దేశంలో తొలిసారి నిజాయితీపరులకు మేలు జరుగుతోంది
న్యూఢిల్లీ: నల్లధనం, నకిలీ కరెన్సీని అరికట్టేందుకు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని, దేశ భవిష్యత్ కోసం తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రతిపక్షాలు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తర్వాత మోడీ ప్రతిపక్షాలకు స్పష్టం చేశారు.
కాగా, పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారం ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యాయి. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగానే మాజీ ఎంపీలకు పార్లమెంటు నివాళులు అర్పించింది. మాజీ ఎంపీలతోపాటు థాయ్‌లాండ్ రాజు మృతికి రాజ్యసభ సంతాపం తెలిపింది.

సమావేశాలకు ముందే పార్లమెంటు ఎదుట ప్రతిపక్షాలు పెద్ద నోట్ల రద్దుపై ఆందోళన చేపట్టారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్రంపై మండిపడ్డారు. ఆర్థిక ఎమర్జెన్సీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీలకు సంతాపం తెలిపిన అనంతరం లోకసభ రేపటికి వాయిదా పడింది. కాగా, రాజ్యసభలో మాత్రం నోట్ల రద్దుపై చర్చ జరుగుతోంది.
నల్లధనం, అవినీతికి మేం వ్యతిరేకం-నిజాయితీపరులకు మేలు: పీయూష్
నల్లధనం, అవినీతికి మా ప్రభుత్వం వ్యతిరేకమని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. కొంచెం కష్టమైనా ప్రజలు.. మోడీ నిర్ణయాన్ని భేష్ అంటున్నారని చెప్పారు. అవినీతి, నల్లధనంపై మోడీ యుద్ధం చేస్తున్నారని, అందులో భాగంగానే పెద్ద నోట్ల రద్దుతో తొలి అడుగు వేశారని చెప్పారు.
దేశంలో తొలిసారి నిజాయితీపరులకు మేలు కలుగుతోందని అన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. అక్రమార్కులకు అడ్డకట్ట వేసేందుకు పెద్ద నోట్ల రద్దు నిర్ణయమని వెల్లడించారు. దేశ ప్రయోజనాల కోసమే పెద్ద నోట్లను రద్దు చేసినట్లు తెలిపారు. సక్రమమైన డబ్బుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు.
కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంకులో జమ చేసేందుకు ఇబ్బంది లేదని అన్నారు. అవినీతిపై పోరాడుతుంటే కొందరికి ఇబ్బంది కలుగుతోందని అన్నారు. నోట్ల రద్దుతో ఉగ్రవాదులు, తీవ్రవాదుల వద్ద ఉన్న నకిలీ కరెన్సీకి కూడా అడ్డుకట్ట పడిందని అన్నారు. తమ ప్రభుత్వమైతే సర్జికల్ స్ట్రైక్స్ అనే పేరు చెప్పలేదు, మీరు అలా అనుకుంటే మంచిదే అని కాంగ్రెస్‌కు కౌంటర్ ఇచ్చారు పీయూష్ గోయల్.
పెద్ద నోట్ల రద్దును హఠాత్తుగా ప్రకటించేసరికి నల్లధనం కలిగినవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇలాంటి నిర్ణయాలకు సమయం ఇస్తే వారంతా జాగ్రత్త పడే అవకాశం ఉంటుందని తెలిపారు.2,3 రోజులుగా పలు నగరాల్లో ఏటీఎంలు, బ్యాంకుల వద్ద క్యూలు తగ్గాయని తెలిపారు.
ప్రస్తుతం బ్యాంకులు, ఏటీఎంలలోనూ రూ. 500 నోట్లు కూడా లభిస్తున్నాయని చెప్పారు. త్వరలోనే ప్రజలు ఇబ్బందులు తగ్గిపోతాయని అన్నారు. డిసెంబర్ 30 వరకు పెద్ద నోట్లను మార్చుకునే అవకాశం ఉందని తెలిపారు.
పెద్దనోట్ల రద్దుతో అవినీతిపరులకే ఇబ్బంది అని పీయూష్ గోయల్ అన్నారు. కొన్ని నగరాలలో తప్ప ఎక్కడా బ్యాంకు క్యూలు లేవని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు వెనుక ఎలాంటి రాజకీయం లేదని చెప్పారు. పెద్ద నోట్లను ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. ఇలాంటి విషయాల్లో గోప్యత అవసరమన్నారు. తాత్కాలిక కష్టాలను పెద్దవి చేసి చూపవద్దన్నారు.
9వ తారీఖు నుంచి నా దగ్గరే: సీతారం ఏచూరి
రాజ్యసభలో పెద్ద నోట్ల రద్దుపై చర్చ జరుగుతున్న వేళ, సమాజ్ వాదీ పార్టీ సభ్యుడు రాంగోపాల్ యాదవ్ మాట్లాడుతుండగా, ఆయన పక్కనే కూర్చున్న వామపక్ష సభ్యుడు సీతారాం ఏచూరి లేచి.. నోట్ల రద్దు తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తోందో చెప్పి అందరినీ నవ్వించారు. ఓ రెండు వేల రూపాయల కాగితాన్ని బయటకు తీసి చూపించిన ఆయన, 'ఇది 9వ తారీఖు నుంచి నా దగ్గరే ఉంది. ఎవరూ తీసుకోవట్లేదు. పార్లమెంటులోని మన బ్యాంకు నుంచే తీసుకున్నా. ఇక్కడెక్కడా తీసుకోవట్లేదు’అని చెప్పారు.
ప్రజలకు కష్టాలు: రాంగోపాల్
పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బడా వ్యాపార, పారిశ్రామికవేత్తలు సంతోషంగా నిద్రపోతున్నారని ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్ అన్నారు. ఎమర్జెన్సీలో కూడా ఇలాంటి కష్టాలు రాలేదని చెప్పారు. జైళ్లలో కూడా మంచి ఆహారం అందిందని చెప్పారు. ఇప్పుడు బ్యాంకుల ముందు మహిళలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎంత నల్లధనాన్ని వెలికి తీసిందో చెప్పాలి. చాలా మంది డబ్బు ఉంటే ఎన్నికల్లో గెలుస్తారని అనుకుంటున్నారని, కానీ ప్రజల ఆదరణ ఉంటూనే గెలుస్తారని చెప్పారు.
రాజ్యసభ: పెద్ద నోట్లపై చర్చ ప్రారంభించిన ఆనంద్ శర్మ
నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ ప్రకటన చేశారని మాజీ కేంద్రమంత్రి ఆనంద్ శర్మ తెలిపారు. నల్లధనం, నకిలీ నోట్లను నిర్మూలించేందుకే పెద్ద నోట్లను రద్దు చేసినట్లు ఆయన ప్రకటించారని తెలిపారు.
ఒకే ఒక్క నిర్ణయంతో చెలామణిలో ఉన్న 88శాతం నోట్లను రద్దు చేశారని చెప్పారు. దేశంలో నకిలీ కరెన్సీ ఎంత ఉందో ఆర్థిక మంత్రి వెల్లడించాలని అన్నారు. రద్దు చేసిన కరెన్సీ అంతా నల్లధనమేనా? అని ప్రశ్నించారు. కనీస హెచ్చరిక చేయకుండా సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
ఏటీఎంలు, బ్యాంకులు ముందు జనాలు బారులు తీరుతున్నారని, రూ. 2వేలకు చిల్లర దొరకడం లేదని అన్నారు. విత్తనాలు తెచ్చే రైతులు నల్లధనం తెస్తారా? అని ప్రశ్నించారు. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడుంది? అని ఆయన ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దుతో విదేశీ పర్యాటకులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అన్ని అంశాల్లో సర్జికల్ దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. గతంలో కూడా నోట్లను రద్దు చేశారు, కానీ గడువు ఇచ్చారని చెప్పారు. విదేశాల్లోని నల్లధనం తెచ్చేందుకు ప్రయత్నం చేశారా? అని ప్రశ్నించారు. ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పెద్దనోట్ల రద్దులో భారీ కాంగ్రెస్ ఉందని ఆరోపించారు.
నల్లధనం నియంత్రణకు అంతా తామే చేసినట్టు గొప్పలు చెప్పుకోవద్దని ఆనంద్ శర్మ బీజేపీ నేతలకు సూచించారు. నల్లధనం నియంత్రణకు గతంలో ఉన్న ప్రభుత్వాలన్నీ ఎన్నో చర్యలు తీసుకున్నాయని అన్నారు. అందులో భాగంగానే తాము మనీ ల్యాండరింగ్ యాక్ట్, ఫెరా నిబంధనలు ఇలా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని ఆయన చెప్పారు. వాటి ఆధారంగానే ఇప్పటికీ నల్లధనాన్ని నియంత్రిస్తున్నారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications