ఫేస్‌బుక్ ద్వారా భర్తకు విడాకులు పంపిన మహిళ
న్యూయార్క్: సామాజిక మాధ్యమాలు స్నేహితులు, తెలిసిన వారి మధ్య సంబంధాలను పెంచేందుకే కాదు, విడిపోవడానికి కూడా ఉపయోగపడుతున్నాయి. ఇలాంటి ఘటనే అమెరికాలో చోటు చేసుకుంది. బ్రూక్‌లిన్‌కు చెందిన ఓ మహిళ తన భర్త నుంచి విడాకులను ఫేస్‌బుక్ ద్వారా పంపించింది. అది కూడా కోర్టు అనుమతితో కావడం గమనార్హం.
ఆమెకు అమెరికాలోని మన్హాటన్ కోర్టు ఫేస్‌బుక్ ద్వారా విడాకులు నోటీసు పంపడానికి అనుమతి మంజూరు చేసింది. వివరాల్లోకి వెళితే.. 2009లో ఎల్లనోర బైడో(26) అనే నర్సు, విక్టర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
అనంతరం ఎల్లనోరను విడిచి విక్టర్ ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. అయితే ఫేస్‌బుక్ ద్వారా ఆమెతో టచ్‌లో ఉంటున్నాడు. దీంతో విక్టర్‌తో విడిపోవాలని నిర్ణయించుకున్న ఎల్లనోర భర్తను కలసి విడాకులు నోటీసు ఇవ్వాలని ప్రయత్నించింది.

అతని ఆచూకీ లభించకపోవడంతో అది సాధ్యం కాలేదు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. సామాజిక మాధ్యమైన ఫేస్‌బుక్ ద్వారా తన భర్తకు విడాకులు పంపేందుకు అనుమతివ్వాలని మన్హాటన్ కోర్టు జడ్జి మథ్యూ కూపర్‌కు ఆమె విన్నించుకుంది. దీంతో ఆమె వాదనలు విన్న జడ్జి.. ఫేస్‌బుక్ ద్వారా తన భర్తకు విడాకుల నోటీసు పంపేందుకు ఎల్లనోరకు అనుమతిచ్చారు.
ఈ నేపథ్యంలో ఎల్లనోర తన భర్తకు ఫేస్‌బుక్ ద్వారా విడాకుల నోటీసు పంపింది. తనకు సహకరించి మద్దతుగా నిలిచిన కోర్టుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ విధమైన చట్టం తమకు న్యాయం చేసిందని చెప్పారు. ఇది ఇలా ఉండగా విడాకుల నోటీసు పంపిన ఎల్లనోరకు తన భర్త నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications