ఐపీఎల్ స్టార్ ప్లేయర్ల మార్పిడికి గ్రీన్ సిగ్నల్- లీగ్ ఫీజుపై అన్ హ్యాపీ
ఐపీఎల్ లో ఓ కీలక ట్రేడింగ్ పూర్తయింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్, టీమిండిచా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, పంజాబ్ కింగ్స్ స్టార్ పేస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ పరస్పరం జట్లు మారడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. స్వాపింగ్ పద్ధతిన వీరిద్దరూ జట్లు మారనున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై బీసీసీఐ ఆమోదముద్ర వేసింది. దీంతో ఇరు ఫ్రాంచైజీ యాజమాన్యాల నుంచి ఇంకాస్సేపట్లో ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఈ మార్పిడి ప్రక్రియలో ఇద్దరు క్రికెటర్ల లీగ్ వేతనాల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడం విశేషం. పాత కాంట్రాక్ట్ లీగ్ ఫీజు ప్రకారమే వారు తమ తమ నూతన జట్లల్లో కొనసాగుతారు. ఈ తాజా ఒప్పందం ప్రకారం హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌లో తీసుకున్న 16.35 కోట్ల రూపాయల మొత్తంతోనే పంజాబ్ కింగ్స్ జట్టులో చేరనున్నాడు. 2025 ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ రైట్ టు మ్యాచ్ కార్డ్ ఉపయోగించి రూ. 18 కోట్లకు దక్కించుకున్న అర్ష్‌దీప్ సింగ్ కూడా అదే మొత్తానికి ముంబై ఇండియన్స్ గూటికి చేరనున్నాడు.

ఈ ప్రతిపాదిత ట్రేడ్ వల్ల రెండు ఫ్రాంచైజీల వ్యూహాత్మక సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి. ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రధానంగా డెత్ ఓవర్లలో వికెట్లు తీసే పదునైన భారతీయ పేసర్ అవసరం ఉండేది. ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్ రాకతో ముంబై పేస్ విభాగం మరింత బలంగా మారనుంది. కొత్త బంతితో పాటు ఇన్నింగ్స్ ఆఖర్లల్లో ప్రత్యర్థులను కట్టడి చేయడంలో అర్ష్‌దీప్ నైపుణ్యం ముంబైకి ప్లస్ పాయింట్ కానుంది.
హార్దిక్ పాండ్యా రూపంలో ఒక ప్రపంచ స్థాయి ఆల్‌రౌండర్ పంజాబ్ కింగ్స్ జట్టుకు లభించినట్టయింది.. ఈ డీల్ తో. మిడిల్ ఆర్డర్‌లో వేగంగా పరుగులు సాధించడంతో పాటు సీమ్ బౌలింగ్ చేయగల హార్దిక్.. ఆ జట్టుకు ప్రధాన బలంగా మారనున్నాడు. గతంలో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లకు నాయకత్వం వహించిన సుదీర్ఘ అనుభవం పంజాబ్ కెప్టెన్సీ ఎంపికకు కూడా ఉపయోగపడనుంది. శ్రేయాస్ అయ్యర్ గైర్హాజరీలో జట్టుకు కేప్టెన్సీ వహించవచ్చు.
పంజాబ్ కింగ్స్ గత సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. 2014 తర్వాత మొదటిసారిగా ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. రాబోయే సీజన్‌లో కూడా శ్రేయస్ కెప్టెన్‌గా కొనసాగనుండగా హార్దిక్ పాండ్యా ప్లేయర్ గా మాత్రమే జట్టుకు అందుబాటులో ఉంటాడు. మిడిలార్డర్‌లో వేగంగా పరుగులు సాధించడంతో పాటు కీలక సమయాల్లో వికెట్లు తీయగల హార్దిక్ రాక పంజాబ్ జట్టు బ్యాలెన్స్, మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యాన్ని మరింత పెంచే అవకాశం లేకపోలేదు.













Click it and Unblock the Notifications
