పెప్సీ కూడా పీకేసింది.. కూల్ డ్రింక్స్ రేట్లు పెరగడంతో కొంపమునిగింది..
ప్రపంచ ప్రఖ్యాత కూల్ డ్రింక్స్, స్నాక్స్ దిగ్గజం 'పెప్సీకో' (PepsiCo) ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులకు గట్టి షాక్ ఇచ్చింది. ఉత్తర అమెరికా మార్కెట్లో క్రమంగా తగ్గుతున్న అమ్మకాలు, పెరిగిపోతున్న ఉత్పత్తి వ్యయం కంపెనీ లాభాలను దెబ్బతీయడంతో ఖర్చులు తగ్గించుకునే చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉత్తర అమెరికా విభాగానికి చెందిన ఫుడ్ అండ్ బెవరేజెస్ విభాగంలో దాదాపు 1,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మారుతున్న మార్కెట్ వేగానికి అనుగుణంగా సంస్థను మరింత వేగవంతంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని యాజమాన్యం వెల్లడించింది.
ఉద్యోగులకు సీఈఓ లేఖ.. వేగంగా మారుతున్న పరిణామాలు
పెప్సీకో ఉత్తర అమెరికా విభాగం సీఈఓ రామ్ కృష్ణన్ సిబ్బందికి రాసిన లేఖ ద్వారా ఈ ఉద్యోగ కోతల విషయాన్ని స్పష్టం చేశారు. కంపెనీ నిర్ణయాలు మరింత వేగంగా జరగడానికి, వ్యాపార విభాగాల మధ్య మెరుగైన సమన్వయం సాధించడానికే సంస్థాగత పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చే వారంలోనే ఈ తొలగింపుల ప్రక్రియ పూర్తి కానుంది. పెప్సీకో వ్యాపారంలో ఎక్కువ భాగం అమెరికాలోనే సాగుతున్న నేపథ్యంలో, ఈ లేఆఫ్ వార్తలు కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

సెక్టార్‌పై ద్రవ్యోల్బణ దెబ్బ.. క్రమంగా పడిపోతున్న అమ్మకాలు
ఈ నిరుత్సాహకర నిర్ణయానికి ప్రధాన కారణం అమెరికా మార్కెట్లలో కొనుగోలు శక్తి తగ్గడమే. నిత్యావసరాల ధరలు పెరగడంతో వినియోగదారులు కూల్ డ్రింక్స్, ప్యాక్డ్ స్నాక్స్ కొనడం తగ్గించేశారు. ఇటీవల ముగిసిన సెప్టెంబరు త్రైమాసికంలో ఉత్తర అమెరికాలో కూల్ డ్రింక్స్ అమ్మకాల పరిమాణం 2 శాతం మేర పడిపోగా, ఫుడ్ సేల్స్ ఏమాత్రం వృద్ధి చెందలేదు. కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ఉత్పత్తుల ధరలు తగ్గించినా, భారీగా ప్రకటనలు గుప్పించినా ఫలితం దక్కలేదు. దీంతో కంపెనీ తన వార్షిక లాభాల అంచనాలను కూడా తగ్గించుకోవాల్సి వచ్చింది.
పెట్టుబడిదారుల ఒత్తిడి.. షేర్ మార్కెట్ రెస్పాన్స్
కంపెనీలో లాభదాయకత పెంచాలని యాక్టివిస్ట్ ఇన్వెస్టర్ ఫండ్ 'ఎలియట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్' సుమారు 4 బిలియన్ డాలర్ల మేర వాటాలు కొనుగోలు చేసి యాజమాన్యంపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. కంపెనీ నష్టాలను తగ్గించుకునే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా పెప్సీకోలో సుమారు 3,06,000 మందికి పైగా సిబ్బంది పనిచేస్తుండగా, ఒక్క అమెరికాలోనే 1.25 లక్షల మంది పనిచేస్తున్నారు. మొత్తం ఉద్యోగులతో పోలిస్తే వేటు పడిన వారి సంఖ్య తక్కువే అయినప్పటికీ, రాబోయే రోజుల్లో మిగిలిన విభాగాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందా అన్న ఆందోళన ఉద్యోగుల్లో మొదలైంది.














Click it and Unblock the Notifications
