జిన్ పింగ్-పుతిన్ ను కలిసేందుకు రైలెక్కి వచ్చేసిన కిమ్..!
కమ్యూనిస్టు దేశాలైన చైనా, రష్యా, ఉత్తర కొరియా అధినేతలు షీ జిన్ పింగ్, వ్లాదిమీర్ పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ ముగ్గురూ మరోసారి ఒకే వేదికపై ప్రత్యక్షమయ్యారు. బీజింగ్ లో ఇవాళ జరుగుతున్న మిలిటరీ పరేడ్ లో పాల్గొనాలని చైనా నుంచి అందిన ఆహ్వానం మేరకు పుతిన్ తో పాటు కిమ్ జోంగ్ ఉన్ కూడా హాజరయ్యారు. అయితే పుతిన్ ప్రత్యేక విమానంలో బీజింగ్ చేరుకోగా.. కిమ్ మాత్రం ప్రత్యేక ప్రైవేటు రైళ్లో ప్రయాణించి చేరుకున్నారు.
కిమ్ ఇతర దేశాల నేతల కంటే ఆలస్యంగా పాంగ్యాంగ్ నుండి చైనాలో జరిగే పరేడ్ లో పాల్గొనడానికి బయలుదేరారు. విదేశాంగ మంత్రి చో సోన్-హుయ్, ఇతర సీనియర్ అధికారులతో కలిసి ప్రత్యేక బుల్లెట్ ఫ్రూఫ్ ను బుక్ చేసుకుని మరీ ఆయన బీజింగ్ కు బయలుదేరారు. దారి పొడవునా ఈ ప్రత్యేక రైలుకు అంతే స్ధాయిలో ప్రత్యేక భద్రత కల్పించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి ప్రకటనను ఉటంకిస్తూ అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ప్రకటన చేసింది.

2023లో పుతిన్ తో చర్చల కోసం కిమ్ రష్యా వెళ్లారు. ఆ తర్వాత ఆయన చేసిన తొలి విదేశీ పర్యటన ఇదే. చైనాకు అయితే 2019 తర్వాత రావడం ఇదే తొలిసారి. బీజింగ్‌లో ప్రస్తుతం రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన 80వ వార్షికోత్సవాన్ని గుర్తుచేసుకునేందుకు సైనిక కవాతు జరుగుతోంది. ఇందులో షీ జిన్ పింగ్ తో పాటు పుతిన్‌లతో కలిసి కిమ్ పాల్గొంటున్నారు. ముఖ్యంగా పుతిన్, జిన్ పింగ్ ను కలిసేందుకు కిమ్ ఇలా రైల్లో ప్రయాణించి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అమెరికా, దాని మిత్రదేశాల ఆంక్షల నేపథ్యంలో ఉత్తర కొరియాకు చైనా అండగా నిలుస్తోంది. తాజాగా కిమ్ రష్యాకు కూడా దగ్గరయ్యారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి మద్దతుగా కొరియా ఆయుధాలు, దళాలను సరఫరా చేసిందని అమెరికా, దక్షిణ కొరియా అధికారులు ఆరోపించారు. ఇప్పుడు నేరుగానే పుతిన్ , జిన్‌పింగ్‌లతో పాటు కిమ్ కనిపించడం ముగ్గురు నాయకుల మధ్య బలపడుతున్న సంబంధాలను గుర్తుచేస్తోంది.












Click it and Unblock the Notifications