అమెరికాతో శాంతి వద్దు.. లొంగిపోవద్దు! ఇరాన్ వీధుల్లో రగిలిన భారీ నిరసన జ్వాల..!
అమెరికాతో తమ దేశం ఇవాళ కుదుర్చుకుంటున్న శాంతి ఒప్పందాన్ని (US-Iran Deal) వ్యతిరేకిస్తూ ఇరాన్లో నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు (Iran protests)చేపట్టారు. ఈ ఒప్పందం ద్వారా అమెరికాకు అడ్డగోలుగా లొంగిపోయారని ఆరోపిస్తూ ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్లపై నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్‌లోని పలు నగరాల్లో ఈ ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు పాకిస్తాన్ అధికారులు వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు కుదిరిన ఒప్పందంపై ఇవాళ సంతకాలు జరిగే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. అయితే, ఒప్పంద తుది గడువు విషయంలో ఇరాన్ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తూ కొంత ఆందోళన వ్యక్తం చేస్తోంది. స్వదేశంలో వ్యతిరేకత నేపథ్యంలో ఇరాన్ ఇలా దీనిపై ఆలోచించి ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ స్పందిస్తూ, ఇరుపక్షాలు శాంతి ఒప్పంద ముసాయిదాకు అంగీకరించాయని, దీనికోసం ఇస్లామాబాద్‌లో ఎలక్ట్రానిక్ సంతకాల కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. అయితే ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘేయ్ మాత్రం, "ఈ ఒప్పందం రేపే జరగకపోవచ్చు, కానీ రాబోయే రోజుల్లో కుదిరే అవకాశం ఉంది" అని స్పష్టం చేస్తూ తక్షణ సంతకాల వార్తలను కొట్టిపారేశారు.

టెహ్రాన్‌తో పాటు మషద్ నగరంలో నిరసనకారులు పెద్ద సంఖ్యలో గుమికూడి.. అవమానకరమైన రాజీకి పాల్పడిన విదేశాంగమంత్రి అరాగ్చీ నశించాలని, సిగ్గుపడాలని, లొంగిపోవడం ఆపాలని నినాదాలు చేస్తున్నారు. ఈ ఒప్పందం వల్ల ఇరాన్ వ్యూహాత్మక ప్రయోజనాలతో పాటు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిపై పట్టు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ఈ శాంతి ఒప్పందంలో భాగంగా హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్‌పై అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగించడం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. దీనికి బదులుగా ఇరాన్‌కు చెందిన బిలియన్ల డాలర్ల స్తంభింపజేసిన నిధులను విడుదల చేయడం, చమురు ఎగుమతులపై ఆంక్షలను సడలించడం వంటి అంశాలు కూడా చర్చల్లో ఉన్నాయి. ఈ ఒప్పందం కుదిరిన తరువాత 60 రోజుల పాటు ఇరాన్ అణు కార్యక్రమంపై ప్రత్యేక చర్చలు ప్రారంభమవుతాయి.












Click it and Unblock the Notifications