పాక్ దుస్సాహసం: నిన్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్... నేడు థార్ ఎక్స్‌ప్రెస్ రద్దు
కరాచీ: ప్రపంచదేశాలు పాకిస్తాన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఈ దేశ నీతి మాత్రం మారడం లేదు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించి రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేస్తూ భారత సర్కార్ తీసుకున్న నిర్ణయంను వ్యతిరేకిస్తూ ఇప్పటికే పలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది పాకిస్తాన్. గురువారం లాహోర్ నుంచి ఢిల్లీకి వెళ్లే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసిన పాకిస్తాన్ తాజాగా థార్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా రద్దు చేస్తూ డెసిషన్ తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
" థార్ ఎక్స్‌ప్రెస్‌ను సర్వీసును రద్దు చేస్తున్నాం" అని పాకిస్తాన్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. ఈ రైలు సర్వీసు పాకిస్తాన్‌లోని ఖోక్రాపర్ నుంచి భారత్‌లోని మునాబా స్టేషన్ల మధ్య నడుస్తుంది. పాకిస్తాన్ రైల్వేశాఖ మంత్రిగా తాను ఉన్నంత కాలం భారత్ పాకిస్తాన్‌ల మధ్య ఎలాంటి రైలు సర్వీసులు నడువవని రషీద్ వెల్లడించారు. 1976 నుంచి వారానికి రెండు సార్లు ఢిల్లీ నుంచి లాహోర్‌కు నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను గురువారం నిలిపివేసి... భారత్ నుంచి డ్రైవర్ మరియు గార్డులు వచ్చి రైలును ఇండియాకు తీసుకెళ్లాల్సిందిగా ఆదేశించారు రషీద్.

ఇక పాకిస్తాన్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల్లో భాగంగా ... పాక్ జైలులో బంధీగా ఉన్న మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌కు కాన్సులర్ యాక్సెస్‌కు ఎత్తివేయాలనే ఆలోచనలో కూడా పాకిస్తాన్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పాక్ ప్రభుత్వం వారి దేశంలో భారతీయ సినిమాలపై నిషేధం విధించింది. పాకిస్తాన్ యుద్ధం కోరుకోవడం లేదని అయితే భారత్ రెచ్చగొడితే మాత్రం యుద్ధాన్ని అమలు చేస్తామని మీడియా సమావేశంలో తెలిపారు. పాక్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై పునఃసమీక్షించాలని భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి చెప్పారు. ఇక జమ్మూ కశ్మీర్‌లో మార్పులు చేయడం అది పూర్తిగా భారతదేశ అంతర్గత వ్యవహారమని దీనిపై పాక్ జోక్యం ఏమిటని ప్రశ్నించింది. ఇప్పటి కైనా పాకిస్తాన్ వాస్తవాలను తెలుసుకుని భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానేయాలని భారత్ హితవు పలికింది.












Click it and Unblock the Notifications