లాక్ డౌన్‌లో మహిళలను వేధిస్తోన్న అతిపెద్ద సమస్య.. ఆ బాధ వర్ణనాతీతం..
లాక్ డౌన్ మహిళల కష్టాలను రెట్టింపు చేసింది. సాధారణ రోజుల్లో కంటే లాక్ డౌన్ పీరియడ్‌లో ఇంట్లో పనులు ఎక్కువైపోయాయి. ఎప్పుడూ ఏదో ఒకటి వండి పెట్టడం,ఇల్లు సర్దడం,ఇలా లాక్ డౌన్ పీరియడ్‌లోనూ వారికి తీరిక దొరకట్లేదు.గతంతో పోలిస్తే.. లాక్ డౌన్ పీరియడ్‌లో డైలీ రొటీన్స్‌లో కాస్త మార్పు వచ్చింది. మానసికంగా వారిపై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా చాలామంది మహిళలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌తో బాధపడుతున్నారు. లాక్ డౌన్‌లో అంతా హ్యాపీగా విశ్రాంతి తీసుకుంటున్నవేళ.. మహిళలకు మాత్రం ఈ కష్టాలు,బాధలు తప్పడం లేదు. దీనిపై పలువురు గైనకాలజిస్టులు ఏమంటున్నారో పరిశీలిద్దాం..

ఎందుకిలా జరుగుతోంది..
లాక్ డౌన్ కారణంగా లైఫ్ స్టైల్లో, డైలీ రొటీన్స్‌లోనూ మార్పు వచ్చింది. చాలామంది మహిళలకు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా పోయింది. డైట్‌లో,పడుకునే వేళల్లో మార్పు వచ్చింది. గతంతో పోల్చితే చాలామందిలో ఏదో తెలియని ఒక ఆందోళన నెలకొంది. ఇవన్నీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపించడంతో మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య తలెత్తుతోందని చెన్నైకి చెందిన గైనకాలజిస్టు డా.అర్చన తెలిపారు. సాధారణ రుతు క్రమానికి కారణమయ్యే హార్మోన్లు ఒత్తిడికి గురై.. వాటిల్లో మార్పులు సంభవించడంతో నెలసరి క్రమం తప్పే అవకాశం ఉందంటున్నారు.

కార్టిసాల్ హార్మోన్‌పై ప్రభావం..
ఒత్తిడితో కూడిన పరిస్థితుల కారణంగా చాలామంది మహిళలు ఈ సమస్యను అనుభవిస్తున్నట్టు డా.అర్చన వెల్లడించారు. అయితే కొందరిలో ఇది పీరియడ్స్ రావాల్సిన సమయం కంటే ముందుగా రావడానికి కారణమవుతోందని.. మరికొందరిలో మాత్రం చాలా ఆలస్యానికి కారణమవుతోందని చెప్పారు. శరీరంలో ఉత్పత్తి అయ్యే కార్టిసాల్ హార్మోన్‌పై ఒత్తిడి ప్రభావితం ఉంటుందని డా.మధురిమ కుమార్ అనే గైనగాలజిస్ట్ తెలిపారు. ఈ కార్టిసాల్ హార్మోన్‌ను స్ట్రెస్ హార్మోన్ అని కూడా పిలుస్తారని.. శరీరంలోని హార్మోన్లను ఇది క్రమబద్దీకరిస్తుందని చెప్పారు. అయితే ఎప్పుడైతే మహిళలు తీవ్ర ఒత్తిడికి లోనవుతారో.. కార్టిసాల్ ఎక్కువ మొత్తంలో విడుదలై.. సాధారణ పునరుత్పత్తి హార్మోన్లను అణచివేస్తుందని తెలిపారు.

నిద్ర,రక్తప్రసరణపై ప్రభావం..
కార్టిసాల్ హార్మోన్ అడ్రినల్ గ్రంథుల నుంచి విడుదలవుతుందని.. ఇది కిడ్నీల పైభాగంలో ఉంటుందని డా.అర్చన తెలిపారు. ఇది నిద్ర/మెలకువ సైకిల్‌ను క్రమబద్దీకరించడంతో పాటు రక్త ప్రసరణను,రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్దీకరిస్తుందని చెప్పారు. అయితే మహిళలు ఒత్తిడికి గురైనప్పుడు కార్టిసాల్ ఎక్కువ మోతాదులో విడుదల కావడం వల్ల రుతుస్రావంపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. ఫలితంగా నిద్రపై ప్రభావం పడుతుందన్నారు. ఇక ఇదివరకే పీసీఓఎస్(పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్) సమస్యతో బాధపడుతున్నవారిలో.. హార్మోన్ల సమతుల్యత లేకపోవడం వల్ల.. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య మరింత తీవ్రంగా ఉంటుందని బెంగళూరుకి చెందిన డా.కవితా లక్ష్మీ ఈశ్వరన్ తెలిపారు.
Recommended Video

పరిష్కార మార్గమేంటి..
ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కారణంగా.. కొంతమంది మహిళలు ప్రెగ్నెంట్ అయ్యామా అన్న సందేహంలో ఉంటున్నారు. మరికొందరు మహిళలు.. ఎప్పుడూ సరిగా వచ్చే నెలసరి.. ఈసారి మాత్రం ఎందుకు ఆలస్యమవుతోందని ఆందోళన చెందుతున్నారు. కొందరు కడుపునొప్పి కారణంగా కనీసం బెడ్‌పై నుంచి కూడా లేవలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదంతా ఒత్తిడి వల్లే జరుగుతోందా.. లేక అంతర్లీనంగా మరేవైనా సమస్యల కారణంగా జరుగుతోందా అన్నది వైద్య పరీక్షలు చేస్తే తప్ప చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో అనవసర భయాందోళనలకు గురై ఒత్తిడి పెంచుకోవద్దని సూచిస్తున్నారు. వైద్యులను సంప్రదించి.. వారి సూచనల మేరకు మందులు వాడితే సమస్య తగ్గుముఖం పడుతుందంటున్నారు.












Click it and Unblock the Notifications