చావు బతుకుల్లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం
Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం. అండర్ వరల్డ్ మాఫియా డాన్. యావత్ దేశాన్ని భయాందోళనలకు గురి చేసిన 1993 నాటి ముంబై బాంబు పేలుళ్ల ఘటనకు ప్రధాన సూత్రధారి. పేలుళ్లకు పాల్పడిన అనంతరం అతను పాకిస్తాన్‌కు పారిపోయాడు. అక్కడే తలదాచుకుంటున్నాడు. భారత్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో అతని పేరుంది.
దావూద్ ఇబ్రహీం ఇప్పుడు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి విషమించింది. కరాచీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రెండు రోజుల కిందటే అతను ఆసుపత్రిలో అడ్మిట్ అయినప్పటికీ.. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు అక్కడి అధికారులు. ముంబై పోలీసులకు ఈ సమాచారం అందడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరగడమే దీనికి కారణం. ఈ విషయాన్ని పాకిస్తాన్ అధికారులెవరూ ఇప్పటివరకు ధృవీకరించలేదు. తీవ్రంగా అనారోగ్యానికి గురైన దావూద్ ఇబ్రహీంను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని తెలుస్తోంది.
మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉండటం, విష ప్రయోగం జరిగినట్లు అనుమానిస్తోండటం వల్ల అతను చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం. దావూద్ ఉన్న ఆసుపత్రి ఫస్ట్ ఫ్లోర్ మొత్తాన్నీ ఖాళీ చేయించారు అధికారులు. అక్కడ చికిత్స పొందుతున్న పేషెంట్లను వేరే బ్లాక్‌కు తరలించారు. కుటుంబ సభ్యులు, అధికారులు మాత్రమే అక్కడికి వెళ్లే వీలుంది.
కరాచీలోని క్లిఫ్టన్ ఏరియాలో నివసిస్తోన్నాడు దావూద్. పాకిస్తాన్‌కు వెళ్లిన తరువాత మరో పెళ్లి చేసుకున్నాడు. పాకిస్తానీ పఠాన్ మహిళను పెళ్లాడాడు. ఆమె పేరు మైజాబీన్. దావూద్ ఒక కొడుకు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె మారుఖ్.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ కొడుకు జునైద్‌ను పెళ్లి చేసుకున్నారు.












Click it and Unblock the Notifications