• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Ankur Warikoo, Rachana Ranade: ఈ యూట్యూబర్లు ఇచ్చే ఆర్ధిక సలహాతో లాభాలు సంపాదించొచ్చా, వీరికోసం యూజర్లు ఎందుకు ఎగబడుతున్నారు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రచన రానడే

డిజిటల్ టెక్నాలజీ వేగంగా పెరిగిపోతోంది. ఎలాంటి విషయాలు తెలుసుకోవడానికైనా యువత ఆన్‌లైన్ కంటెంట్‌ను ఆశ్రయిస్తోంది. ఈమధ్య కాలంలో, ఆర్థిక అంశాలు, పర్సనల్ ఫైనాన్స్, పెట్టుబడి మార్గాలు మొదలైన విషయాలను సులువుగా అర్థం చేసుకోవడానికి యువత మొగ్గు చూపుతుండడంతో డిజిటల్ మీడియాలో దీనికి సంబంధించిన కంటెంట్ పెరుగుతోంది.

రెండేళ్ల క్రితం కరోనా కారణంగా ముంబై నగరంలోని మూవీ స్టూడియోలన్నీ నిరవధికంగా మూతబడ్డాయి. దాంతో 23 ఏళ్ల ఫిల్మ్‌మేకర్ శివం ఖాత్రి చిక్కుల్లో పడ్డారు. చేతిలో ఉన్న డబ్బును సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి పెట్టారు. స్కూల్లో గానీ, కాలేజీలో గానీ నేర్పని ఫైనాన్షియల్ పాఠాలు నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు.

పుస్తకాలు, ట్యుటోరియల్స్ తిరగేశారు. అయితే, శివంకు కావలసింది యూట్యూబ్‌లో దొరికింది. తనకు అర్థమయ్యే భాషలో ఆర్థిక విషయాలను విప్పి చెప్పే వీడియోలు యూట్యూబ్‌లో దొరికాయి.

"వాళ్ల వీడియోలు సరళంగా ఉంటాయి. అర్థం చేసుకోవడం సులువు. అంతే కాకుండా చాలా రకాల అంశాలు వాళ్లు చెబుతారు" అని శివం అన్నారు.

ఈ వీడియోలు తయారుచేస్తున్న వారిలో రచనా రానడే ఒకరు. శివం ఆమె వీడియోలు ఎక్కువగా ఫాలో అయ్యేవారు.

క్లిష్టమైన ఆర్థిక అంశాలను ఆ పరిభాషలో కాకుండా అందరికీ సులువుగా అర్థమయ్యే విధంగా వివరిస్తారు రచన. అందుకే యూట్యూబ్‌లో ఆమె వీడియోలకు 35 లక్షల మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు.

ట్రేడింగ్

'ఆర్థిక అంశాలను సరళీకరించడమే నా మంత్రం'

రచన రానడే పూణెలో ఒక కొత్త ఆఫీసు తెరిచారు. యూట్యూబర్‌గా ఆమె ఎదుగుదల మొత్తాన్ని గ్రాఫిక్స్ ద్వారా మాకు చూపించారు.

రచన తన మొదటి వీడియోను 2019 ఫిబ్రవరిలో అప్‌లోడ్ చేశారు. కేవలం అయిదు నెలల్లోనే లక్ష మంది సబ్‌స్కైబర్లను సంపాదించుకున్నారు. తారాజువ్వలా ఆమె పైకి దూసుకొచ్చారు.

రచన బయటికొస్తే ఆటోగ్రాఫ్ ఇమ్మని, సెల్ఫీ తీసుకుంటామని చుట్టూ జనం మూగుతుంటారు. సాధారణంగా బాలీవుడ్ సెలబ్రిటీలకు లేదా క్రికెటర్లకే ఇలాంటి అభిమానులుంటారు.

రచనకు కూడా సినిమాలంటే పిచ్చి. తన ఆఫీసు గది నిండా షారుఖ్ ఖాన్ సినిమాల పేర్లతో ఉన్న పోస్టర్లు ఉంటాయి. అయితే, ఆ సినిమా పేర్లను క్లిష్టమైన ఆర్థిక అంశాలు వివరించేందుకు వాడుతుంటారు రచన. ఉదాహరణకు, జీవిత బీమా అవసరాన్ని వివరించడానికి 'కల్ హో న హో' సినిమా పేరుతో పోస్టరు తయారుచేశారు.

"ఆర్థిక అంశాలను సరళీకరించడం" ఇదే నా మంత్రం అంటారామె.

భారతదేశంలో యువ పెట్టుబడిదారులకు కావలసింది ఇదే. వారు వెతుకుతున్నది ఇదే. కోవిడ్ సమయంలో చాలామంది ట్రేడింగ్ అకౌంట్లు ఓపెన్ చేశారు. షేర్ మార్కెట్లోకి దిగారు.

కానీ, భారతదేశంలో పదిమందిలో ముగ్గురికి మాత్రమే ఫైనాన్స్ రంగంలో ఏబీసీడీలు తెలుసునని అధికారిక సర్వేలు చెబుతున్నాయి. వారంతా, స్టాక్ మార్కెట్లో సులువుగా లాభాలు ఎలా సాధించాలి, యునికార్న్ బూమ్ వచ్చినప్పుడు రాత్రికి రాత్రే ఎలా లక్షాధికారులు అయిపోవాలి మొదలైన విషయాలు తెలుసుకోవాలన్న ఆకలి మీద ఉన్నారు.

ఈ ఆకలే కంటెంట్ క్రియేటర్లకు ఆధారమైంది. డిజిటల్ మీడియాలో ఫైనన్స్ రంగానికి సంబంధించిన కంటెంట్ అమాంతం పెరిగిపోయింది.

అంకుర్ వారికూ

'నేటి తరానికి యూట్యూబే యూనివర్సిటీ'

"భారతదేశంలో Gen-Z, మిలీనియల్స్‌కు యూట్యూబ్ ఒక యూనివర్సిటీ అయి కూర్చుంది" అంటున్నారు అంకుర్ వారికూ. పారిశ్రామికవేత్తగా కెరీర్ ప్రారంభించిన అంకుర్ ఇప్పుడు ఫైనాషియల్ ఇంఫ్లుయెన్సర్‌గా మారిపోయారు.

అంకుర్ చేసే వీడియోలు పర్సనల్ ఫైనాన్స్, ఆంట్రప్రెన్యూర్‌షిప్, ఉత్పాదకతలో సమస్యలపై దృష్టి సారిస్తాయి.

అంకుర్‌కు ఎంత పాపురాలిటీ వచ్చిందంటే ఈ అంశాలపై ఒక పుస్తకం రాయమని ఆహ్వానం వచ్చింది. దాంతో, తన మొదటి పుస్తకం 'డు ఎపిక్ షిట్' రాశారు. చాలా త్వరగా అది మార్కెట్లో బెస్ట్ సెల్లర్‌గా మారిపోయింది.

అంకుర్‌కు ఒక్క రాత్రిలోనే ఇంత పాపులారిటీ వచ్చేసిందని చాలామంది అనుకుంటారు. కానీ, తన ప్రయాణం దశాబ్దం క్రితం ప్రారంభమైందని ఆయన అంటారు.

అయితే, కరోనా మహమ్మారి ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ కాలంలోనే పర్సనల్ ఫైనాన్స్ కంటెంట్‌కు డిమాండ్ పెరిగింది. కంటెంట్ సృష్టికర్తలకు కలిసొచ్చింది.

"ఒక్కసారిగా హై క్వాలిటీ కంటెంట్ రావడం మొదలైంది. చాలామంది సృష్టికర్తలు పుట్టుకొచ్చారు. చేతిలో సమయం, డబ్బుతో ఆడియెన్స్ రెడీగా ఉన్నారు. మార్కెట్ పైకి వెళుతూ ఉంది. ఒకవేళ మార్కెట్ పడిపోతూ ఉంటే మాత్రం ఇవన్నీ వివరించడం చాలా కష్టమయ్యేది" అని అంకుర్ అన్నారు.

"చాలా అంశాలు కలిసొచ్చాయని" అంకుర్ అంటారు. టెక్నాలజీ పెరిగిపోవడం, ఇంటర్నెట్ చౌకగా లభ్యం కావడం, కొత్త తరం ఆలోచనల్లో మార్పు, టీవీ, ప్రింట్ మీడియాల నుంచి దృష్టి మరలించి డిజిటల్ మీడియా వైపు సారించడం.. ఇవన్నీ తనలాంటి కంటెంట్ క్రియేటర్ల విజయానికి కారణమని ఆయన అంటారు.

"ముఖ్యంగా డబ్బును సద్వినియోగం చేసుకోవడానికి ఇష్టపడని వారెవరూ ఉండరు. కానీ, దాని గురించి కూలంకషంగా తెలుసుకునే అవకాశాలే అరుదు" అంటారాయన.

యూట్యూబ్

కొత్తగా మార్కెట్లో ప్రవేశించేవారి కోసం..

అయితే, ఈ ట్రెండ్ సడన్‌గా వచ్చింది కాదు. గత కొన్నేళ్లుగా, భారతదేశంలో రియల్ టైమ్ ఫైనాన్షియల్ మార్కెట్ కంటెంట్‌ను ప్రసారం చేసే వ్యాపార ఛానెల్స్ ఎన్నో పుట్టుకొచ్చాయి. అయితే, అవి చిన్న గ్రూపులకే ప్రయోజనకారంగా నిలిచాయి. వ్యాపారులకు, సంస్థాగత పెట్టుబడిదారులకు ఉపయోగపడ్డాయి. కొత్తగా మార్కెట్లో ప్రవేశించేవారికి, ఫైనాన్స్ పాఠాలు నేర్చుకోవాలనుకునేవారికి ఈ ఛానల్స్ పెద్దగా ఉపయోగపడలేదు.

యూట్యూబర్లు ఆ ఖాళీని పూరించారు. వాళ్లకూ ఈ కంటెంట్ క్రియేషన్ లాభదాయకంగా మారింది. ప్రకటనకర్తలు, బ్రాండ్ మేనేజర్ల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో ఆఫర్లు రావడం ప్రారంభమైంది. కొలాబరేషన్స్, ప్లేస్‌మెంట్స్ ఆఫర్ల ద్వారా డబ్బు వచ్చి చేరింది.

ఫోర్బ్స్ ప్రకారం, మొదటి వరుసలో ఉన్న ఇంఫ్లుయెన్సర్లు ఒక బ్రాండెడ్ వీడియో ద్వారా సుమారు రూ. 15,63,890 ($20,000) సంపాదించగలరు.

ఆర్థిక విద్య అందరికీ సులువుగా అందుబాటులోకి వస్తున్న ఈ ధోరణిని ఆర్థిక నిపుణులు ప్రశంసిస్తున్నప్పటికీ, వినియోగదారుల వైపు నుంచి జాగ్రత్త అవసరమని హెచ్చరిస్తున్నారు.

టీవీలలో కార్యక్రమాలు, యాంకర్లపై నియంత్రణ ఉంటుంది. కానీ, డిజిటల్ కంటెంట్‌పై నియంత్రణ తక్కువ. ఏది నమ్మొచ్చు, నమ్మకూడదు అనేది తెలుసుకోవడం కష్టం.

అయితే, రచన, అంకుర్ లాంటి వాళ్లు స్టాక్ మార్కెట్ పెట్టుబడుల గురించి నేరుగా టిప్స్ ఇవ్వరు. కానీ, అలా చేసేవారు కూడా ఉన్నారు. ఈ రంగంలో నైపుణ్యం లేదా సామర్థ్యాలలో ఎలాంటి సర్టిఫికెట్లూ లేకుండానే సలహాలిస్తుంటారు.

"దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో, స్టాక్ మార్కెట్లో బాగా అనుభవం ఉన్నవారి మాటలనే నేను నమ్ముతాను. లాభనష్టాలు చవిచూసిన వారి సలహాలే తీసుకుంటా. కానీ, డిజిటల్ ట్రెండ్ పెరిగిపోవడంతో అంతా పైకే వెళుతోంది" అని ఒక బిజినెస్ ఛానెల్ మాజీ ఎడిటర్ గోవిందరాజ్ యతిరాజ్ అన్నారు. ప్రస్తుతం ఆయన ఒక ఫ్యాక్-చెకింగ్ వెబ్‌సైట్ నడుపుతున్నారు.

భారతదేశంలో గత రెండేళ్ల పాటు ఈక్విటీ మార్కెట్లు విజయాలు చవిచూశాయి. ఇప్పుడు పెద్ద మొత్తాల్లో విదేశీ ధనాన్ని వెనక్కు తీసుకోవడంతో మార్కెట్లు అస్థిరతతో ఊగిసలాడుతున్నాయి.

ఫైనాన్షియల్ ఇంఫ్లుయెన్సర్లకు ఇప్పుడే అసలు పరీక్ష మొదలైంది అంటున్నారు గోవిందరాజ్. వీరి విజయాలు ఎంత శాశ్వతమైనవో ఇప్పుడు తేలిపోతుంది అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Youtube users falling behind Ankur warikoo and Rachana Ranade for suggestions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X