హాలీవుడ్‌లో మళ్లీ కలకలం! ఈసారి ఓ దర్శకుడు, 38 మంది మహిళల ఆరోపణ!
హాలీవుడ్‌లో మళ్లీ కలకలం రేగింది. నిర్మాత హార్వే వీన్‌స్టీన్ లైంగిక వేధింపుల వ్యవహారాన్ని మర్చిపోకముందే దర్శకుడు జేమ్స్ టొబాక్ తమను లైంగికంగా వేధించారని 38 మంది మహిళలు ఆరోపించారు.
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్‌లో మళ్లీ కలకలం రేగింది. నిర్మాత హార్వే వీన్‌స్టీన్ లైంగిక వేధింపుల వ్యవహారాన్ని మర్చిపోకముందే తాజాగా మరో దర్శకుడి నిర్వాకం బయటపడింది!
'బగ్సీ' చిత్రానికిగాను ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో ఆస్కార్ అవార్డు(1991)కు నామినేట్ అయిన అమెరికా దర్శకుడు జేమ్స్ టొబాక్ తమను లైంగికంగా వేధించారని 38 మంది మహిళలు ఆరోపించారు.

'లాస్ ఏంజిల్స్ టైమ్స్' వార్తా సంస్థ ముందు వారు ఈ విషయాలను వెల్లడించారు. తాను పనిలోకి తీసుకున్న మహిళలపై, పనికోసం వెతుకుతున్న స్త్రీలపై, వీధుల్లో కనిపించిన మహిళలపై టొబాక్ వేధింపులకు పాల్పడినట్లు సదరు వార్తాసంస్థ వెల్లడించింది.
స్టార్ హోదా ఇప్పిస్తానని వాగ్దానం చేసి వీధుల్లో పలువురిని ఆయన లొంగదీసుకునే ప్రయత్నం చేశారని, ప్రముఖులతో తనకు లైంగిక సంబంధాలున్నాయని ప్రగల్భాలు చెప్పుకోవడంతోపాటు అవమానకర రీతిలో ఆయా మహిళలను వ్యక్తిగత ప్రశ్నలు అడిగేవారని వివరించింది.
అంతేకాదు, దర్శకుడు టొబాగ్ మహిళల ముందు అనుచిత లైంగిక ప్రవర్తన కనబర్చేవారని వెల్లడించింది. అయితే టొబాక్ వేధింపులను ప్రస్తుతం బయటపెట్టిన 38 మంది మహిళల్లో ఎవరూ ఆయనపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.
మరోవైపు దర్శకుడు జేమ్స్ టొబాగ్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. సదరు మహిళలను తానెప్పుడూ కలవలేదని ఆయన స్పష్టం చేశారు.
కొసమెరుపు ఏమిటంటే.. దర్శకుడు టొబాగ్ తమను లైంగికంగా వేధించారంటూ 38 మంది మహిళలు ఫిర్యాదు చేసిన తరువాత రెండ్రోజుల్లో దాదాపు 200 మందికిపైగా మహిళలు 'అవును.. ఆయన మమ్మల్ని కూడా వేధించారు..' అంటూ ముందుకు రావడం.












Click it and Unblock the Notifications