ఇరాన్ అకస్మాత్ నిర్ణయం- భారత్ లో మళ్లీ ఎల్పీజీ సంకటం: మొదటికొచ్చిన కథ?
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మళ్లీ దాడులు- ప్రతిదాడులు మొదలయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసివేస్తోన్నట్లు ఇరాన్ అకస్మాత్తుగా ప్రకటించింది. ఈ సంచలన పరిణామం చోటుచేసుకున్న కొద్ది గంటల్లోనే అమెరికా వైమానిక దళం ఇరాన్‌లోని వ్యూహాత్మక సైనిక స్థావరాలపై విరుచుకుపడింది. వైమానిక దాడులను నిర్వహించింది.
ఈ పరిణామాలు.. భారత్ లో మరోసారి ఎల్పీజీ, పెట్రోల్ సంక్షోభానికి తెర తీసే అవకాశాలు లేకపోలేదు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇరాన్ దాడులు ఆరంభమైన తర్వాత భారత్ తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సి వచ్చింది. ఎల్పీజీ సంక్షోభం తలెత్తింది అప్పట్లో. గ్యాస్ సరఫరాను ప్రాధాన్యతక్రమంలో పంపిణీ చేయాల్సి వచ్చింది. కమర్షియల్ సిలిండర్ ధరలు ఒక్కసారిగా ఆకాశానికి ఎగబాకాయి. రూ.3,100లను దాటేశాయి అప్పట్లో. హార్ముజ్ ను ఇరాన్ ఉన్నపళంగా మూసివేయడంతో మళ్లీ అటువంటి పరిస్థితులు తలెత్తవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి.

హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న సైప్రస్ జెండాతో ఉన్న ఎమ్ వీ జిఎఫ్ఎస్ గెలాక్సీ అనే కంటైనర్ నౌకపై ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) దాడి చేసింది. దీనికి దీటుగా సమాధానం ఇచ్చింది అమెరికా. ఇరాన్‌పై మరో విడత దాడులను ప్రారంభించినట్లు సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది.
హార్ముజ్ జలసంధిని మూసివేయడాన్ని సమర్థించుకుంది ఇరాన్. కొన్ని దేశాల నౌకలు తాము సూచించిన నిర్దేశిత సముద్ర మార్గదర్శకాలను పాటించట్లేదని, నేవిగేషన్ వ్యవస్థలను పూర్తిగా నిలిపివేస్తోన్నాయని తెలిపింది. అటువంటి నౌకను అడ్డుకోవడానికే ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని ఇరాన్ పేర్కొంది. ఈ రీజియన్ లో అమెరికా సైనిక జోక్యానికి పూర్తిగా తెరపడేంత వరకు హోర్ముజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.
ఇరాన్‌పై దాడులు కొనసాగితే ఆ ప్రాంతంలోని అమెరికా స్థావరాలతో పాటు వారి మిత్రదేశాల నౌకాదళ స్థావరాలను కూడా టార్గెట్ గా చేసుకుంటామని హెచ్చరించింది. ఇరాన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించిన కొద్ది గంటల్లోనే సెంట్ కామ్ దాడులకు దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సైప్రస్ పై మాత్రమే కాకుండా ఖతర్, సౌదీ అరేబియాకు చెందిన మరికొన్ని చమురు నౌకలపై కూడా ఇరాన్ దాడులకు పాల్పడిందని అమెరికా ఆరోపించింది.
పశ్చిమ ఆసియాలో యుద్ధాన్ని నివారించేందుకు పొరుగు దేశాలైన ఒమన్, ఖతార్, పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. హోర్ముజ్ జలసంధిలో నౌకల సురక్షిత ప్రయాణానికి సంబంధించి ప్రతిపాదించిన నూతన రవాణా ఒప్పందంపై చర్చించేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఒమన్ కు చేరుకున్నారు. దక్షిణ సముద్ర కారిడార్ గుండా నౌకలు ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తూ, ఇరాన్ ప్రాదేశిక జలాల్లోని ఉత్తర మార్గానికి ప్రత్యేక అనుమతి తప్పనిసరి చేయాలనేది ఒమన్ ప్రతిపాదన. దీనిపై ఇరాన్ చర్చలు మొదలు పెట్టింది.












Click it and Unblock the Notifications