Mount Annapurna: అడ్వెంచర్ మూవీని తలపించే రెస్క్యూ
ఖాట్మండు: మౌంట్ అన్నపూర్ణ. నేపాల్‌లో ఉంటుందీ పర్వతం. పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. ప్రపంచంలోని అతి ఎత్తయిన పర్వత శిఖరాల్లో ఇదీ ఒకటి. అతి ఎత్తయిన 10వ పర్వతంగా దీనికి గుర్తింపు ఉంది. సముద్ర మట్టానికి 8,091 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీన్ని అధిరోహించడం అంత సులువు కాదు. ఎప్పటికప్పుడు వాతావరణం మారిపోతుంటుంది.
అలాంటి దుర్భేధ్య పర్వతాన్ని అధిరోహించడానికి వెళ్లిన భారతీయ పర్వతారోహకుడొకరు మంచుదిబ్బల్లో చిక్కుకుపోయారు. 48 గంటల పాటు అందులోనే గడిపారు. ఆక్సిజన్ అందని సంక్లిష్ట వాతావరణ పరిస్థితుల నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన పేరు అనురాగ్ మాలూ. వయస్సు 34 సంవత్సరాలు. రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్ ఆయన స్వస్థలం.

మొత్తం ఏడుమందితో కూడిన టీమ్‌లో అనురాగ్ ఓ మెంబర్. ఈ నెల 17వ తేదీన మౌంట్ అన్నపూర్ణను అధిరోహించిన ఆయన కిందికి తిరిగి వస్తూ క్యాంప్ 3 నుంచి దిగుతుండగా కనిపించకుండా పోయారు. ఆ టీమ్‌లో బల్జీత్ కౌర్, అనురాగ్ మాలూ గల్లంతయ్యారు. 48 గంటల తరువాత అనురాగ్‌ను మంచుకొండల మధ్య ఉండే అగాథం నుంచి ప్రాణాలతో వెలికితీశారు రెస్క్యూ సిబ్బంది.
తెల్లటి మంచు తప్ప మరేమీ కనిపించని వాతావరణంలో, ఆయన వద్ద ఎక్స్‌ట్రాగా ఎలాంటి ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు లేవు. మంచుతో కప్పివున్న అగథంలో చలిని తట్టుకుని ఆయన 48 గంటల పాటు అక్కడే గడిపారు. ఆయనతో పాటు కనిపించకుండా పోయిన బల్జీత్ కౌర్‌ను మొదట్లో అందరూ చనిపోయారనే భావించారు. రేడియో యాక్టివ్ సిగ్నల్స్ ద్వారా ఆమె ఎక్కడ ఉన్నది గుర్తించారు.
సురక్షితంగా వెలికి తీశారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనురాగ్‌ను మాత్రం బయటికి తీయడానికి రెండు రోజులు పట్టింది. ఏప్రిల్ 17వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు అనురాగ్ అగాథంలో పడిపోగా.. 20వ తేదీన ఆయనను ప్రాణాలతో రక్షించగలిగారు. ఆయనను రక్షించిన విధానం ఓ అడ్వెంచర్ సినిమాను తలపించింది.

అనురాగ్ అగాథంలో పడిపోయాడంటూ ఆయన వెంట ఉన్న షెర్పా రేడియో సంకేతాలను పంపించారు. ఖాట్మండులో రెస్క్యూ ఆఫీస్ ఏఎస్‌సీ 360 సహాయంతో అప్పటికప్పుడు ఆయనను రక్షించడానికి సమగ్ర ప్రణాళికను వేశారు. మొదట ఆయన బరువు, ఎత్తును చెక్ చేశారు. దానికి అనుగుణంగా మంచును తొలవడానికి ఉపయోగించే స్కిస్, తాడు, కొన్ని మెడిసిన్స్, ఇతర పరికాలను తీసుకుని రెస్క్యూ సిబ్బంది ఏప్రిల్ 17వ తేదీ నాడే హెలికాప్టర్‌లో మౌంట్ అన్నపూర్ణకు చేరుకుంది.
తొలి రోజు వాతావరణం అనుకూలించలేదు. ఫలితంగా- 15 గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. అంత క్లిష్టమైన వాతావరణంలో ప్రాణాలకు తెగించి అనురాగ్‌ను రక్షించడానికి ముగ్గురు షెర్పాలు ముందుకొచ్చారు. ఏప్రిల్ 18వ తేదీన అనురాగ్ సోదరులు ఆశిష్ మాలూ, సుధీర్ మాలూ రాజస్థాన్ నుంచి నేపాల్‌కు చేరుకున్నారు. వారు కూడా రెస్క్యూ మిషన్‌లో పాల్గొన్నారు.
అనురాగ్ ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని సరైన సమయంలో లొకేట్ చేయలేకపోయారు. మూడో ప్రయత్నంలో అతను ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. అనురాగ్ కూరుకుపోయిన ప్రదేశం గుహలాంటిదని నిర్ధారించారు. ఏప్రిల్ 19వ తేదీన థర్మల్ కెమెరాలు, కార్బన్ డయాక్సైడ్ డిటెక్టర్లు, మెటల్ డిటెక్టర్లు, డ్రోన్ల సహాయంతో నేపాల్ సాయుధ దళాలు సహకారాన్ని తీసుకున్నారు. త్రిభువన్ విశ్వవిద్యాలయం కార్బన్ డయాక్సైడ్ డిటెక్టర్‌లను సేకరించారు.
ఏడుమంది సభ్యుల టీమ్ ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 7 గంటలకు అనురాగ్ చిక్కుకుపోయిన పగుళ్లలోకి ప్రవేశించారు. అనురాగ్‌ను గుర్తించారు. పూర్తిగా మంచుతో కప్పబడి పోవడంతో ఆయన చనిపోయాడనే భావించారు. తాడును శరీరానికి కట్టి బయటికి తీసుకొచ్చేంత వరకూ ఆయన జీవించి ఉన్నారనే విషయం వారికి తెలియదు. అతన్ని వెలికి తీయడానికి నాలుగు గంటల సమయం పట్టింది.
అనురాగ్ బతికే ఉన్నాడనే విషయం నిర్ధారణ కావడంతో రెస్క్యూ సిబ్బంది వెంటనే అతణ్ని హెలికాప్టర్ ద్వారా పొఖారాకు తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు అనురాగ్. ఆక్సిజన్ అందని వాతావరణంలో, 6,000 మీటర్ల ఎత్తులో ఉన్న లోతైన పగుళ్ల మధ్య మంచు కింద ఉన్న స్థితి నుంచి ఆయన ప్రాణాలతో బయటపడతాడని ఊహించలేదని ఆశిష్ మాలూ చెప్పారు.












Click it and Unblock the Notifications