Pakistan: మరో సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్.. వందకు చేరువలో మరణాలు
Shia Sunni conflict: ఓ పక్కన ఆర్థిక వ్యవస్థ పతనం మరియు కటిక దారిద్ర్యంతో, మరోపక్క ఊగ్రవాదుల ఘాతుక చర్యలతో పొరుగుదేశం పాకిస్థాన్ తీవ్రంగా సతమతం అవుతోంది. ఈ సమయంలో ముస్లింలలోని రెండు వర్గాల మధ్య చెలరేగిన ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. అక్కడ జరిగిన హింసలో వందల మంది గాయాలపాలు కాగా పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు.
వాయువ్య పాకిస్థాన్‌లో నాలుగు రోజులుగా తీవ్ర స్థాయిలో మతపరమైన హింస జరుగుతోంది. ఈ దాడుల్లో కనీసం 82 మంది మరణించినట్లు మరో 156 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఆఫ్ఘన్ సరిహద్దుకు సమీపంలోని కుర్రం జిల్లాలో సున్నీ మరియు షియా వర్గాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. పాకిస్థాన్ వ్యాప్తంగా ప్రధానంగా సున్నీలు నివసిస్తుండగా, కుర్రం జిల్లాలో గణనీయమైన షియా జనాభా ఉంది. ఈ రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు చాలా కాలంగా సమస్యగా ఉన్నాయి. కాగా అవి ఇప్పుడు తీవ్రతరం అయ్యాయి.

Over 100 people were killed in sectarian violence in Pakhtunkhwa. A convoy of Shia Pashtuns was attacked, and a Sunni Pashtun town was set on fire. Pashtuns blame Pakistan for the war in Pashtun land and demand Pakistani military withdrawal.
— Habib Khan (@HabibKhanT) November 23, 2024
pic.twitter.com/FwXOSwAum5
గురువారం ఈ హింసాకాండ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. పోలీసు ఎస్కార్ట్‌లో ప్రయాణిస్తున్న షియా ముస్లింల కాన్వాయ్‌లపై ముష్కరులు దాడి చేయడంతో 40 మందికి పైగా మరణించారు. దీంతో వారు సున్నీలపై ప్రతీకార దాడులకు దిగారు. అయితే షియా మరియు సున్నీ కమ్యూనిటీల మధ్య భూ వివాదాలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. గిరిజన మరియు సెక్టారియన్ వైరుధ్యాల వల్ల ఇదికాస్తా మతపరమైన హింసకు ఆజ్యం పోసింది. ప్రజలకు ఆయుధాలు అందుబాటులో ఉండటం ఈ స్థాయి మత సంక్షోభానికి కారణమని భావిస్తున్నారు. వీటి నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణమని దుమ్మెత్తిపోస్తున్నారు.
జూలై మరియు అక్టోబర్ మధ్య మతపరమైన హింస కారణంగా 79 మంది మరణించినట్లు పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ నివేదించింది. మరణించిన వారిలో 60కిపైగా షియాలు కాగా 16 మంది సున్నీలుగా తెలుస్తోంది. మహిళలు మరియు పిల్లలను చంపడం వంటి దాడులు పెరగడంతో వందలాది మంది ఆ ప్రాంతం నుంచి పారిపోయారు. ఈ గొడవలు క్రమంగా దేశంలో ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించాయి.
ఈ హింసాకాండపై దేశవ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. షియా వర్గం మృతుల అంత్యక్రియలకు వందలాది మంది హాజరయ్యారు. రోజుల తరబడి ఘర్షణల అనంతరం ఇరు గ్రూపుల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడానికి ప్రభుత్వాధికారులు ఆదివాసీ నేతలతో సమావేశమయ్యారు. చర్చలు సఫలం అయితే పరిస్థితి క్రమంగా మెరుగవుతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications