వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్నెపొర: తొలి రాత్రే అనుమానం... మహిళలను మానసికంగా చంపేస్తున్న ‘రక్త పరీక్షలు’

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
జంట

పెళ్లంటే జీవితంలో గుర్తుండిపోయే రోజు. కానీ, కొన్ని దేశాల్లో మహిళలకు మాత్రం పెళ్లి వేడుక జీవితంలోనే అత్యంత విషాదంగా, కాళరాత్రిగా మారుతోంది. దీనికి ఎన్నో కారణాలు.

కొన్ని అరబ్, ముస్లిం దేశాల్లో వివాహం నాటికి మహిళలు కన్యలుగా ఉండాలని భర్తలు కోరుకుంటున్నారు.

వివిధ సామాజిక నేపథ్యాలున్న మహిళలతో 'బీబీసీ అరబిక్' మాట్లాడింది. తొలిరాత్రి వారి వైవాహిక జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించిందో, లైంగిక విద్యపై అవగాహన లేమి వల్ల వైవాహిక జీవితం ఎలాంటి కష్టనష్టాలకు లోనయిందో తెలుసుకుంది.

తొలిరాత్రి అనుభవాలు తమ జీవితాలను ఎలా తలకిందులు చేశాయో ఆ మహిళలు చెప్పుకొచ్చారు.

ఏడుస్తున్న వధువు

సొమయ్య (23 ఏళ్లు)

ఇబ్రహిం అనే యువకుడిని సొమయ్య ఎంతగానో ప్రేమించారు. ఆయననే భర్తగా కోరుకున్నారు. ఆయనను పెళ్లాడేందుకు తల్లిదండ్రులతో పోరాడారు. వారు వద్దన్నా ఇబ్రహింనే పెళ్లాడారు.

కానీ, తొలిరాత్రే ఆమెకు ఇబ్రహిం అంటే అప్పటివరకు ఉన్న ప్రేమకు బదులు ఏహ్యభావం ఏర్పడిపోయింది.

పెళ్లయిన తరువాత తొలి రాత్రి సొమయ్య కన్యా కాదా అని తెలుసుకోవడానికి ఇబ్రహిం ప్రయత్నించడం ఆమెను బాధకు గురిచేసింది.

సిరియాలోని డమాస్కస్ విశ్వవిద్యాలయంలో అరబిక్ సాహిత్యంలో డిగ్రీ పూర్తి చేసే సమయానికి ఆమె ఇబ్రహీంతో ప్రేమలో మునిగిపోయారు. ఆమె చదువు పూర్తి చేయడానికి ఆటంకం కలిగించని ఇబ్రహిం మాటివ్వడంతో పెళ్లి చేసుకున్నారు.

కానీ, తొలి రాత్రే చేదు అనుభవం ఎదురైందని తెలిపారు సొమయ్య.

''ఇబ్రహిం గదిలోకి వచ్చీరాగానే ఆమెకు ఊపిరి తీసుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా ఆక్రమించుకునేందుకే తొందరపడ్డాడు. అంతలోనే ఆయన ముఖం రంగు మారిపోయింది.. ముఖ కవళికలూ మారిపోయాయి'' అంటూ తొలి రాత్రి అనుభవాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.

''రక్తపు మరకలేమీ లేవే'' అంటూ ఇబ్రహిం ఎరుపెక్కిన ముఖంతో తనను ప్రశ్నించాడని ఆమె చెప్పారు.

''తొలిరాత్రి లైంగికంగా కలిసిన తరువాత పరుపుపై రక్తపు మరకలు కనిపించకపోవడంతో ఇబ్రహిం నేను కన్యను కానని అనుమానించాడు'' అన్నారామె.

నిజానికి తొలిసారి లైంగికంగా కలిసినప్పుడు హైమన్ పొర చిరిగి రక్తం రావడమన్నది అందరిలోనూ జరగదన్నది వైద్యులు చెప్పే వాస్తవం. కొందరిలో అలా జరగొచ్చు కానీ, అలా జరగనంత మాత్రాన ఆ యువతి కన్య కాదని అనుమానించడం సరికాదని వైద్యులు చెబుతున్నారు.

సింబాలిక్

కొందరికి జన్మతః హైమన్ పొర ఉండదని.. కొందరిలో సెక్స్‌తో సంబంధం లేకుండా చిన్నతనంలోనే ఆటలాడుతున్నప్పుడో, ఇంకేదైనా సందర్భాల్లానో ఆ పొర చిరగొచ్చు. అలా చిరిగినప్పుడు కూడా రక్తం రావడం అందరిలో జరగకపోవచ్చు.

ఇబ్రహిం తనను అనుమానించినప్పుడు ఆయన చూపులు బాకుల్లా తన గుండెల్లో దిగాయంటూ సొమయ్య బాధపడ్డారు.

'పెళ్లికి ముందు మేం ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్లం. కానీ, తొలిరాత్రి ఆయనకు రక్తం మరక కనిపించకపోగానే నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోయాడు' అన్నారామె.

ఇలాంటి ఘటనలు సొమయ్య ఉన్న సమాజంలో సాధారణమే అయినప్పటికీ తనకూ అలా జరుగుతుందని ఆమె ఊహించలేకపోయారు.

కాలం మారిందని, యువత వాస్తవిక దృక్పథంతో ఆలోచిస్తారని ఆమె ఆశించారు. కానీ, ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇబ్రహిం కూడా తనను అనుమానించేటప్పటికి ఆమె తట్టుకోలేకపోయారు.

రెండో రోజు ఆమెను కన్యత్వ పరీక్ష కోసం డాక్టరు దగ్గరకు తీసుకెళ్లాడు ఇబ్రహిం. అలా చేయడం ఆమెను మరింత బాధించింది.

చదువు, అవగాహన ఉన్న వ్యక్తి అనుకున్న తన భర్త కూడా అలా చేసేసరికి ఆమె ఆవేదన చెందారు.

కొన్ని దేశాల్లోని ఛాందస కుటుంబాల్లో వివాహమైన జంట తొలిరాత్రి గడిపిన తరువాత బెడ్‌షీట్‌పై రక్తపు మరకను అందరికీ చూపించి వధువు కన్య అని రుజువు చూపుతూ సంబరాలు జరుపుకొనే ఆచారమూ ఉంది.

అదేసమయంలో, శస్త్రచికిత్స చేసి హైమన్ పొరను తిరిగి కుట్టడం, చైనాలో తయారయ్యే కృత్రిమ హైమన్ పొరల వినియోగమూ ఉంది. ఇవన్నీ ప్రమాదవశాత్తు హైమన్ పొర చిరిగినా కన్యత్వ పరీక్ష భయంతో చేసే ప్రయత్నాలే.

అలాంటి పరిస్థితుల్లో శృంగారమంటేనే చిరాకు పుడుతుంది .

A woman with a trolley bag

సొమయ్యను ఇబ్రహిం గైనకాలజిస్ట్‌ దగ్గరకు తీసుకెళ్లగా ఆమెకు హైమన్ పొర మందంగా ఉండడం వల్ల సెక్స్ సమయంలో చిరగలేదని తేలింది.

అంతేకాదు, ఆమె సహజ పద్ధతిలో ప్రసవించినప్పుడు మాత్రమే అది చిరుగుతుందని కూడా గైనకాలజిస్ట్ చెప్పారు.

గైనకాలజిస్ట్ నుంచి ఆ మాట విన్నాక సొమయ్య భర్త ఇబ్రహిం ముఖంలో చిరునవ్వు కనిపించింది. కానీ, అప్పటికే ఆలస్యమైపోయింది. ఇబ్రహిం అంటే ఆమెకు ఏహ్యభావం పెరిగిపోయింది. వీలైనంత త్వరగా విడాకులు తీసుకోవాలని ఆమె నిశ్చయించుకుంది.

''నా భర్తే ఇప్పుడు నాకు అపరిచితుడిగా మారిపోయాడు. ఇన్నేళ్ల అనుబంధాన్ని మరిచి కొన్ని సెకండ్లలోనే నాతో అలా ప్రవర్తించిన మనిషి భవిష్యత్తులో ఎలా మారుతాడో ఊహించలేను. నా భద్రతా ప్రశ్నార్థకమైంది. అందుకే విడాకులే మార్గమని నిశ్చయించుకున్నాను' అన్నారామె.

ఆ తరువాత సొమయ్య మానసిక ఆరోగ్యం దెబ్బతింది. ఎవరినీ కలవడం మానేసింది. కానీ, ఆమె ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా తరువాత మూడు నెలల్లో భర్త ఆమెతో కొన్నిసార్లు సెక్స్ చేశాడు.

''అతను నాతో కలిసిన ప్రతిసారి నాలో తీవ్ర వ్యతిరేక భావనలే కలుగుతున్నాయి. ఎలాంటి అనుభూతులూ లేవు. అతనితో లైంగిక సంబంధంలో నిజం కనిపించలేదు.. అదంతా మోసపూరిత, మురికి పనిగా అనిపిస్తోంది'' అంటుంది సొమయ్య.

సైకియాట్రిస్ట్ అమల్

తొలిరాత్రికి ముందే గైనకాలజిస్ట్‌ను కలవాలి

సొమయ్య వంటి అమ్మాయిల సమాజంలో ఎందరో ఉన్నారు. ఇలాంటి విషయాలను చర్చించనంత కాలం భవిష్యత్తు తరాల్లోనూ ఎందరో ఇలాంటి అనుభవాలనే ఎదుర్కోవాల్సి ఉంటుంది.

పెళ్లి తరువాత తొలి రాత్రికి ముందే కొత్త జంట గైనకాలజిస్ట్‌ను కలిస్తే అవగాహన కలుగుతుందని సైకియాట్రిస్ట్ అమల్ హమీద్ 'బీబీసీ'తో చెప్పారు. కానీ, అనేక సమాజాల్లో ఇలాంటి పరిస్థితులు లేవని అమల్ చెప్పుకొచ్చారు.

''కొత్తగా పెళ్లయిన యువతి మానసిక, శారీరక స్థితులు తమకు తెలుసని చాలామంది అనుకుంటారు. కానీ, అది నిజం కాదని ఎన్నోసార్లు రుజువైంది'' అంటారు అమల్.

మహిళ

మగవాళ్లు ఏమనుకుంటున్నారు

''తొలిరాత్రి సంభోగం తరువాత పరుపుపై రక్తపు మరకలు కనిపించకపోతే మీరెలా స్పందిస్తారు'' అంటూ 20 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న 20 మంది పురుషులను బీబీసీ ప్రశ్నించింది.

అలా అడిగినవారిలో అవివాహితులు, పెళ్లయినవారు, విద్యావంతులు, డాక్టర్లు, టీచర్లు ఉన్నారు.

వారిలో ఎక్కువ మంది చెప్పినమాట రక్తపు మరకలు కనిపించడం కంటే కూడా నమ్మకం, అవగాహనలే సంతోషకరమైన వైవాహిక జీవితానికి పునాదని చెప్పారు.

ప్రేమా లేదు కోరికా లేదు...

కొన్ని నెలల తరువాత సొమయ్య తాను విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు భర్తకు చెప్పింది.

తొలి రాత్రి ఆయన చేసిన పని తనను ఎంత బాధించిందో కూడా చెప్పింది.

సొమయ్య మాట వినగానే ఇబ్రహిం షాకయ్యాడు. కానీ, ఆమెనలా ప్రశ్నించడానికి తనకు అర్హత ఉందని భావించిన ఆయన విడాకులిచ్చేందుకు నిరాకరించాడు. అంతేకాదు, అలాంటి తిరుగుబాటు ఆలోచనలు మానుకోవాలని సలహా కూడా ఇచ్చాడు.

తల్లిదండ్రులు కూడా ఆ మాత్రం విషయానికి విడాకులెందుకంటూ తనకు మద్దతివ్వలేదని సొమయ్య తెలిపారు.

ఆ తరువాత సొమయ్య సిరియా వదిలి ఐరోపా వెళ్లిపోయారు.

జంట

జుమానా (45 ఏళ్లు)

జుమానా 2016లో బెల్జియంలోని బ్రసెల్స్‌కు వెళ్లిపోవడానికి ముందు తన జీవితంలో ఎక్కువ కాలం సిరియాలోని అలెప్పోలో నివసించారు.

తన విడాకుల వ్యవహారం తేలడానికి 20 ఏళ్లు పట్టిందని 'బీబీసీ'తో ఆమె చెప్పారు.

''19 ఏళ్ల వయసులో నాకు ఇష్టం లేకుండానే మా బంధువు ఒకరిని పెళ్లి చేసుకోవాలని అమ్మానాన్న చెప్పారు''

''నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు. చదువుకోవాలనుకున్నాను. కానీ, బలవంతంగా పెళ్లి చేశారు.''

''తొలిరాత్రి ఆయన గదిలోకి వచ్చి తలుపు వేశాడు. బయట పెద్దవాళ్లంతా నీ కన్యత్వ రుజువు కోసం వెయిట్ చేస్తున్నారు. తొందరగా ముగిద్దాం అని చెప్పాడు'' అంటూ ఆ రాత్రి అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు జుమానా.

''సంభోగం తరువాత రక్తం మరక కనిపించకపోవడంతో నా భర్త కళ్లు నిప్పుకణికల్లా మారిపోయాయి. అప్పటికప్పడు ఈడ్చుకుంటూ నన్ను గైనకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాడు''

''ఆ డాక్టర్ నన్ను ఒక తండ్రిలా ఓదార్చారు'' అంటూ గుర్తు చేసుకున్న ఆమె తన భర్తను డాక్టర్ మందలించాడనీ చెప్పారు.

భర్త చేసిన అవమానం వల్ల విడాకులు తీసుకోవాలని జుమానా అనుకున్నారు. కానీ, కుటుంబసభ్యులెవరూ ఆమెకు మద్దతివ్వలేదు.

అలాగే అయిష్టంగానే, కలహాలతోనే 20 ఏళ్లు సంసారం చేసి నలుగురు పిల్లలను కన్నారామె.

పెళ్లయిన ఇరవయ్యేళ్ల తరువాత భర్తతో విడిపోయి బ్రసెల్స్ చేరుకున్నారు.

మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకోలేదని, చదుకోవాలన్న తన కోరికను తీర్చుకుంటానని జుమానా చెప్పారు.

మహిళ

కృత్రిమ పొర అమర్చకపోతే బతికుండేదాన్ని కాను: రోజానా

రోజానాకు బాగా పరిచయం ఉన్న కుటుంబంలోని యువకుడితో పెళ్లి కుదిరింది. కాబోయే భర్తను కొన్నిసార్లు బయట కలిసిన తరువాత ఒకసారి ఆయన బలవంతపెట్టడంతో ఇద్దరూ సెక్స్‌లో పాల్గొన్నారు.

కానీ, ఆ తరువాత ఇతర కారణాల వల్ల రెండు కుటుంబాలు దూరమయ్యాయి. దీంతో రోజానా పెళ్లి ఆగిపోయింది.

''కన్యత్వం కోల్పోతే ఏమవుతుందో నాకు తెలుసు. మరణమే అంతిమ శిక్ష. అలాంటి సమయంలో నా స్నేహితురాలు నాకు సాయం చేసింది. ఒక గైనకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లగా ఆమె చైనా తయారీ కృత్రిమ హైమన్ పొర అమర్చింది. ఆ సర్జరీ చేయకపోతే నన్నెప్పుడో చంపేసేవారు" అంటారు రోజానా.

జంట

అమీనాది మరో కథ..

సంప్రదాయ కుటుంబానికి చెందిన అమీనా ఒక రోజు బాత్రూం తలుపు తగిలి పడిపోయి గాయపడింది..

వెంటనే తల్లి ఆమెను గైనకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లింది. తల్లి భయపడినట్లే జరిగింది. అమీనా హైమన్ పొర చిట్లిందని వైద్యురాలు చెప్పింది.

చివరకు కుటుంబమంతా ఆలోచించి తనకు సర్జరీ చేసి మళ్లీ హైమన్ పొరను సరిచేశారని అమీనా తెలిపారు.

ఇలాంటి సర్జరీలు రహస్యంగా జరుగుతాయని.. అవి చట్ట విరుద్ధమని ఆమె చెప్పారు. అయితే, ప్రమాదవశాత్తు తాను హైమన్ పొరను కోల్పోయినా కూడా శస్త్రచికిత్స చేయించుకోకుంటే తన కన్యత్వం సందేహంలో పడుతుందని ఆమె అన్నారు.

అనేక ముస్లిం దేశాల్లో కొనసాగుతున్న ఆచారం

పలు అరబ్, ముస్లిం దేశాలలో చాలామంది మహిళలు వివాహానికి ముందు కన్యత్వ పరీక్షలు ఎదుర్కొంటారు.

ఇండోనేసియా, పలు ముస్లిం దేశాలలో ఆచరిస్తున్న ఇలాంటి కన్యత్వ పరీక్షలను హ్యూమన్ రైట్స్ వాచ్ ఖండించింది.

పలు దేశాల్లో వృద్ధ మహిళలు యువతులకు కన్యత్వ పరీక్షలు నిర్వహిస్తుంటారు. యోనిలో రెండు వేళ్లను చొప్పించి హైమన్ పొర ఉందో లేదో నిర్ధరిస్తుంటారు.

మధ్య ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా దేశాల్లో అనుసరిస్తున్న ఈ పద్ధతి గురించి హ్యూమన్ రైట్స్ వాచ్ 2014లో విడుదల చేసిన ఓ నివేదికలో, ''ఇది మహిళలకు వ్యతిరేకంగా చూపుతున్న తీవ్ర అవమానకరమైన వివక్ష'' అని పేర్కొంది.

బీబీసీ చేసిన ఓ అధ్యయనంలో అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాన్, ఈజిప్ట్, జోర్డాన్, లిబియా, మొరాకో, దక్షిణాఫ్రికా, భారత్, మరికొన్ని అరబ్ దేశాలలో కన్యత్వ పరీక్షలు ఎక్కువగా జరుగుతున్నట్లు తేలింది.

హ్యూమన్ రైట్స్ వాచ్ లెక్కల ప్రకారం ఈజిప్ట్, మొరాకో, జోర్డాన్, లిబియాల్లో ఇది ఎక్కువగా ఉంది.

అయితే, ఈజిప్ట్, మొరాకో ప్రభుత్వ వర్గాలు తమ దేశంలో ఇలాంటివి లేవని ఖండిస్తున్నాయి. తమ దేశంలో ఇవి చట్టవిరుద్ధమనీ చెబుతున్నాయి.

గమనిక: ఈ కథనంలో తమ అనుభవాలు చెప్పిన మహిళల పేర్లు మార్చాం

(నోట్: ఈ కథనం 2019 అక్టోబరు 30న మొదటిసారి ప్రచురితమైంది.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
hymen: Suspicion on the first night... 'Blood tests' killing women mentally
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X