మారని డ్రాగన్: సైనికులు చనిపోయారని ప్రకటించిందో లేదో.. అక్కసు వెళ్లగక్కుతూ వీడియో
డ్రాగన్ చైనా తీరు మారడం లేదు. గతేడాది నుంచి మరింత దిగజారింది. గల్వాన్ వ్యాలీ ఘర్షణ జరిగి దగ్గర దగ్గర ఏడాది అవుతోన్న సందర్భంలో స్పందించింది. తమ సైన్యం/ అధికారులు ఐదుగురు చనిపోయారని తెలిపింది. చైనా అధికార మీడియో తెలియజేసింది. అయితే వెంటనే అక్కసు వెళ్లగక్కుతూ వీడియో విడుదల చేసింది. భారత జవాన్లు తమ భూభాగంలోకి వచ్చారనే అందులోని సారాంశం.

భారత్- చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంబనకు దారి తీసిన గల్వాన్ ఘటనలో మృతి చెందిన సైనికుల వివరాలపై డ్రాగన్ దేశం తొలిసారి నోరు విప్పింది. తూర్పు లడాఖ్ ఘర్షణలో ఐదుగురు మిలిటరీ ఆఫీసర్లు, సైనికులు చనిపోయారని తెలిపింది. మృతుల పేర్లను కూడా చైనా విడుదల చేసిందని ఆ దేశ మీడియా వెల్లడించింది. షిన్‌జియాంగ్ మిలిటరీ కమాండర్ కీ ఫబావో, చెన్ హోంగ్జన్, చెన్ షియాన్‌గ్రాంగ్, షియాలో సియువాన్, వాంగ్ జురాన్ మృతిచెందారని పేర్కొంది. వీరికి గౌరవ హోదాలు కల్పించినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి సెంట్రల్ మిలిటరీ కమిషన్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసిందని స్థానిక మీడియా వెల్లడించింది. భారత్‌తో జరిగిన ఘర్షణలో ఆర్మీని ముందుండి నడిపించిన కల్నల్‌కు సముచిత గౌరవం కల్పించినట్లు పేర్కొంది.
గతేడాది జూన్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత జవాన్లు- డ్రాగన్ ఆర్మీకి మధ్య జరిగిన ఘర్షణ కారణంగా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. డ్రాగన్ ఆర్మీ దురాగతానికి కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనా మాత్రం ఈ ఘటనలో తమ జవాన్లు మరణించినట్లు గతంలో ధ్రువీకరించలేదు. ఇక శుక్రవారం తొలిసారిగా అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా మృతి చెందారని అంగీకరించింది.
జూన్ 15వ తేదీన జరిగిన ఘర్షణలో 16 మంది చైనా సైనికులు చనిపోయారని విశ్వసనీయ సమాచారం. రష్యా అయితే 45 మంది చనిపోయారని పేర్కొన్నది. అయితే ఐదుగురే అంటూ మీడియాకు తెలియజేసింది. ఆ వెంటనే జూన్ 14వ తేదీ అర్ధరాత్రి ఏం జరిగిందనే అంశం గురించి వీడియో విడుదల చేసింది. అందులో భారత బలగలు తమ భూభాగంలోకి చొచ్చుకు వస్తున్నారని తెలియజేసింది.