India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విషయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌పై విమర్శలు ఎందుకు వస్తున్నాయి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

భారత ప్రధాని నరేంద్ర మోదీ, 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అంటే, ప్రతీ ఇంటిపై భారత జాతీయ జెండాను ఎగురవేయాలి. దీని ప్రకారం, ఆగస్టు 13-15 మధ్య దేశంలోని 24 కోట్ల ఇళ్లపై త్రివర్ణ పతాకం ఎగరాలి.

స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుపుతోన్న అమృత మహోత్సవాల్లో భాగంగా 'హర్ ఘర్ తిరంగా' ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

ప్రధానమంత్రి మోదీ సహా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మంత్రులు, నాయకులు తమ సోషల్ మీడియా హ్యాండిళ్లకు ప్రొఫైల్‌గా త్రివర్ణ పతాకాన్ని ఉంచారు.

భారత మాజీ ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ, జెండా పట్టుకున్న చిత్రాన్ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన ప్రొఫైల్ పిక్చర్‌గా మార్చారు. ఇతర కాంగ్రెస్ నేతలు కూడా ఇదే చిత్రాన్ని తమ ప్రొఫైల్‌ పిక్చర్‌గా పెట్టుకున్నారు.

అయితే, 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమంపై ఒక కొత్త వివాదం కూడా మొదలైంది. త్రివర్ణ పతాకానికి ఆర్‌ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) వ్యతిరేకమని కాంగ్రెస్ ఆరోపించింది.

ప్రధాని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవక్‌గా పనిచేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో తనకున్న అనుబంధాన్ని, విశ్వాసాన్ని మోదీ ఎప్పుడూ దాచుకోలేదు.

హిందుత్వ సంస్థ ఆర్‌ఎస్ఎస్‌ను విమర్శిస్తూ రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేశారు.

https://twitter.com/RahulGandhi/status/1554870130785456128

''చరిత్రే సాక్ష్యం. ఇప్పుడు 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నవారు... 52 ఏళ్ల పాటు త్రివర్ణ పతకాన్ని ఎగరేయని దేశద్రోహి సంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్ నుంచి వచ్చారు. స్వాతంత్ర్య పోరాటం నుంచి కాంగ్రెస్ పార్టీని అప్పుడూ ఎవరూ ఆపలేకపోయారు, ఇప్పుడు కూడా ఎవరూ ఆపలేరు'' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

అయితే, బీబీసీతో సంభాషణలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రచార చీఫ్ సునీల్ అంబేకర్, రాహుల్ చేసిన ఈ ఆరోపణలను ఖండించారు. త్రివర్ణ పతాకాన్ని ఆర్‌ఎస్ఎస్ గౌరవిస్తుందని ఆయన చెప్పారు.

భారత మంత్రులు, బీజేపీ నాయకులు ప్రొఫైల్ పిక్చర్‌గా జాతీయ పతాకాన్ని ఉంచారు. కానీ, ఆర్ఎస్‌ఎస్‌ అగ్ర నేతలు జెండాను తమ ప్రొఫైల్‌గా పెట్టలేదు. ఆర్‌ఎస్‌ఎస్ అధికారిక పేజీలో, సోషల్ మీడియాలో కూడా జాతీయ పతాకం చిత్రాన్ని వాడలేదు.

జెండా విషయంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు ప్రశ్నలు

ఆర్‌ఎస్‌ఎస్ జెండా కాషాయ రంగులో ఉంటుంది. త్రివర్ణ పతాకం పట్ల ఆర్‌ఎస్‌ఎస్ వైఖరిపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.

'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమం నేపథ్యంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ను మత జాతీయవాద పండితుడు, దిల్లీ యూనివర్సిటీలో బోధించిన షమ్స్-ఉల్-ఇస్లాం విమర్శించారు. త్రివర్ణ పతకాన్ని ఆర్ఎస్‌ఎస్ ఎప్పుడూ అంగీకరించలేదని అన్నారు.

''1925లో ఆర్‌ఎస్ఎస్ ఏర్పడింది. అప్పటినుంచి, బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఐక్య భారత పోరాటానికి ప్రతీకగా నిలిచిన ప్రతీ అంశాన్ని ఆర్‌ఎస్ఎస్ ద్వేషించింది. 1929 డిసెంబర్‌లో కాంగ్రెస్ లాహోర్ సమావేశంలో 'పూర్ణ స్వరాజ్యం' అనే నినాదాన్ని ఇచ్చింది. ప్రతీ సంవత్సరం జనవరి 26న త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చింది. అయితే 1930 జనవరి 26వ తేదీ సమీపిస్తుండగా అప్పటి సర్సంఘ్‌చాలక్ హెడ్గెవార్, స్వయం సేవకులందరూ కాషాయ జెండానే జాతీయ జెండాగా పూజించాలంటూ సర్క్యులర్ జారీ చేశారు.

ఆ ఆదేశాన్ని ఇంకా వెనక్కి తీసుకోలేదు. ఆర్ఎస్ఎస్ ప్రముఖ సిద్ధాంతకర్త ఎంఎస్ గోల్‌వాల్కర్ నాగ్‌పూర్‌లో గురుపూర్ణిమను పురస్కరించుకొని 1946 జూలై 14న ప్రసంగించారు. భారతీయ సంస్కృతిని కాషాయ జెండా ప్రతిబింబిస్తుందని, ఇది భగవంతునికి చిహ్నమని అన్నారు. ఏదో ఒకరోజు దేశం మొత్తం ఈ జెండా ముందు తల వంచుతుందని తాము గట్టిగా నమ్ముతున్నట్లు చెప్పారు.

1947 ఆగస్టు 14న ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ఒక పత్రిలో ఒక సంపాదకీయాన్ని ప్రచురించారు. 'దేశంలో అధికారంలోకి వచ్చిన వారు మన చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని పెట్టారు. కానీ, హిందువులు దీన్ని ఎప్పటికీ స్వీకరించరు. దాన్ని గౌరవించరు. మూడు అంటేనే అశుభసూచకం. మూడు రంగుల జెండా కచ్చితంగా మానసికంగా చెడు ప్రభావాన్ని చూపుతుంది. దేశానికి హానికరంగా మారుతుంది' అని సంపాదకీయంలో రాశారు.

ప్రధాని మోదీ 'హర్ ఘర్ తిరంగా' ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన ఒక ఆర్‌ఎస్‌ఎస్ వాలంటీర్. ఆయన ఇప్పుడు సంఘ్ ఆలోచనను విమర్శిస్తారా? అలా చేయగలరా? త్రివర్ణ పతకాన్ని విమర్శిస్తూ గోల్‌వాల్కర్ రాసిన పుస్తకంలోని పాఠాన్ని మోదీ విమర్శిస్తారా?'' అని షమ్స్-ఉల్-ఇస్లాం వివరించారు.

'త్రివర్ణ పతాకాన్ని మేం గౌరవిస్తాం'

ఆర్‌ఎస్‌ఎస్‌పై వస్తోన్న ఈ విమర్శలను, ఆరోపణలను సునీల్ అంబేకర్ ఖండించారు.

దీని గురించి ఆయన బీబీసీతో మాట్లాడారు. ''భారత రాజ్యాంగ సభ, త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా నిర్ణయించి, ఆమోదించిన రోజు నుంచే... సంఘ్‌కు మాత్రమే కాదు, మొత్తం దేశానికే తిరంగా, జాతీయ జెండాగా మారిపోయింది. దేశానికి సంబంధించిన ప్రతీ చిహ్నాన్ని, ప్రతీ గుర్తింపును, ప్రతీదాన్ని సంఘ్ గౌరవిస్తుంది'' అని అంబేకర్ అన్నారు.

2002 వరకు త్రివర్ణ పతాకాన్ని ఎందుకు ఉపయోగించలేదన్న ప్రశ్నకు బదులిస్తూ అంబేకర్ ఇలా అన్నారు. ''త్రివర్ణ పతాకాన్ని ప్రైవేట్‌గా ఉపయోగించడంపై 2004 వరకు అనేక ఆంక్షలు ఉండేవి. 2004లో దీనికి సంబంధించి సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. అప్పటినుంచి సంఘ్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేస్తున్నాం'' అని చెప్పారు.

జాతీయ పతాకం

మోదీ, సంఘ్ స్వయంసేవక్...

దిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆర్‌ఎస్‌ఎస్ అనుకూల ప్రొఫెసర్ అవనిజేశ్ అవస్థీ దీని కూడా గురించి మాట్లాడారు.

''ప్రధాని మోదీ 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఆయన స్వయంగా సంఘ్ వాలంటీర్. మోదీ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారంటే అర్థం సంఘ్ కూడా చేస్తున్నట్లే'' అని అన్నారు.

కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. ''కాంగ్రెస్, మోదీని సంఘ్ స్వయం సేవక్‌గానే చూస్తుంది. ఇప్పుడు మోదీ, తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి సంఘ్ కూడా మోదీని అనుసరిస్తుందా? అని కాంగ్రెస్ వారు అడుగుతున్నారు. మరోవైపు ప్రభుత్వ పాలసీలన్నింటినీ సంఘ్ నియంత్రిస్తుందని కూడా వారే అంటారు. ఇలా పరస్పర విరుద్ధ ఆరోపణలు, తెలివి తక్కువ పనుల్ని కాంగ్రెస్ చేస్తుంటుంది'' అని ఆయన అన్నారు.

భారతదేశం అధికారికంగా 1947 జూలై 22న త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా ఆమోదించింది.

త్రివర్ణ పతాకాన్ని సంఘ్ వ్యతిరేకిస్తుందనే విమర్శలను అవనిజేశ్ తోసిపుచ్చారు. ''సంఘ్, త్రివర్ణ పతాకాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదు. జాతీయ జెండాగా త్రివర్ణాన్ని భారత్ ఆమోదించినప్పటి నుంచే సంఘ్ కూడా దాన్ని గౌరవిస్తోంది. స్వయం సేవకులందరూ త్రివర్ణ పతకాన్ని గౌరవిస్తారు'' అని అన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ నాగ్‌పూర్‌లోని హెడ్‌క్వార్టర్‌లో 1947 ఆగస్టు 15, 1950 జనవరి 26న త్రివర్ణాన్ని ఎగురవేసింది. ఈ రెండు పర్యాయాలు మినహా 2002 వరకు ఆర్‌ఎస్ఎస్ మళ్లీ హెడ్‌క్వార్టర్స్‌లో త్రివర్ణాన్ని ఎగురవేయలేదు.

2001 జనవరి 26న ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంలో త్రివర్ణాన్ని ఎగురవేసేందుకు ప్రయత్నించిన ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. 2013లో వీరిని నిర్దోషులుగా ప్రకటించించినట్లు పీటీఐ రిపోర్టు తెలిపింది.

హర్ ఘర్ తిరంగా

''సంఘ్, త్రివర్ణాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదు. 1950లో భారత ప్రభుత్వం 'ఎంబ్లమ్ అండ్ నేమ్' చట్టాన్ని రూపొందించింది. అందులో జాతీయ జెండాను ఎలా, ఎప్పుడు ప్రదర్శించాలో అనే నియమాలను పొందుపరిచింది. ఆ నిబంధనల ప్రకారం, జాతీయ జెండాను వ్యక్తిగతంగా ఎగురవేయకూడదు. ఆ తర్వాత నవీన్ జిందాల్ దాఖల్ చేసిన పిల్‌ను విచారించిన సుప్రీం కోర్టు... ఎవరైన తమ ఇల్లు, కార్యాలయంపై జాతీయ జెండాను ఎగురవేయవచ్చని తీర్పునిచ్చింది. కాంగ్రెస్ ఇప్పుడు నిరాధార విమర్శలు చేస్తోంది'' అని అన్నారు.

సంఘ్ సోషల్ మీడియా ప్రొఫైల్‌గా కాషాయ జెండానే ఉంది.

''వామపక్షాలకు ఎర్రజెండా ఉన్నట్లే సంఘ్‌కు కాషాయ జెండా ఉంది. సంఘ్‌కు సంబంధించిన సొంత కార్యక్రమాల్లో సంఘ్ తమ జెండానే ఎగురవేస్తుంది. ఈ దేశంలోని ప్రతీ పార్టీకి, సంస్థకు సొంత జెండాలు ఉన్నాయి'' అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why is Rashtriya Swayam Sevak Sangh being criticized for Har Ghar Tiranga programme?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X