ఆఫ్గన్ నుంచి అమెరికన్ల తరలింపు.. జో బైడెన్ షాకింగ్ ప్రకటన... అందుకు తాను గ్యారెంటీ ఇవ్వలేనని...
ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లడంతో.. అక్కడే చిక్కుకుపోయిన ఇతర దేశస్తుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భారత్,అమెరికా ఇప్పటికే తమ దేశస్తులను తరలించే చర్యలు చేపట్టినప్పటికీ.. ఇంకా వందలాది మంది సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆఫ్గన్‌లో చిక్కుకుపోయిన అమెరికన్లను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చే విషయమై ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
'మిమ్మల్ని స్వదేశానికి తీసుకొస్తాం.అయితే కాబూల్ విమానాశ్రయం నుంచి అత్యవసర తరలింపులో అంతిమంగా ఏం జరుగుతుందనే దానికి నేను గ్యారెంటీ ఇవ్వలేను. చరిత్రలోనే ఇదొక అతిపెద్ద,అతి సంక్లిష్టమైన తరలింపు ప్రక్రియ.' అని జో బైడెన్ పేర్కొన్నారు. అంతిమ ఫలితంపై తాను హామీ ఇవ్వలేనని స్పష్టం చేశారు. కాబూల్ విమానాశ్రయం వద్ద దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఒక అధ్యక్షుడిగా తన బాధ్యతలను నెరవేర్చడం పైనే ప్రస్తుతం దృష్టి సారించినట్లు తెలిపారు.

ఆగస్టు 14 నుంచి ఇప్పటివరకూ ఆఫ్గనిస్తాన్ నుంచి 13వేల మందిని ప్రైవేట్ విమానాల ద్వారా అమెరికా తరలించినట్లు బైడెన్ తెలిపారు. జులై నుంచి ఇప్పటివరకూ 18వేల మందిని తరలించామన్నారు. ఇందులో అమెరికా పౌరులతో పాటు,స్పెషల్ ఇమ్మిగ్రేషన్ వీసాపై అమెరికాకు వచ్చిన కుటుంబాలు,ఆఫ్గన్ శరణార్థులు ఉన్నారని తెలిపారు.
అంతకుముందు,అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో కలిసి అధ్యక్షుడు జో బైడెన్ నేషనల్ సెక్యూరిటీ టీమ్‌తో భేటీ అయ్యారు. ఆఫ్గనిస్తాన్‌లో నెలకొన్న పరిణామాలు,చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
ఆఫ్గనిస్తాన్‌లో అమెరికా సైన్యం ఉపసంహరణను జో బైడెన్ సమర్థించుకున్న సంగతి తెలిసిందే. తమది కాని యుద్ధంలో అమెరికన్ సైనికులను కోల్పోదలుచుకోలేదని బైడెన్ ప్రకటించారు. 20 ఏళ్ల క్రితం ఏ లక్ష్యాలతో ఆఫ్గన్ నేలపై అడుగుపెట్టామో... ఆ లక్ష్యాలను పూర్తి చేశామని చెప్పారు. ఆఫ్గనిస్తాన్‌లో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడమో లేక ఆ దేశాన్ని పునర్నిర్మించడమో తమ బాధ్యత కాదన్నారు. ఇప్పటికే ఆఫ్గన్‌పై భారీగా ఖర్చు చేశామని... అన్ని విధాలా సహాయ,సహకారాలు అందించామని చెప్పారు.
ఆఫ్గన్ నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకోవడానికి ఇక సరైన సమయం అంటూ ఉండదని తాను గ్రహించానన్నారు. సైన్యాన్ని ఉపసంహరించుకుంటే ఎదురయ్యే రిస్క్ పట్ల తమకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. అయితే పరిస్థితులు ఇంత త్వరగా దిగజారుతాయని భావించలేదన్నారు. ఆఫ్గన్ నాయకులు చేతులెత్తేసి దేశం విడిచి పెట్టి పారిపోవడం వల్ల మిలటరీ పతనమైందన్నారు.
ఆఫ్గనిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు రెండు దశాబ్దాల పాటు అక్కడ పోరు చేసిన అమెరికా,నాటో దళాలు ఇటీవల అక్కడి నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. దీంతో తాలిబన్లు మరింత రెచ్చిపోయారు. అడ్డూ అదుపూ లేకుండా క్రమంగా దేశం మొత్తాన్ని ఆక్రమించేశారు. గతేడాది ఖతర్‌లో తాలిబన్లతో కుదిరిన శాంతి ఒప్పందం మేరకు అమెరికా తమ సైనిక దళాలను ఉపసంహరించుకుంది. అయితే తాలిబన్ల కపట ఒప్పందం గురించి తెలిసి కూడా అమెరికా అక్కడి నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. యుద్ధం పూర్తి చేయకుండానే... ఆ భారం మొత్తం ఆఫ్ఘన్ ప్రజలపై వేసి వెళ్లిపోవడం సరికాదని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications