"దీపావళి సమయంలోనే కాలుష్యం గుర్తొస్తుందా..? టపాసులు కాలిస్తే తప్పేంటి..?"
దీపావళి పండగ సందర్భంగా టపాసులు కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతోందని వస్తున్న కథనాలపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలు ఎంతో ఉత్సాహంగా.. సంబరంగా పండగ జరపుకున్నారని కాలుష్యం గురించి మరీ అంతలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. "డోంట్ వర్రీ.. కాలుష్యాన్ని నియంత్రించవచ్చు" అని పేర్కొన్నారు. లక్నోలోని ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. పండుగలపై ఆంక్షలను తమ ప్రభుత్వం ప్రోత్సహించదని స్పష్టం చేశారు. ఒక్కరోజు దీపావళి సంబరాలతో కాలుష్యంపై ఆందోళన ఎందుకని.. మరి ఏళ్ల నుంచి అవినీతితో వ్యవస్థల్ని కలుషితం చేసేవారిని ఎందుకు ప్రశ్నించడం లేదని విమర్శించారు.
" ప్రజలు దీపావళి సందర్భంగా ఒక్కరోజు టపాసులు కాల్చితే కాలుష్యం వచ్చింది. దాన్ని కొంతకాలానికి నియంత్రించవచ్చు. నో ప్రాబ్లెమ్.. ప్రజలు దీపావళి పండగను ధూమ్- ధడాఖా తో నిర్వహించారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చడం ఆనందాన్ని కలిగించింది. ఈ పండగపై ఎలాంటి ఆంక్షలు విధించరాదని మేము నిర్ణయం తీసుకున్నాం. ప్రజలు స్వేచ్ఛగా వేడుకలు జరుపుకోవాలని కోరుకున్నాం" అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. అయితే వ్యవస్థల్ని కలుషితం చేసేవారిని ఎవరూ ప్రశ్నించడం లేదని.. దీపావళి సందర్భంగా ప్రజలు ఒక్కరోజు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటే మాత్రం వెంటనే కాలుష్యం, గాలి నాణ్యత అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇక ఉత్తర్ ప్రదేశ్, దిల్లీ, హరియాణా ప్రాంతాల్లో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీపావళి తర్వాత దీల్లీ-NCR పరిధిలో అత్యంత కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాక తాజాగా స్విస్ సంస్థ ఐక్యూ ఎయిర్ వార్షిక కాలుష్య ర్యాంకింగ్స్ లోనూ ఈ ప్రాంతం ప్రపంచంలోని అత్యంత కలుషిత ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. వాహనాల రాకపోకలు, పంట వ్యర్థాలను కాల్చడం, నిర్మాణ పనులు, పారిశ్రామిక కాలుష్యం తదితర కారణాలుగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications
