భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో రిలయన్స్ డేటా సెంటర్ కు ఆమోదం.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలివే!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగిన ఈ తొలి కేబినెట్ భేటీలో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం సమీపంలోని భీమిలి ప్రాంతంలో భారీ పెట్టుబడితో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఏర్పాటుకు మంత్రివర్గం సంపూర్ణ ఆమోదం తెలిపింది.
భీమిలి సమీపంలోని అమనం ప్రాంతంలో సుమారు రూ. 31,387 కోట్ల భారీ వ్యయంతో ఇంటెలిజెన్స్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వెయ్యి మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దీనితో పాటు భోగాపురం ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాల్లో రిలయన్స్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు కోసం 24.96 ఎకరాల భూమి కేటాయింపునకు కూడా కేబినెట్ పచ్చజెండా ఊపింది.

రాష్ట్రంలో సాంకేతిక రంగాన్ని మరియు డిజిటల్ మౌలిక వసతులను ప్రోత్సహించడంలో ఈ ప్రాజెక్టులు మైలురాళ్లుగా నిలవనున్నాయి. ప్రాంతాల వారీగా పారిశ్రామిక ప్రాజెక్టుల వివరాలను చూస్తే నాయుడుపేటలో రూ. 4,000 కోట్ల వ్యయంతో కార్బన్ కాస్మో బ్యాటరీ ప్లాంట్, తిరుపతిలో రూ. 700 కోట్లతో డిక్సన్ టెక్నాలజీస్ పరిశ్రమ ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అలాగే నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్‌లో హెటెరో గ్రూప్‌నకు 173.82 ఎకరాల భూ కేటాయింపులు ఖరారయ్యాయి.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా 30 ఎకరాల విస్తీర్ణంలో 'FLO ఇండస్ట్రియల్ పార్క్' ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతే కాదు విజయవాడ లో 15 మెగావాట్లతో ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు కూడా క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. రాం బిల్లిలో ఏ ప్యాక్ డేటా సెంటర్, అదానీ క్లౌడ్ హబ్ ప్రతిపాదన పరిశీలనకు ఆమోదం తెలిపారు.
రవళి స్పిన్నర్స్ విస్తరణకు రూ, 237 కోట్ల ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వటానికి క్యాబినెట్ ఆమోదించింది.రాఠీ గ్రీన్ ఎనర్జీకి ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్ న్యూజిలాండ్ ల్యాబొరేటరీస్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అన్నమయ్య జిల్లాలో స్కెచర్స్ గ్రూప్ ద్వారా 56.82ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ ఫుట్ వేర్ కాంపోనెంట్ పార్క్ కు ఆమోదం ఇచ్చారు.
నాయుడుపేట SEZలో గతంలో వెబ్‌సోల్ రిన్యూవబుల్స్, మెట్రో డెకరేటివ్ కంపెనీలకు చేసిన కేటాయింపులను రద్దుచేయాలని క్యాబినెట్ తీర్మానించారు.రాష్ట్రంలో రాబోయే గ్లోబల్ పార్టనర్‌షిప్ సమ్మిట్‌ను అత్యంత విజయవంతంగా నిర్వహించి, ప్రపంచ స్థాయి కంపెనీలను ఏపీకి రప్పించేందుకు తగిన కార్యాచరణను రూపొందించాలని ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు.













Click it and Unblock the Notifications
