2019 లోక్‌సభ ఎన్నికలకు ఆ అస్త్రం?.. ఆర్నెళ్ల ముందు ప్రయోగిస్తారట: యోగి కొత్త స్ట్రాటజీ
లక్నో: ఇటీవలి ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఉపఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చూసిన బీజేపీ.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అది పునరావృతం కాకూడదని జాగ్రత్తపడుతోంది. ఇందుకోసం ఇప్పటినుంచే వ్యూహాత్మక కసరత్తు మొదలుపెట్టిన ఆ పార్టీ.. 'మండల్ కమిషన్' ప్రతిపాదనలను తమ అస్త్రంగా మలుచుకోవాలని భావిస్తోంది.

మండల్ కమిషన్ ప్రతిపాదనలే అస్త్రంగా..
రాష్ట్రంలో 82శాతం ఉన్న ఓబీసీ కులాలను మూడు విభాగాలుగా విభజించి రిజర్వేషన్లను అమలుచేయడం ద్వారా వెనుకబడిన తరగతుల్లో పార్టీకి ఆదరణ పెంచుకోవచ్చునని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు మండల్ కమిషన్ ప్రతిపాదించినట్టుగా.. వెనుకబడిన తరగతుల్లో నాలుగు కులాలు, బాగా వెనుకబడిన తరగతుల్లో 19 కులాలు, అత్యంత వెనుకబడిన కులాల్లో (ఎంబీసీలు) 59 కులాలుగా ఓబీసీలను విభజించి రిజర్వేషన్లు అమలుచేయాలనే యోచనలో ఉంది.

ఎస్పీకి చెక్ పెట్టేందుకే
ఈ ఎత్తుగడ ద్వారా ఎస్పీ ఓటు బ్యాంకుకి గండికొట్టవచ్చునని యోగి సర్కార్ భావిస్తోంది. యూపీలో ప్రస్తుతం యాదవులు బలమైన సామాజికవర్గంగా ఉన్న సంగతి తెలిసిందే. వారంతా ఎస్పీ వైపే ఉంటూ వస్తున్నారు. ఇలాంటి తరుణంలో మండల్ కమిషన్ ప్రతిపాదించిన ప్రకారం ఓబీసీ రిజర్వేషన్ అమలు చేస్తే.. యాదవుల ఆధిపత్యానికి చెక్ పెట్టవచ్చునని యోగి సర్కార్ భావిస్తోంది.

ఎస్పీ-బీఎస్పీలను ఓడించేందుకు..
ప్రస్తుతం ఓబీసీ రిజర్వేషన్ల ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందుతున్నది యాదవులే అన్న అభిప్రాయం బలంగా ఉన్నది. దీంతో మిగతా బీసీ కులాలకు యాదవుల ఆధిపత్యంపై కొంతమేర అసంతృప్తి ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని మండల్ కమిషన్ ప్రతిపాదనలను అమలుచేయడం ద్వారా ఆయా సామాజిక వర్గాలకు మరింత చేరువవ్వాలనేది వారి ప్లాన్. తద్వారా ఎస్పీ-బీఎస్పీ సామాజిక సమీకరణాన్ని దెబ్బతీయాలని బీజేపీ యోచిస్తోంది.
బీసీలు, దళితులు, ముస్లిం సామాజికవర్గాలను సమీకరించడం ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలనేది ఎస్పీ-బీఎస్పీ ప్లాన్. దీన్ని నిర్వీర్యం చేయడానికి యోగి సర్కార్ ఇప్పుడు మండల్ కమిషన్ ప్రతిపాదనను వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకొచ్చింది.

ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు..
మండల్ కమిషన్ ప్రతిపాదనల మేరకు రిజర్వేషన్లను అమలుచేయబోతున్న అంశాన్ని కేబినెట్ సీనియర్ మంత్రి, బీజేపీ సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) అధ్యక్షుడు ఓపీ రాజ్‌భర్ మీడియాకు తెలిపారు. లోక్‌సభ ఎన్నికలకు ఆరు నెలల ముందు ఈ నిర్ణయాన్ని అమలుచేయాలని యోగి ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. అయితే ఈ అస్త్రం బీజేపీకి ఎంతమేర ఉపయోగపడుతుందన్నది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications