వణుకుతున్న టెహ్రాన్.. 48 నిమిషాల్లో సైన్యం ఖతం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై జరుగుతున్న నౌకా దిగ్బంధనాన్ని "అద్భుతం"గా అభివర్ణించారు. ఈ ఆపరేషన్ 100 శాతం లోపరహితంగా సాగుతోందని, ఇది అమెరికా నావికాదళ శక్తికి నిదర్శనమని ఆయన ఉద్ఘాటించారు. "ఇరాన్ సైన్యం ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయింది. వారి నావికాదళం సముద్రం అడుగున ఉంది, వైమానిక దళం మళ్ళీ ఎప్పటికీ ఎగరలేదు" అని ట్రంప్ హెచ్చరించారు. గతంలో వెనిజులా సైన్యం కూడా కేవలం 48 నిమిషాల్లోనే తమ ముందు మోకరిల్లిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇరాన్ అణు ఆశయాలను పూర్తిగా విడనాడితే తప్ప ఎలాంటి ఒప్పందం కుదరదని ట్రంప్ స్పష్టం చేశారు. "ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం పూర్తిగా కుప్పకూలింది. వారు చేయాల్సిందల్లా 'మేము లొంగిపోయాము' అని చెప్పడమే" అని ఆయన డిమాండ్ చేశారు. దౌత్య చర్చల కోసం సుదీర్ఘ ప్రయాణాలు అవసరం లేదని, ప్రస్తుతం చర్చలన్నీ టెలిఫోన్ ద్వారానే సమర్థవంతంగా సాగుతున్నాయని, జవాబు ఏమిటో తమకు స్పష్టంగా తెలుసని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.

దిగ్బంధనంలో 42వ వాణిజ్య నౌక దారి మళ్లింపు..
హార్ముజ్ జలసంధి వద్ద అమెరికా పట్టు ఎంత బిగువుగా ఉందో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వివరించారు. దిగ్బంధనాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నించిన 42వ వాణిజ్య నౌకను విజయవంతంగా దారి మళ్లించడం ద్వారా అమెరికా బలగాలు ఒక మైలురాయిని చేరుకున్నాయని ఆయన వెల్లడించారు. ఇరాన్ ఓడరేవుల్లోకి ఒక్క నౌక కూడా రాకుండా, బయటకు వెళ్లకుండా తమ సైనికులు అద్భుతమైన కృషి చేస్తున్నారని అడ్మిరల్ కూపర్ కొనియాడారు.
కాల్పుల విరమణకు ఇరాన్ ప్రతిపాదన.. వాషింగ్టన్ వైఖరి ఇదే!..
మరోవైపు, దేశం తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి ఒక ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే తాము సైనిక కార్యకలాపాలను నిలిపివేసి, షరతులతో కూడిన కాల్పుల విరమణకు సిద్ధమని ఇరాన్ ప్రతిపాదించినట్లు 'వాల్ స్ట్రీట్ జర్నల్' నివేదించింది. అయితే, ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా పక్కన పెట్టే వరకు మరియు వ్యూహాత్మక జలమార్గాలపై పట్టు సాధించకుండా నిరోధించే వరకు అమెరికా తన వైఖరిని సడలించేలా కనిపించడం లేదు.














Click it and Unblock the Notifications