Yogi Adityanath : చిన్న వ్యాపారవేత్తలకు యోగీ ఆదిత్యనాథ్ వరం-ప్రమాద బీమా పథకం...
యూపీలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చాక సరికొత్త నిర్ణయాలతో ఆకట్టుకుంటున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్.. ఇవాళ చిన్న వ్యాపారులకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో చిన్న వ్యాపారస్తులు ప్రమాదాల్లో చనిపోతే వారికి ప్రభుత్వం తరఫున బీమా పరిహారం అందేలా చేసేందుకు ఉద్దేశించిన పథకాన్ని యోగీ ఇవాళ ప్రారంభించారు. దీంతో లక్షలాది మంది చిన్న వ్యాపారులకు లబ్ది కలగనుంది.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకాన్ని లక్నోలో ప్రారంభించారు. వ్యాపారవేత్త సోదరులందరికీ హృదయపూర్వక అభినందనలు అంటూ ఈ సందర్భంగా ట్విట్టర్ లో యోగీ ట్వీట్ చేశారు. ఈ పథకాన్ని ప్రారంభించిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. రూ.5 కోట్ల లోపు మూలధనం, రూ.40 లక్షల లోపు టర్నోవర్ ఉన్న రాష్ట్రంలోని 90 లక్షల మందికి పైగా పారిశ్రామికవేత్తలు ఈ పథకం కింద లబ్ధి పొందుతారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని ఆయన పారిశ్రామికవేత్తలను కోరారు.

ఆరేళ్ల క్రితం ఎవరూ యూపీకి రావాలని అనుకోలేదని, అయితే గత వారంలో దేశంలో అత్యధిక పెట్టుబడులు ఉన్న రాష్ట్రంగా రాష్ట్రం మారిందని యోగీ ఆదిత్యనాథ్ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆర్బీఐ, నీతి ఆయోగ్ నివేదికలను గమనిస్తే ఈ విషయం అర్ధమవుతుందన్నారు. ప్రమాదం కారణంగా మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్ మరణించినా లేదా అంగవైకల్యం చెందినా ఈ పథకం రూ.5 లక్షల వరకు క్లెయిమ్‌లను అందజేస్తుందన్నారు.
చిన్న పారిశ్రామికవేత్తలు ప్రమాదంలో పాక్షిక వైకల్యానికి గురైన సందర్భంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ జారీ చేసిన వైకల్యం సర్టిఫికేట్‌లో పేర్కొన్న వైకల్యం శాతం ప్రకారం క్లెయిమ్ ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి మైక్రో ఉద్యమి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల చిన్న వ్యాపార సంస్ధల వ్యవస్థాపకులు దాని ప్రయోజనాలను పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.












Click it and Unblock the Notifications