'భారతీయులకు భగవంతుడు, మత విశ్వాసాలపై మక్కువ ఎక్కువ'
న్యూఢిల్లీ: భారతీయుల్లో అత్యధిక శాతం మంది మతాన్ని విశ్వసిస్తారని ఒక సర్వేలో వెల్లడైంది. విన్/గ్యాలప్ ఇంటర్నేషనల్ అనే సంస్ధ గత ఏడాది చివరన ప్రపంచ వ్యాప్తంగా 65 దేశాల్లో ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా వెయ్యి మందిని ప్రశ్నిస్తే, 76 శాతం మంది తమ దైనందిన జీవితంలో దేవుడిని, మత విశ్వాసాలను నమ్ముతామని చెప్పారు.
21 శాతం మంది అటువంటి నమ్మకాలు లేవని తెలిపారు. కేవలం రెండు శాతం మంది మాత్రమే దేవుడుని, మతాన్ని నమ్మని నాస్తికులుగా ప్రకటించుకున్నారు. ఇక థాయిలాండ్‌లో 94 శాతం మంది మతాన్ని అనుసరిస్తామని చెప్పారు. ఈ సర్వేలో దేవుడిని నమ్మే దేశాల్లో థాయిలాండ్ మొదటి స్ధానంలో నిలవగా, కేవలం ఏడు శాతంతో చైనా ఆఖరి స్ధానంలో నిలిచింది.

చైనాలో 61 శాతం మంది ప్రజలు తాము నాస్తికులమని ప్రకటించుకున్నారు. ఇక పాకిస్ధాన్‌లో 88 శాతం మంది మతాన్ని నమ్మేవాళ్లు కాగా, 10 శాతం మంది మతాన్ని అనుసరించమని చెప్పారు. ఒక శాతం మంది మాత్రం నాస్తికులమని ప్రకటించుకున్నారు.
మతాన్ని నమ్మేవాళ్లలో ఎక్కువ మంది ఉన్న దేశాల్లో ఆర్మీనియా, బంగ్లాదేశ్, జార్జియా, మొరాకోలు ఉన్నాయి. ఈ దేశాల్లో 93 శాతం మంది మతాన్ని విశ్వసిస్తున్నారు. మతాన్ని విశ్వసించే వారిలో తక్కువగా ఉన్న దేశాల్లో జపాన్, స్వీడన్, చెక్ రిపబ్లిక్, బ్రటిన్‌లు ఉన్నాయి.
ఈ సర్వేపై విన్/గ్యాలప్ ఇంటర్నేషనల్ సంస్ధ అధ్యక్షుడు జీన్ మార్క్ లీగర్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మూడింట రెండొంతుల మంది మతాన్ని నమ్ముతామని తెలిపారని అన్నారు. 'మన రోజువారీ జీవితాన్ని మతం ఇప్పటికీ బలంగా ప్రభావితం చేస్తోంది. యువతలోనూ ఈ ధోరణి పెరుగుతున్న కారణంగా మతవిశ్వాసుల సంఖ్య ఇంకా వృద్ధి చెందే అవకాశం ఉంది' అని చెప్పారు.












Click it and Unblock the Notifications