ఏం చేస్తున్నారు?: అమెరికాను హెచ్చరించిన చైనా
బీజింగ్: దక్షిణ చైనా సముద్రంలో అమెరికా క్షిపణి విధ్వంసక యుద్ధనౌకను మోహరించడాన్ని రెచ్చగొట్టే చర్యగా పరిగణిస్తున్నామని చైనా వ్యాఖ్యానించింది. దక్షిణ చైనా సముద్రంలో తాము నిర్మించిన కృత్రిమ దీవి ట్రిటన్‌కి సమీపంలో యుద్ధనౌకను మోహరించడాన్ని రాజకీయంగా.. సైనికంగా రెచ్చగొట్టే చర్యగా పరిగణిస్తున్నామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లుకాంగ్ స్పష్టం చేశారు.
ఈ ప్రాంతంలోకి విదేశీ యుద్ధనౌకలు ప్రవేశించడాన్ని చైనా చట్టాలు అంగీకరించబోవని స్పష్టంచేశారు. దక్షిణ చైనా సముద్రంపై పూర్తి అధికారం తమదేనని చైనా ప్రకటించుకుంటోంది.
ట్రంప్‌కు జింపింగ్ ఫోన్
చైనా-అమెరికా మధ్య సంబంధాలు కొన్ని ప్రతికూల అంశాలు కారణంగా దెబ్బతింటున్నాయని చైనా అధ్యక్షుడు షీ జింపింగ్ పేర్కొన్నారు. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో చైనా నిర్మించిన కృత్రిమ దీవికి చేరువగా అమెరికా యుద్ధనౌక ప్రయాణించిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సోమవారం ఆయన ఫోన్లో మాట్లాడారు. ఇటీవలి కాలంలో అమెరికా చర్యలతో చైనాకు ఆగ్రహం కలిగి, రెండు దేశాల సంబంధాల్లో ఇబ్బంది తలెత్తిన నేపథ్యంలో వీరి ఫోన్ సంభాషణ ప్రాధాన్యం సంతరించుకొంది.

ఫ్లోరిడాలో ఏప్రిల్‌లో ట్రంప్‌తో తాను భేటీ అయ్యాక ద్వైపాక్షిక సంబంధాల్లో ముఖ్యమైన ఫలితాలు లభించాయనీ, ఈ మధ్య కాలంలో మాత్రం మారాయనీ జింపింగ్ చెప్పినట్లు చైనా ప్రసార మాధ్యమాలు వెల్లడించాయి. 'వన్ చైనా' విధానానికి కట్టుబడి ఉన్నట్లు అమెరికా గట్టిగా చెప్పడానికి ఎంతో ప్రాధాన్యం ఉందని జింపింగ్ చెప్పారు. తైవాన్ అంశాన్నీ అమెరికా తగిన విధంగా చూస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉత్తర కొరియా క్షిపణి కార్యక్రమాల ప్రభావంపైనా నేతలిరువురూ చర్చించుకున్నారని వైట్ హౌస్ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. వాణిజ్య సంబంధ విషయాలనూ చర్చించారని వివరించింది. జర్మనీలోని హాంబర్గ్‌లో జరిగే జి-20 దేశాల సమావేశంలో కలిసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు ఇద్దరు నేతలూ ఉద్ఘాటించారని తెలిపింది.












Click it and Unblock the Notifications