కారు బాంబు పేలుడు: ఆరుగురు దుర్మరణం
బాగ్దాద్: ఉగ్రవాద కార్యకలాపాలు అడ్డుకుంటున్నారని ఇరాక్ లోని ఒక స్వచ్చంద సంస్థ నిర్వహకులను టార్గెట్ చేసుకుని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కారు బాంబు పేలుళ్లు సృష్టించారు. ఈ దాడిలో ఆరుగురు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
అనేక మంది పౌరులకు తీవ్రగాయాలైనాయి. ఉత్తర బాగ్ధాద్ నగరానికి 35 కిలోమీటర్ల దూరంలోని ఖలిస్ పట్టణంలో కారు బాంబు పేలుడు జరిగింది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా హషద్ అల్ షాహిబ్ అనే సంస్థ పని చేస్తున్నది.
ఐఎస్ఐఎస్ కార్యాకలాపాలను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తు ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం జీర్ణించుకోలేని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఆ సంస్థను టార్గెట్ చేసుకున్నారు. ఎలాగైనా సంస్థ నిర్వహకులను అంతం చెయ్యాలని నిర్ణయించారు.

ఆ సంస్థ నిర్వహకులను అంతం చెయ్యడానికి ప్రముఖ వైద్యుడి ఇంటి ముందు కారు బాంబు పేలుడు సృష్టించారు. ఈ పేలుడులో ఆరుగురు మరణించారని, 12 మందికి తీవ్రగాయాలైనాయని పోలీసు అధికారులు తెలిపారు.
కారు బాంబు పేలుడు జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉగ్రవాదులు ఒక లేఖ విడిచిపెట్టి వెళ్లారని ఖలిస్ పోలీసులు చెప్పారు.ఆ లేఖలో తమకు వ్యతిరేకంగా పని చేసే వారికి ఇదే గతి పడుతుందని, ఐఎస్ఐఎస్ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వాలని వ్రాసి ఉందని పోలీసులు అన్నారు. ఖలీస్ పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications