హాంకాంగ్ కు బయలుదేరి మృత్యువు పాలైంది
బెంగళూరు: ఎయిర్ పోర్టు దగ్గరకు వెళుతున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం చెందిన సంఘటన బెంగళూరులోని చిక్కజాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హాంకాంగ్ లో నివాసం ఉంటున్న జాగృతి సాద్వానీ(27) అనే యువతి మరణించింది.
బెంగళూరుకు చెందిన జాగృతి సాద్వానీ కుటుంబ సభ్యులతో కలిసి హాంకాంగ్ లో స్థిరపడింది. ఆమె అక్కడే ఉద్యోగం చేస్తున్నది. జాగృతి సాద్వానీకి వివాహం నిశ్చయం అయ్యింది. త్వరలో పెళ్లి జరగవలసి ఉంది. కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు.
గత వారం జాగృతి సాద్వానీ సొంత పనుల కారణంగా తల్లితో కలిసి బెంగళూరు వచ్చింది. పని ముగించుకుని ఆదివారం రాత్రి హాంకాంగ్ వెళ్లడానికి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రం దగ్గరకు మేరు కారు (ట్యాక్సీ)లో బయలుదేరారు.

మార్గం మద్యలో విద్యానగర ఫ్లై ఓవర్ దగ్గర బస్సు, కారు డ్రైవర్లు వాహనాలు నిలిపివేసి కిందకు దిగి గొడవపడుతున్నారు. ఆ సమయంలో ట్యాక్సీ డ్రైవర్ విషయం గుర్తించలేక పోయాడు. బస్సుకు ఇండికేటర్ వెయ్యకపోవడంతో వేగంగా వెళ్లి నేరుగా ఢీకొన్నాడు.
ఈ ప్రమాదంలో జాగృతి సాద్వానీ తలకు తీవ్రగాయాలైనాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై ఆమె మరణించిందని పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ కు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications