వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావైరస్: భారత్‌లో కోవిడ్-19 స్థానిక వ్యాధిగా మారిందా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
భారతదేశ వ్యాప్తంగా రోజువారీ కేసుల సంఖ్య 32 వేలకు పడిపోయింది.

భారత్‌లో కరోనా వైరస్ స్థానిక వ్యాధిగా మారిపోయి ఉండొచ్చని ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)లోని అత్యున్నత శాస్త్రవేత్త ఒకరు వ్యాఖ్యానించారు. కరోనా, స్థానిక వ్యాధిగా మారిపోవడం అంటే ఏంటో బీబీసీకి చెందిన జోయా మాటీన్‌ కు వివరించారు.

భారత్‌లో కరోనా స్థానిక వ్యాధిగా మారుతున్నట్లుగా అనిపిస్తుందని డబ్ల్యూహెచ్‌వో శాస్త్రవేత్త, డాక్టర్ సౌమ్య స్వామినాథన్ మంగళవారం అన్నారు.

ఒక భౌగోళిక ప్రాంతానికే పరిమితమవుతూ, దాని ప్రభావాన్నిఅదుపు చేయగలిగే స్థితిలో ఉండే వ్యాధిని స్థానిక వ్యాధిగా పేర్కొంటారు.

దేశంలో వైరస్ కేసుల సంఖ్య తగ్గిపోయి, ఆంక్షలు సడలించిన సమమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్‌లో గరిష్టంగా 4 లక్షలుగా నమోదైన రోజూవారీ కేసులు ఈ వారంలో 25 వేలకు పడిపోయాయి.

అయినప్పటికీ థర్డ్ వేవ్ వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమని నిపుణులు సూచిస్తున్నారు. భారత్‌లో అధిక జనాభాతో పాటు వైరస్‌లో కొత్త ఉత్పరివర్తనాల ముప్పు పరంగా చూసుకుంటే దేశంలో కరోనా నిజంగా స్థానిక వ్యాధిగా మారుతుందా అనేది చిక్కు ప్రశ్నగానే అనిపిస్తోంది.

భారత్‌ లో కరోనా స్థానిక దశకు చేరుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ అన్నారు.

థర్డ్‌వేవ్ వస్తుందా?

ఈ ప్రశ్నకు సమాధానం, కరోనా స్థానిక వ్యాధిగా మారిందని భారత్ ఎంత త్వరగా అధికారిక ప్రకటన చేస్తుందనే దానిపై ఆధారపడి ఉంది.

ఇతర దేశాల్లాగే భారత్‌లో కూడా వైరస్ వ్యాప్తిలో తగ్గుదల కనబడుతోందని వైర్ న్యూస్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వామినాథన్ అన్నారు. కొన్ని నెలల క్రితం వైరస్ వ్యాప్తి ఉధృతి గరిష్ట స్థాయిలో ఉండటం మనం చూశాం.

వ్యాక్సినేషన్ ద్వారా లేదా వైరస్ సోకడంతో ఏర్పడిన యాంటీబాడీల కారణంగా జనాభాలోని అధిక భాగం బలమైన రోగ నిరోధక శక్తిని పొందితే అప్పుడు ఆ వ్యాధిని స్థానిక దశకు చేరుకుందని చెప్పవచ్చు.

ఈ దశలో వ్యాధి సంక్రమణ వేగం తగ్గిపోతుందని వైరస్ నిపుణులు డాక్టర్ లలిత్‌కాంత్ వివరించారు.

''వ్యాధి స్థానిక దశకు చేరుకుందంటే అది ఇక ఇతరులకు సోకదు అని అనుకోకూడదు. కేవలం దాని వ్యాప్తి విస్తృత స్థాయిలో ఉండదంతే’’ అని ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్ షాహిద్ జమీల్ అన్నారు.

స్థానిక వ్యాధిగా మారినప్పటికీ ప్రాంతాల వారీగా భారత్‌లో వైరస్ ప్రభావం ఉంటుందని స్వామినాథన్ సూచించారు. కానీ సెకండ్ వేవ్ తరహాలో మెడికల్ ఆక్సీజన్ అవసరం ఉండేలా, ఆసుపత్రులు రద్దీగా మారేంతగా వైరస్ ప్రభావం ఉండబోదని ఆమె అన్నారు.

భారత్‌లోని జనాభా రీత్యా... మొదటి లేదా రెండో వేవ్‌లలో వైరస్ బారిన పడకుండా తప్పించుకున్నవారిలో, వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజల్లో వైరస్ విజృంభించవచ్చని ఆమె చెప్పారు.

థర్డ్‌వేవ్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా వస్తుందో కచ్చితంగా చెప్పేందుకు, ఊహించేందుకు సరైన ప్రమాణాలు లేవు. దాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధమై ఉండాలని ఆమె హెచ్చరించారు.

ఏప్రిల్ మే నెలల్లో భారత్ లో కరోనా వైరస్ విజృంభించింది.

ప్రభుత్వాల వైఖరేంటి?

ప్రజల్ని జాగ్రత్తగా ఉండాలంటూ ప్రభుత్వాలు కోరుతున్నాయి. గతేడాది మార్చి నుంచి భారత్‌లో 3.2 కోట్ల మంది కరోనా బారినపడ్డారు. అమెరికా తర్వాత భారత్‌ ది రెండో స్థానం. అధికారిక గణాంకాల ప్రకారం 4,35,000 మంది చనిపోయారు. కానీ నిపుణుల అంచనా ప్రకారం ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది.

భారత్‌లో వైరస్ నమోదు కేసులు తగ్గాయనడంలో సందేహం లేదు. కానీ, థర్డ్‌వేవ్ ముప్పు ఇంకా పొంచి ఉందని, అధికారులతో పాటు ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు.

తదుపరి వచ్చే వేవ్...అక్టోబర్ తరహాలో బీభత్సాన్ని సృష్టించగలదని ఒక ప్రభుత్వ బృందం ఇటీవలే వ్యాఖ్యానించింది.

సెకండ్ వేవ్‌ రాకను గుర్తించడంలో విఫలమైనందున ప్రభుత్వం తీవ్ర విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే థర్డ్‌వేవ్ గురించి పదేపదే హెచ్చరిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

వైరస్‌పై పోరాటంలో దేశం గెలిచిందని భారత ప్రభుత్వం మార్చిలో ప్రకటించింది. ఆ తర్వాత కేవలం రెండు వారాల్లోనే విరుచుకుపడిన సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేసింది.

Coronavirus

వైరస్‌ను నిర్మూలించవచ్చా?

కోవిడ్-19 భవిష్యత్ గమనాన్ని కచ్చితంగా అంచనా వేయలేం. కానీ త్వరలోనే వైరస్ అంతం అవుతుందని నమ్మడానికి కొన్ని కారణాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రజల్లో వైరస్ వ్యాప్తిని ఒక స్థాయి వరకు నియంత్రించడం ద్వారా దాన్ని సాధించవచ్చు. అత్యంత తక్కువ స్థాయిలో, మనం ఊహించగలిగే రేటులో వైరస్ వ్యాప్తిని నియంత్రించాలి.

ఇలా అయితే ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తగ్గడంతో పాటు, తీవ్రమైన కేసులు అరుదుగా నమోదు అవుతాయని నిపుణులు అంటున్నారు.

''వ్యాధి ఉత్పరివర్తనం చెందుతూ ఉంటుంది. ప్రజలు వైరస్ బారిన పడతారు. కానీ ప్రజారోగ్యంపై ఆందోళన చెందే స్థాయిలో ఈ కేసులు నమోదు కావు’’ అని వైరాలజిస్టు జాకబ్ జాన్ చెప్పారు.

వ్యాధి స్థానిక దశకు చేరుకోవడం అంటే కరోనా వైరస్ కూడా సాధారణ ఫ్లూ లేదా మలేరియా వైరస్‌లా మారిపోవడం అని ఆయన అన్నారు.

''కొంత కాలం తర్వాత ఇది ఒక్కసారిగా విజృంభిస్తుంటుంది. కానీ, ప్రజల జీవితాలను మార్చేంతగా దీని ప్రభావం ఉండబోదు’’ అన్నారాయన.

సౌమ్య స్వామినాథన్ కూడా ఇదే మాట చెబుతున్నారు. ''వైరస్‌ను తరిమి కొట్టడం లేదా నిర్మూలించడం కచ్చితంగా సాధ్యమని చెప్పలేం. కానీ ఇది స్థానిక వ్యాధిగా మారిపోతే, దానితో కలిసి ఎలా జీవించాలో మనం నేర్చుకోవచ్చు’’ అన్నారామె.

Coronavirus

భారత్, స్థానిక దశకు ఎంత దగ్గరగా ఉంది?

దీని గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని నిపుణులు అంటున్నారు. అన్ని వైరస్‌లలాగే, కరోనా వైరస్ కూడా స్థానిక వ్యాధిగా కచ్చితంగా మారుతుందని జమీల్ అన్నారు.

''ఎక్కువ మంది ప్రజలు వైరస్ బారిన పడినా లేదా టీకా తీసుకున్నా మనం వ్యాధి వ్యాప్తి తగ్గిపోవడాన్ని గమనించవచ్చు’’ అన్నారాయన.

''యూకేలో ఇలాగే జరిగింది. అక్కడ 60 శాతానికి పైగా జనాభా పూర్తి డోసుల టీకా తీసుకున్నారు. ఇప్పుడు అక్కడ ఓవరాల్‌గా నమోదవుతోన్న వైరస్ కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ... వైరస్ కారణంగా ప్రమాదకర స్థితిలో ఉన్నవారి సంఖ్య, మరణాల నమోదు చాలా తక్కువగా ఉంది’’ అని జమీల్ వివరించారు.

కానీ భారత్ లాంటి అధిక జనాభా ఉన్న దేశంలో టీకాకు అర్హులైనవారిలో 15 శాతం కన్నా తక్కువ మందే పూర్తి డోసుల టీకా తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరో రెండేళ్లకైనా స్థానిక దశకు చేరడం సాధ్యమవుతుందని చెప్పలేమని నిపుణులు అంటున్నారు.

ప్రజలు వైరస్ బారిన పడుతున్నంత కాలం, కొత్త వేవ్‌లు పుట్టుకొస్తున్నంతవరకు మనం స్థానిక దశకు చేరుకోలేమని లలిత్ కాంత్ అన్నారు.

కొత్త వేరియంట్లతో భారత్ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేళ డెల్టా కంటే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్ పుట్టుకొస్తే, అది ఇప్పటికే వైరస్ బారిన పడిన వారిని, టీకా తీసుకున్న వారిని కూడా ప్రభావితం చేయగలదని జమీల్ వివరించారు.

దీన్ని మిగతా నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు.

''కొత్త వేరియంట్లు రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకు తిరుగుతాయి. ఇలా జరిగినంత కాలం మనం వైరస్ స్థానిక దశకు చేరుకుందని చెప్పడం కుదరనే కుదరదు’’ అని కాంత్ వ్యాఖ్యానించారు.

ఇప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రజలు వైరస్ గుప్పిట్లో ఉన్న భారత్‌కు ఇది ఆందోళక కలిగించే అంశం. ఈ పరిస్థితుల్లో భారత్‌ను స్థానిక వ్యాధి దశకు చేరుకున్న దేశంగా పరిగణించడం సరైనది కాదని జాన్ అన్నారు.

''సౌమ్య స్వామినాథన్ చెప్పినట్లుగా మనం వైరస్‌తో కలిసి జీవించడం నేర్చుకోవాలి. అంతేకాని కేసులు తగ్గుతున్నాయని సంతృప్తి చెందకూడదు’' అని ఆయన అన్నారు.

''స్థానిక వ్యాధి కూడా మన ప్రవర్తన కారణంగా లేదా వైరస్‌లో మార్పు వల్ల మహమ్మారిగా మారవచ్చు. కాబట్టి మనం మరోసారి ఎట్టిపరిస్థితుల్లోనూ 2019నాటి పరిస్థితులకు వెళ్లకుండా జాగ్రత్తపడాలి.''

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Coronavirus: Has Covid-19 become a endemic disease in India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X