కొత్త శిక్షాస్మృతి: ఎముకలు విరగకపోతే నేరం కాదట!
ఆధునిక ప్రపంచం అంతరిక్షంలోకి అడుగులు వేస్తుంటే, అఫ్గానిస్థాన్ మాత్రం మధ్యయుగాల నాటి చీకటి రోజుల్లోకి మళ్లుతోంది. తాలిబన్లు అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తవుతున్న వేళ, మహిళల హక్కులను పూర్తిగా సమాధి చేస్తూ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్‌జాదా ఒక భయంకరమైన 'నూతన శిక్షాస్మృతి’ని ఆవిష్కరించారు. 90 పేజీల ఈ కొత్త చట్టం, మహిళలను మనుషులుగా కాకుండా భర్తల 'ఆస్తి’గా పరిగణిస్తూ, వారిపై జరిగే గృహహింసను చట్టబద్ధం చేయడం అంతర్జాతీయ సమాజంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఈ కొత్త కోడ్ ప్రకారం.. ఒక భర్త తన భార్యను లేదా పిల్లలను శారీరకంగా హింసించడం నేరం కాదు. "ఎముకలు విరగకుండా లేదా శరీరానికి బహిరంగ గాయాలు కాకుండా" ఎంతగా బాదినా అది శిక్షార్హం కాదని తాలిబన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఎముకలు విరిగి, గాయాలు కనిపించినా నిందితుడికి పడే శిక్ష కేవలం 15 రోజుల జైలు మాత్రమే. అయితే, ఆ గాయాలను కోర్టులో న్యాయమూర్తికి చూపించాలంటే కూడా బాధితురాలికి అగ్నిపరీక్షే. ముఖం కూడా కనిపించకుండా బురఖా ధరించాలి మరియు వెంట మగ సంరక్షకుడు (మహ్రమ్) ఉంటేనే కోర్టులోకి అనుమతిస్తారు. దాడి చేసింది భర్తే అయినప్పుడు, అతడిని కాదని మరో పురుషుడి తోడు తెచ్చుకోవడం అక్కడ దాదాపు అసాధ్యం.

Afghanistan: న్యాయం అడిగితే జైలుకే..
తాలిబన్ల న్యాయవ్యవస్థలో బాధితులకు రక్షణ కాదు సరే, ఆశ్రయం కోరినా శిక్షలే మిగులుతాయి. భర్త వేధింపులు భరించలేక హింస నుంచి బయటపడాలని చూసినా, లేదా భర్త అనుమతి లేకుండా కనీసం పుట్టింటికి వెళ్లినా సదరు మహిళకు మూడు నెలల జైలు శిక్ష విధిస్తారు. 'ది ఇండిపెండెంట్' నివేదిక ప్రకారం.. ఒక మహిళ జైలులో ఉన్న తన భర్తను సందర్శించినప్పుడు గార్డు దాడికి గురైంది. ఆమె ఫిర్యాదు చేయడానికి వెళ్తే, "దాడి చేసిన భర్తనే మహ్రమ్‌గా (తోడుగా) తీసుకురావాలి" అని అధికారులు వేళాకోళం చేశారు. "మరణమే మాకు మేలు" అని ఆ మహిళ కన్నీరు మున్నీరైన ఉదంతం అక్కడ మహిళల పరిస్థితికి అద్దం పడుతోంది.
మహిళా హక్కుల సమాధి
2009లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన 'మహిళలపై హింస నిర్మూలన (EVAW)' చట్టాన్ని తాలిబన్లు రద్దు చేశారు. గతంలో అత్యాచారం, బలవంతపు వివాహం, లింగ వివక్షను నేరాలుగా పరిగణించే రక్షణలన్నీ ఇప్పుడు పటాపంచలయ్యాయి. ఆరో తరగతి దాటిన బాలికలకు చదువు లేదు, మహిళలకు ఉద్యోగాలు లేవు. పార్కులు, జిమ్‌లు, బ్యూటీ పార్లర్‌లు అన్నీ మూతపడ్డాయి. కనీసం వైద్యం చేయించుకోవాలన్నా మగ డాక్టర్ దగ్గరకు వెళ్లకూడదనే నిబంధనలు వారి ప్రాణాలకే ముప్పుగా మారాయి.
లింగ వివక్షకు పరాకాష్ఠ
మానవ హక్కుల సంఘాలు ఈ చట్టాన్ని 'లింగ వర్ణవివక్ష’ (Gender Apartheid)గా అభివర్ణిస్తున్నాయి. నేరస్థులు వారి సామాజిక వర్గాన్ని బట్టి శిక్షలు పొందడం వల్ల న్యాయవ్యవస్థలో అసమానతలు పెచ్చరిల్లాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల చిన్నారి బాలికలకు బాల్య వివాహాలు చేయడం ఇప్పుడు అక్కడ నిత్యకృత్యమైపోయింది. ప్రపంచంలోనే మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా అఫ్గానిస్థాన్‌ను మార్చిన ఈ నూతన శిక్షాస్మృతిని తక్షణమే నిలిపివేయాలని ఐక్యరాజ్యసమితి మరియు అంతర్జాతీయ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications