భారత్ కు Su-57 ఫైటర్ జెట్స్.. రష్యా సంచలనం..!
భారత్, రష్యా మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయి. ఇప్పటికే ఎస్-400 లాంటి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ కు అందించింది. ఇది భూభాగం నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ. ఇది విమానాలు, డ్రోన్ లు, క్రూయిజ్ మిసైల్స్ ను అలాగే బాలిస్టిక్ క్షిపణులను అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. భారత్ గతంలో పాకిస్థాన్ పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. పాకిస్థాన్ నుంచి వచ్చిన డ్రోన్ లు, క్షిపణులను అత్యంత కచ్చితత్వంతో నేలకూల్చింది.
అయితే తాజాగా రష్యాతో మరో బిగ్ డీల్ కుదుర్చుకుంది భారత్. అత్యాధునిక ఎస్ యూ-57 ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాల తయారీకి సంబంధించిన టెక్నాలజీని భారత్ కు బదిలీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. దీంతో భారత్ అమ్ముల పొదిలోకి.. మరో అత్యాధునిక అస్త్రం రానున్నట్లు తెలుస్తోంది. యుద్ధ విమానాల సరఫరాలో భారత్ అవసరాలను తీరుస్తామని రష్యా వెల్లడించింది. ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతున్న దుబాయ్ ఎయిర్ షో 2025 లో రష్యా ఈ ప్రకటన చేసింది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్.. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అయిన తర్వాత ఈ ప్రకటన వెలువడటం చర్చనీయాంశంగా మారింది. తాజా నిర్ణయంతో డిఫెన్స్ రంగంలో రష్యా మరోసారి భారత్ కు చిరకాల మిత్రుడిగా వ్యవహరించింది.

ఎస్‌యూ-57 ఫైటర్ జెట్ల టెక్నాలజీ రష్యా అందిస్తే.. భారత్ లోనే వీటి తయారీ చేసుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటికి సంబంధించిన ఇంజిన్ల నుంచి రాడార్ల దాకా భారత్ లోనే తయారీ చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇక రష్యా నుంచి చమురు కొనుగోలులో భారత్ మరోసారి రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. చమురు కొనుగోలులో మొదటి స్థానంలో చైనా ఉండగా.. రెండో స్థానంలో భారత్ నిలిచింది. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్(CREA) సంస్థ ఇటీవల తెలిపింది. ఒక్క అక్టోబర్ నెలలోనే దాదాపు 2.5 బిలియన్ యూరోల విలువ కలిగిన చమురును రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసినట్లు ఈ సంస్థ ప్రకటించింది.












Click it and Unblock the Notifications