విషాదం: బోటు ప్రమాదంలో 17 మంది జలసమాధి: పలువురు గల్లంతు: 60 మందితో
మెక్సికో సిటీ: అగ్రరాజ్యం అమెరికా-బహమాస్ సముద్ర తీరంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. సముద్రంలో శరణార్థులు ప్రయాణిస్తోన్న బోటు ప్రమాదానికి గురైన ఘటనలో 17 మంది జలసమాధి అయ్యారు. మరో 25 మంది భద్రత బలగాలు కాపాడాయి. మియామి తీర ప్రాంతానికి సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. మృతులందరూ హైతీ దేశస్థులుగా గుర్తించారు. వారంతా అక్రమంగా అమెరికా వెళ్లడానికి ప్రయత్నించినట్లు నిర్ధారించారు.
న్యూ ప్రావిన్స్ నగరానికి ఏడు నాటికన్ మైళ్ల దూరంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. స్పీడ్ బోట్ సామర్థ్యానికి మించి ప్రయాణించడం ద్వారా ప్రమాదానికి గురైంది. బలమైన ఈదురుగాలులు తోడు కావడంతో పల్టీ కొట్టింది. ఈ ఘటనలో పలువురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే భద్రత బలగాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. 25 మందిని కాపాడగలిగాయి. అదే సమయంలో 17 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి.

దుర్ఘటన సమయంలో స్పీడ్‌బోట్‌లో 60 మంది వరకు అక్రమ వలసదారులు ఉన్న నేపథ్యంలో- మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదని.. సహాయక చర్యలకు నాయకత్వాన్ని వహిస్తోన్న బహమాస్ పోలీస్ కమిషనర్ క్లేటర్ లెరాయ్ ఫెర్నాండర్ తెలిపారు. ఈ ఘటన వెనుక మానవ అక్రమ రవాణా గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించినట్లు తెలిపారు. ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా అక్రమంగా అమెరికాకు తరలించడానికి ఈ గ్యాంగ్స్ ప్రయత్నించినట్లు చెప్పారు. ఇప్పటివరకు ఇద్దరిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు.
ఓ స్పీడ్ బోట్ ద్వారా హైతీయన్లు శరణార్థులుగా మియామికి చేరుకోవడానికి ప్రయత్నించినట్లు బహమాస్ ప్రధానమంత్రి ఫిలిప్ డేవిస్ వెల్లడించారు. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామని చెప్పారు. హైతీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదని అన్నారు. పేదరికం, నేరాలతో సహజీవనం చేస్తోన్న పరిస్థితుల్లో వాళ్లంతా హైతీని వీడాలని, అక్రమంగా అమెరికా వెళ్లడానికి ప్రయత్నించారని చెప్పారు.












Click it and Unblock the Notifications