గుడిలోకి వెళ్తే ఇంత ఘోరమా? మహిళ బట్టలు ఊడదీసి, చెప్పుల దండ వేసి!
మహారాష్ట్రలో సభ్యసమాజం తలదించుకునేలా ఓ అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. థానే జిల్లా ఉల్హాస్‌నగర్‌లోని విఠల్‌వాడీ ప్రాంతంలో ఓ మహిళపై సామూహికంగా అమానుషానికి ఒడిగట్టారు. బాధితురాలి బట్టలు ఊడదీసి, అర్థనగ్నంగా మార్చి, జుట్టు కత్తిరించి, చెప్పుల దండ వేసి వీధుల్లో ఊరేగించిన దారుణ ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులపై కఠిన చర్యలు ప్రారంభించారు.
వివాదానికి కారణమేంటి?
ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాల మధ్య ఆలయ ప్రవేశం విషయంలో తలెత్తిన చిన్న వివాదమే ఈ ఘోరానికి దారితీసిందని ఉల్హాస్ నగర్ ఏసీపీ శైలేష్ కాలే వెల్లడించారు. బాధితురాలు, నిందితులు ఇద్దరూ వాఘరీ వర్గానికి చెందినవారని, వీరంతా బెలూన్లు (బుడగలు) అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారని పోలీసులు తెలిపారు. నిందితులు బాధితురాలికి బంధువులేనని సమాచారం. తమ కులదైవాలను, దేవతలను బాధితురాలు అవమానించిందని.. అందుకే ఆమెను గుడిలోకి రానివ్వకుండా అడ్డుకున్నామని, ఆ తర్వాత వివాదం ముదిరి ఈ దారుణానికి దారితీసిందని నిందితులు వాదిస్తున్నారు.

ఈ ఘోర ఉదంతంపై ఉల్హాస్‌నగర్ సెంట్రల్ పోలీస్ స్టేషన్ అధికారులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఉద్దేశపూర్వకంగా గాయపరచడం, క్రిమినల్ బెదిరింపులు, అక్రమంగా గుమిగూడడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వంటి సెక్షన్ల కింద ఈ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిలో మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేయగా.. అందులో సీనియర్ ఇన్‌స్పెక్టర్ శंకర్ అవతాడే నేతృత్వంలోని పోలీసులు ఇప్పటికే ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు.
#WATCH | Thane, Maharashtra | A video is going viral, purportedly showing women being beaten up, stripped semi-naked, hair chopped off, and paraded with garlands of slippers over a temple entry dispute between two families of the same community at the Vitthal Wadi area of… pic.twitter.com/It5Uk9EDI2
— ANI (@ANI) May 16, 2026
ఈ రెండు కుటుంబాల మధ్య గతంలోనూ పలుమార్లు గొడవలు జరిగాయని.. గతంలో బాధితురాలిపై నిందితులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారని విచారణలో తేలింది. ప్రస్తుతం పోలీసులు ఈ వివాదానికి సంబంధించిన పూర్తి నిజాలను తెలుసుకోవడానికి ఇరు పక్షాల వారిని విచారిస్తున్నారు. అలాగే ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ఆ సమయంలో అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షుల నుంచి స్టేట్‌మెంట్లు రికార్డు చేస్తున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.












Click it and Unblock the Notifications