన్న కొరియన్ విమానాన్ని పొరపాటున సోవియట్ యూనియన్ కూల్చినప్పుడు..

చనిపోయిన వారి జ్ఞాపకార్థం స్మారకం

ఈ ఘటన జరిగిన అయిదేళ్ల తర్వాత టెహ్రాన్ నుంచి దుబయ్‌కి వెళ్తోన్న ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ 300 విమానాన్ని యూఎస్‌ఎస్ విన్సెన్సెస్ విమానం కూల్చేసింది.

ఇరాన్ విమానాన్ని ఫైటర్ జెట్‌గా భావించిన అమెరికా నావికాదళం దాన్ని కూల్చి వేసింది. ఈ ఘటనలో ప్రయాణీకులు, ఎయిర్‌లైన్స్ సిబ్బందితో కలిపి మొత్తం 290 మంది మరణించారు.

మరణించిన విమాన ప్రయాణికుల జ్ఞాపకార్థం స్మారక చిహ్నం

కొరియన్ ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాదంలో మరణించిన వారి స్మారకార్థం రష్యాలోని సఖాలిన్ ద్వీపంలో ఒక స్మారకాన్ని ఏర్పాటు చేశారు.

జపాన్‌లోని వక్కానాయిలో వారి జ్ఞాపకార్థం 90 అడుగుల టవర్‌ను నిర్మించారు. సముద్రంలో నుంచి కొట్టుకువచ్చిన ప్రయాణీకుల వస్తువులను ఇక్కడ భద్రపరిచారు.

ఈ ఘటనలో మరణించిన 269 మంది ప్రయాణీకులకు గుర్తుగా ఈ టవర్‌లో 269 తెల్లరాయి ముక్కలు, 2 నల్లరాయి ముక్కల్ని ఉంచి వాటిపై ప్రయాణీకుల పేర్లను రాశారు.

కొరియన్ విమానం 007 అవశేషాలు ఇప్పటికీ సముద్ర గర్భంలో నిక్షిప్తమై ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Soviet Union, When the Soviet Union mistakenly shot down a Korean airliner carrying 269 passengers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X