న్యూజీలాండ్ కేబినెట్ మంత్రిగా ప్రియాంక: కీలక శాఖలు: ఎవరామె?:
వెల్లింగ్టన్: ప్రపంచ రాజకీయాల్లో భారతీయులు సత్తా చాటుతున్నారు. అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్ష పదవికి భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ పోటీ పడుతోన్న వేళ.. భారతీయ మహిళ ఒకరు న్యూజీలాండ్ కేబినెట్‌లో చోటు సంపాదించారు. ప్రధానమంత్రి జెసిండ్రా ఆర్డెర్న్ మంత్రివర్గంలో కీలక శాఖను అందుకున్నారు. ఓ భారతీయ మహిళకు న్యూజీలాండ్ కేబినెట్‌లో బెర్త్ దక్కడం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఆమె ప్రతిభను గుర్తించిన జెసిండ్రా.. ఆమెకు కీలక శాఖను అప్పగించారు.
కొద్దిసేపటి కిందటే ఆమె రాజధాని వెల్లింగ్టన్‌లో కేబినెట్ మంత్రుల జాబితాను ప్రకటించారు. ఈ జాబితాలో ప్రియాంకా రాధాకృష్ణన్‌కు చోటు లభించింది. ఆమెకు యువజన వ్యవహారాలు, సామాజికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన, డైవర్సిటీ, ఎథ్నిక్ కమ్యూనిటీస్ శాఖలను అప్పగించారు. ప్రియాంకా రాధాకృష్ణన్.. మలయాళీ. కేరళలోని ఎర్నాకుళం జిల్లా పరవూర్ ఆమె స్వస్థలం. పరవూర్‌కు చెందిన రామన్ రాధాకృష్ణన్, ఉషా దంపతులకు ఆమె జన్మించారు. అనంతరం ఆ కుటుంబం చెన్నైలో స్థిరపడింది. ప్రియాంకా విద్యాభ్యాసం సింగపూర్, న్యూజీలాండ్‌లో కొనసాగింది.

విక్టోరియా యూనివర్శిటీ నుంచి డెవలప్‌మెంట్ స్టడీస్‌లో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. న్యూజీలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌కు చెందిన ఐటీ ఉద్యోగి రిచర్డ్‌సన్‌ను పెళ్లి చేసుకున్నారు. ఒటీరొవాలో స్థిరపడ్డారు. 15 సంవత్సరాల కిందటే ప్రియాంకా..

లేబర్ పార్టీలో చేరారు. క్రమంగా ఎదిగారు. వరుసగా రెండుసార్లు ఆ దేశ పార్లమెంట్ హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌కు ఎన్నికయ్యారు. తాజాగా ఈ దేశ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ఇదివరకు ఆమె ఎథ్నిక్ కమ్యూనిటీస్ మంత్రి జెన్నీ సలేసా వద్ద ప్రైవేట్ సెక్రెటరీగా పనిచేశారు.












Click it and Unblock the Notifications