స్వరం పెంచిన శివసేన..తెగతెంపులేనా?: ఆర్థికం కుదేలు కావడానికి మీరు..మీ విధానాలు కారణం కాదా?
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీతో పొత్తు పెట్టుకుని మరీ పోటీ చేసిన శివసేన.. తన మిత్రపక్షంపై ఒంటి కాలిపై లేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచీ ముఖ్యమంత్రి పదవి కోసం బీజేపీతో పేచీ పెట్టుకుంటూ వస్తోన్న శివసేన నాయకులు తమ స్వరాన్ని మరింత పెంచారు. ఈ సారి ఏకంగా బీజేపీ అధిష్ఠానంపైనే విమర్శనాస్త్రాలను ఎక్కు పెట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలే కారణమంటూ నిప్పులు చెరుగుతున్నారు. దీనికి బీజేపీ అగ్ర నాయకత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
దీపావళి పండుగ నాడు షేర్ మార్కెట్ సహా దేశవ్యాప్తంగా వ్యాపార రంగం కళకళలాడుతుంటుందని, నాటి ప్రాభవం ఈ సారి కనిపించట్లేదని పేర్కొన్నారు. మార్కెట్ లో ఇంత స్తబ్దత ఎందుకు నెలకొందో బీజేపీ నాయకత్వానికి తెలుసా? అంటూ ప్రశ్నించారు.

మందగమానికి కారణం మీరు కాదా?..
దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనానికి బీజేపీ అగ్ర నాయకత్వమే కారణమని అంటూ శివసేన మౌత్ పీస్ `సామ్నా` పత్రికలో ఎడిటోరియల్ ను ప్రచురించారు. జీఎస్టీని అమలు చేసిన అనంతరమే దేశ ఆర్థిక రంగంలో మందగమనం చోటు చేసుకుందని పేర్కొన్నారు. బీజేపీ ఆలోచనలు, విధానాల తరహాలోనే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా తయారైందని ఎద్దేవా చేశారు. పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల ఎదురైన ఆర్థిక పరమైన ఇబ్బందులను అంచనా వేయడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, అదే సమయంలో జీఎస్టీని అమలు చేయడం..చిన్న, మధ్య తరహా వ్యాపారస్తుల నడ్డి విరిచినట్టయిందని ఆరోపించారు.

రిజర్వు బ్యాంకు సైతం..
పెద్ద నోట్ల రద్దు వల్ల సాధించిన ఫలితాలు శూన్యమనే విషయాన్ని రిజర్వు బ్యాంకు సైతం ప్రకటించిందని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా వందలాది కర్మాగారాలు మూత పడుతున్నాయని, దశాబ్దాల కాలం పాటు దేశానికి వెన్నెముకగా ఉంటూ వచ్చిన వాహన రంగం సైతం తమ పని రోజులను తగ్గించుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఫలితంగా- అనుబంధ పరిశ్రమలు మూత పడ్డాయని, వేలాది మంది కార్మికులు జీవనోపాధిని కోల్పోయాని విమర్శించారు. 45 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని చెప్పారు. ఇదివరకే ఉన్న నిరుద్యోగానికి తోడు.. కార్మికులు ఉపాధిని కోల్పోవడం మరింత కుంగ దీస్తోందని అన్నారు.

దిద్దుబాటు చర్యలేవీ..
సాక్షాత్తూ దేశ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భర్త, ఆర్థిక రంగ నిపుణుడిగా పేరున్న పరకాల ప్రభాకర్ గానీ, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకోనున్న అభిజిత్ బెనర్జీ గానీ.. ఇదే అభిప్రాయాలను వెల్లడించారని శివసేన నాయకులు ఈ ఎడిటోరియల్ లో స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ అధ్వాన్న స్థితికి చేరుకున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకోలేదని ధ్వజమెత్తారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం, పాకిస్తాన్ పై ఘన విజయాలను సాధించడం వంటి చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టలేవని, నిరుద్యోగాన్ని రూపుమాప లేవని అన్నారు.












Click it and Unblock the Notifications