India: ఇరాన్ దెబ్బకు బైబై ట్రంప్..! మళ్లీ పుతిన్ వైపు భారత్ చూపు?
ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel)చేస్తున్న దాడులు, వాటికి ప్రతిగా ఆ దేశం చేస్తున్న ప్రతిదాడులతో పశ్చిమాసియాలో పరిస్ధితులు నానాటికీ దిగజారుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ (india)కూ కష్టాలు తప్పేలా లేవు. దీంతో ఇప్పటి నుంచే కేంద్రం వాటికి సిద్దమవుతోంది. ముఖ్యంగా హార్ముజ్ జల సంధి నుంచి భారత్ కు రవాణా అయ్యే చమురు ట్యాంకర్లపై ఇరాన్ దాడులు చేస్తే తీవ్ర ఇబ్బందులు తప్పవు. అందుకే ప్రత్యామ్నాయంగా తిరిగి రష్యా వైపు మళ్లే అవకాశాల్ని కేంద్రం పరిశీలిస్తోంది.
భారత చమురు రవాణాపై ఇరాన్ దెబ్బ(india)
అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల తలెత్తే ఇంధన సరఫరా అస్థిరతను ఎదుర్కోవడానికి భారత్ తిరిగి రష్యన్ ముడి చమురు కొనుగోళ్లను పెంచుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు ఎన్టీడీవీకి వెల్లడించాయి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతుకు కీలకమైన మార్గమైన హార్ముజ్ జలసంధిని టెహ్రాన్ అనధికారికంగా మూసివేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. రష్యన్ ముడి చమురు కొనుగోళ్లను పెంచుకోవడం ద్వారా ఇంధన సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ భావిస్తోంది.

గతంలో వద్దనుకున్న వైనం
వాస్తవానికి ఫిబ్రవరి ప్రారంభంలో భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా.. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి బదులుగా వెనెజులాతో పాటు మధ్యప్రాచ్య దేశాల నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. అయితే ఇప్పుడు ఇరాన్ యుద్దం కారణంగా మధ్య ప్రాచ్య దేశాల నుంచి అయినా వెనెజులా నుంచి అయినా చమురు హార్ముజ్ జల సంధి మీదుగానే భారత్ కు రావాలి. అది కాస్తా నిలిచిపోయింది. దీంతో భారత్ అలర్ట్ అవుతోంది.

ట్రంప్ ఏమంటారో?
రష్యా చమురు కొనుగోళ్లు తగ్గిస్తామని ట్రంప్ కు హామీ ఇచ్చి సుంకాల్ని తగ్గించుకున్న భారత్.. ఇప్పుడు తిరిగి అదే ట్రంప్ మొదలుపెట్టిన ఇరాన్ యుద్ధం కారణంగా చమురు కొరత ఏర్పడి మళ్లీ రష్యా వద్దకు వెళ్లాల్సిన పరిస్ధితి ఎదురయ్యేలా ఉంది. ఈ పరిణామాల్ని రష్యా కూడా నిశితంగా గమనిస్తోంది. అయితే మళ్లీ రష్యా చమురు కొనుగోళ్లు మొదలుపెడితే ట్రంప్ ఎలా స్పందించారన్న భయం కూడా కేంద్రంలో లోలోపల ఉంది. అందుకే ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై ఆంక్షలు విధించడం, ఎల్పీజీ రేషనింగ్ చేపట్టడం వంటివి చేస్తోంది. దీంతో ప్రస్తుతానికి ఇంధన సంక్షోభం నుంచి బయటపడొచ్చు.












Click it and Unblock the Notifications